స్కూల్ అనగానే పదులు, వందల సంఖ్యలో విద్యార్థులు ఉంటారని భావిస్తాం. పైగా అంతమంది విద్యార్థులకు చదువు చెప్పే టీచర్లకు పెద్దగా జీతాలు కూడా ఉండవు. అయితే, ఆ ప్రాంతంలో ఉన్న స్కూల్‌లో కేవలం ముగ్గురే విద్యార్థులు ఉంటారు. అక్కడ టీచర్‌గా పనిచేస్తే రూ.57 లక్షల వరకు జీతాన్ని అందుకోవచ్చు. వావ్.. భలే ఉందే ఉద్యోగం.. ‘‘ఎక్కడో చెప్పండి.. ట్రై చేస్తా..’’ అని అనబోతున్నారు కదూ. అయితే, ఒక్కసారి ఆలోచించండి. అంత తక్కువ మంది పిల్లలకు చదువు చెప్పేందుకు అంత ఎక్కువ జీతం ఇస్తున్నారంటే ఏదో తిరకాసు ఉంటుంది. మరి, ఏమిటా తిరకాసు? ఆ స్కూల్ ఎక్కడ ఉంది? 


ఈ స్కూల్‌లో టీచర్‌గా చేరాలంటే ఫెయిర్ ఐల్ అనే దీవికి వెళ్లాలి. స్కాట్‌ల్యాండ్‌లోని ఓర్కనే, షెట్‌ల్యాండ్‌కు మధ్యలో ఉన్న ఈ దీవి ఉంది. 1,900 ఎకరాలు విస్తరించి ఉన్న ఈ దీవిలో కేవలం 51 మంది మాత్రమే నివసిస్తున్నారు. ఇక్కడి పిల్లల కోసం ఒకే ఒక్క స్కూల్ ఉంది. కేవలం ముగ్గురు విద్యార్థులు మాత్రమే ఈ స్కూల్‌లో చదువుతున్నారు. ఇక్కడ చదువు పూర్తి చేసుకున్న తర్వాత సెకండరీ ఎడ్యుకేషన్ కోసం షెట్‌ల్యాండ్‌‌కు వెళ్తారు. 


ఎత్తైన కొండలాంటి దీవి ఇది. సముద్రం మధ్యలో ఈ దీవి ఉండటం వల్ల వాతావరణం ఎప్పుడూ భయానకంగా ఉంటుంది. ఈ ప్రాంతం 27 రకాల అరుదైన పక్షులకు ఆవాసం. దీంతో ఈ దీవి బాధ్యతలను స్కాట్‌లాండ్ నేషనల్ పార్క్‌కు అప్పగించారు. అయితే, ప్రకృతి అందాలను ఇష్టపడేవారికి ఈ దీవి నచ్చేస్తుంది. ఇక్కడ హెడ్ టీచర్ నియామకం కోసం వేసిన ప్రకటనలో కూడా ఇదే విషయాన్ని తెలిపారు. ‘‘ఇది చాలా అందమైన, మనోహరమైన ప్రదేశం. ప్రపంచ ప్రఖ్యాత నిట్వేర్ , సముద్ర పక్షులకు ఈ ప్రసిద్ధి చెందిన దీవి ఇది’’ అని పేర్కొన్నారు. ఈ ఉద్యోగంలో చేరే హెడ్ టీచర్‌కు ఇల్లు కూడా ఇస్తామని తెలిపారు. 


‘‘జీవితంలో ఒక్కసారే ఇలాంటి అవకాశం వస్తుంది. ఈ స్కూల్‌లో చేరే టీచర్‌కు ఏడాదికి 56,787 పౌండ్లు (భారత కరెన్సీ ప్రకారం రూ.57,45,042) జీతం లభిస్తుంది. ఇది కాకుండా స్కాట్‌లాండ్ ప్రభుత్వం ఏడాదికి 2,265 పౌండ్లు (రూ.2,29,146) చొప్పున జీతాన్ని పెంచుతుంది’’ అని ప్రకటనలో తెలిపారు. సుదూర ప్రాంతాల్లో పనిచేయడానికి వెళ్లే ఉద్యోగులకు ఇలాంటి బంపర్ ఆఫర్లు ప్రకటిస్తూ ఆకట్టుకోవడం స్కాట్‌లాండ్ ప్రభుత్వం ప్రత్యేకత. అక్కడే పనిచేయాలని ఒత్తిడి చేయరు. భారీ జీతాలను, సదుపాయాలను కల్పించి.. ఆశలు రెకెత్తిస్తారు. తాజాగా ప్రకటించిన ఉద్యోగం కూడా అలాంటిదే. 


1957లో స్కాట్‌లాండ్‌కు చెందిన నేషనల్ ట్రస్ట్ స్వాధీనం చేసుకుంది. షెట్‌ల్యాండ్ నుంచి ఇక్కడికి చేరాలంటే సుమారు 25 మైళ్లు ప్రయాణించాలి. ఈ ఉద్యోగంలో చేరేందుకు దరఖాస్తు చేసే అభ్యర్థులను ఈ దీవిలోనే ఇంటర్వ్యూ చేస్తారు. వారి ప్రయాణ ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. ఇల్లు మారేందుకయ్యే ఖర్చులను కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. 


ఈ స్కూల్‌లో హెడ్ టీచర్‌తోపాటు లెర్నింగ్ సపోర్ట్ అసిస్టెంట్లు కూడా ఉంటారు. టీచర్ క్లాసులు చెబితే.. విద్యార్థులు వాటిని చదివి, అర్థం చేసుకొనేలా చేయడం సపోర్ట్ అసిస్టెంట్ల బాధ్యత. ఇక ఈ దీవి విషయానికి వస్తే.. ఇక్కడి ప్రజలు చాలా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. నేరాలకు అవకాశమే లేదు. అంతా వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తున్నారు. ఒకరినొకరు గౌరవించుకుంటూ ఆదర్శంగా గడుపుతున్నారు. ఇలాంటి ప్రాంతంలో పనిచేయడమంటే.. నిజంగా అదృష్టమనే చెప్పుకోవాలి. 


ఇదే ఆ దీవి (వీడియో):


Also Read: హిమాలయన్ సాల్ట్ అంటే ఏమిటీ..? ఇది ఆరోగ్యానికి మంచిదేనా?


Also Read: వేడి నీళ్లు vs చన్నీళ్లు.. ఏ నీటితో స్నానం చేస్తే ఆరోగ్యం?