అఫ్గానిస్థాన్ ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత ఆ దేశంలో పరిస్థితులు భయంకరంగా మారిపోతున్నాయి. అక్కడ ఏం జరుగుతుందో అని ప్రపంచమంతా ఆందోళన చెందుతోంది. తాలిబన్లు షరియా చట్టాలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. మరోసారి రాక్షస రాజ్యం వచ్చిందని అఫ్గాన్ వాసులు భయపడుతున్నారు. అఫ్గాన్ కు అండగా ఉంటామన్న మాటని తప్పి ప్రపంచానికే పెద్దన్నగా చెప్పుకునే అమెరికా తన సేనలు ఉపసంహరించుకుంది. రాత్రికి రాత్రే కాబూల్ వాసులను రోడ్లపై వదిలేసింది. అమెరికా ఇలా చేయడంపై రకరకాల వాదనలున్నాయి. అయితే ఆప్ఘనిస్తాన్ పునర్నిర్మాణానికి భారత్ సహకారం అందించింది. ఇప్పటి వరకూ రూ.22 వేల కోట్లు అఫ్గాన్ అందించింది. అఫ్గానిస్థాన్ తాలిబన్ల చేతిలోకి వెళ్లడంతో ఈ రూ. 22 వేల కోట్లు బూడిదలో పోసినట్లేనని విశ్లేషకులు అంటున్నారు.
భారత్ సొమ్ము అఫ్గాన్ లో ఖర్చు
2020 నవంబర్‌లో జెనీవాలో జరిగిన సమావేశంలో అఫ్గానిస్థాన్ లోని 34 ప్రాంతాల్లో 400 పనులు చేపట్టినట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. కిందటేడాది రూ.600 కోట్లతో 100 కమ్యూనిటీ హాల్స్ కట్టినట్లు తెలిపారు.
సల్మా డ్యామ్
సల్మా డ్యామ్ ను హెరాత్ ప్రాంతంలో నిర్మించారు. దీనిని అఫ్గాన్- ఇండియా ఫ్రెండ్ షిప్ డ్యామ్ అని చెబుతారు. ప్రధాని నరేంద్రమోదీ, అప్పటి అఫ్గాన్ అధ్యక్షుడు కలిసి 2016లో దీనిని ప్రారంభించారు .ఈ బంధం ఇలాగే కొనసాగుతుందని ప్రకటించారు. దీనికి అయిన ఖర్చు దాదాపు రూ.2 వేల కోట్లు. ఇది కూడా తాలిబన్ల చెరలోకి వెళ్లిపోయింది.
Also Read: Explosion Outside Kabul airport: కాబూల్‌లో జంట పేలుళ్లు.. 72 మంది మృతి
జరాంజ్-దెలారాం హైవే..
అఫ్గాన్ లోని 218 కిలోమీటర్ల హైవే ఈ ప్రాజెక్టు. దీనిని రూట్ 6 ఓ 6 అంటారు. ఈ ప్రాజెక్టు సముద్ర మార్గం ద్వారా చేసే వ్యాపారానికి చాలా ముఖ్యం. ఈ హైవే ఇరాన్ లో భారత్ నిర్మిస్తున్న చార్‌బాహర్ నౌకాశ్రయం నుంచి అఫ్గాన్ లోని ప్రముఖ జాతీయ రహదారిని నేరుగా కలుపుతుంది. దీని కోసం దాదాపు రూ.1100 కోట్లు ఖర్చు చేశారు. ఈ రోడ్డు నిర్మాణ పనుల్లో 11 మంది భారతీయులు, 129 మంది అఫ్గాన్ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
అఫ్గానిస్తాన్ పార్లమెంట్
తాలిబన్లు బందూకులు పట్టుకుని ప్రెస్‌మీట్లు పెట్టిన పార్లమెంట్ భవనం నిర్మించింది కూడా భారతే. ఇందుకోసం రూ.670 కోట్లు ఖర్చు చేశారు. ప్రధాని మంత్రి నరేంద్రమోదీ 2015లో ఈ మాట చెప్పారు. విద్యుత్, టెలికాం రంగాల్లో భారతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. భారత్ అఫ్గానిస్తాన్‌లో చాలా ఆసుపత్రులు కట్టించింది. 2019 నాటికి రెండు దేశాల మధ్య దైపాక్షిక వాణిజ్యం విలువ రూ.9600 కోట్లు. తాలిబన్ల రాకతో ఈ వాణిజ్యానికి బ్రేక్ పడింది. అఫ్గాన్ నుంచి భారత్ ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ దిగుమతి చేసుకుంటుంది. ఇప్పుడు దిగుమతులు నిలిచిపోవడంతో దేశంలో వీటి రేట్లు అమాంతం పెరిగిపోయాయి.
పాక్ తో తాలిబన్ల దోస్తీ
అఫ్గాన్- భారత్ మైత్రీ బంధానికి ప్రతీకగా చెప్పుకునే సల్మా డ్యామ్ పై గతంలో తాలిబన్లు రాకెట్లతో దాడులు చేశారు. అఫ్గాన్ సైనికులు వాటిని అడ్డుకున్నారు. భారత్ తో తాలిబన్లు ఎలా వ్యవహరిస్తారో పెద్ద ప్రశ్నగా మారింది. కాందహార్ హైజాక్ భారత్ ఎప్పటికీ మర్చిపోలేదు. అప్పట్లో ఓ విమానాన్ని పాక్ తీవ్రవాదులు హైజాక్ చేసి తాలిబన్ల ఆధీనంలో ఉన్న కాందహార్‌కు తీసుకెళ్లింది. దేశం ఈ ఘటనను ఎప్పటికీ మర్చిపోలేదు. ఇది పాక్ తాలిబన్ల మైత్రికి సంకేతం. అఫ్గాన్ ను ఆక్రమించుకునేందుకు పాక్ సహాయం అందించింది. దీంతో తాలిబన్లు పాకిస్తాన్ కాదని భారత్ తో సంబంధాలు కొనసాగిస్తారనేది సందేహమే. తాలిబన్ల అఫ్గాన్ తో భారత్ వ్యవహారాలు ఇప్పుడు మోదీ ప్రభుత్వానికి సవాల్ గా మారాయి.
Also Read: Afghanistan Drone Attack: కాబుల్ పేలుళ్లపై అమెరికా ప్రతీకారం.. ఆ శిబిరాలపై యూఎస్ డ్రోన్ దాడులు