‘క్యూ న్యూస్‌’ అధినేతగా ఉన్న తీన్మార్‌ మల్లన్నను ఉప్పల్‌లోని ఆయన నివాసం నుంచి పోలీసులు అదుపులోకి తీసుకొని వెళ్లారు. తన వద్ద నుంచి డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారని మారుతీ జ్యోతిష్యాలయ నిర్వహకుడు సన్నిదానం లక్ష్మీకాంత శర్మ ఫిర్యాదు మేరకు కేసు పెట్టినట్లుగా పోలీసులు వెల్లడించారు. ఈ కేసు విషయంలో నోటీసు ఇచ్చి ఈ నెల 3వ తేదీన చిలకలగూడ పోలీస్‌ స్టేషన్‌లో విచారణ జరిపామని తెలిపారు. 


ఈ నెల 8న మరోసారి విచారణకు హాజరు రావాలని మల్లన్నను కోరగా.. కరోనా పాజిటివ్‌ ఉన్నందున రావడం కుదరడం లేదని తన న్యాయవాది ద్వారా సమాచారం పంపారని పోలీసులు వెల్లడించారు. ఆ విచారణకు మల్లన్న హాజరు కాలేదన్నారు. ఈ నేపథ్యంలో ఆయనను శుక్రవారం రాత్రి ఆయనను తన నివాసంలోనే అరెస్టు చేశామని హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ ప్రకటించారు. మల్లన్నను ఈ రోజు (ఆగస్టు 28) ఉదయం కోర్టులో పోలీసులు హాజరు పరచనున్నట్లు తెలిపారు.


సికింద్రాబాద్ సీతాఫల్ మండిలోని మధురానగర్‌లో ‘మారుతీ జ్యోతిష్యాలయం’ పేరుతో ఓ సంస్థను సన్నిదానం లక్ష్మీకాంత శర్మ నిర్వహిస్తున్నారు. తీన్మార్ మల్లన్న తన వద్ద నుంచి రూ.30 లక్షలు డిమాండ్‌ చేస్తున్నాడని ఏప్రిల్‌ 22న ఈయన చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డబ్బులు ఇవ్వకపోవడంతో తన గురించి క్యూ న్యూస్‌లో తప్పుడు కథనాలు ప్రసారం చేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, రాజకీయ కుట్రలో భాగంగానే తనపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేశారని తీన్మార్ మల్లన్న ఆరోపించారు. దీనిపై న్యాయపరంగా పోరాటం చేస్తామని మల్లన్న తెలిపారు.


ప్రస్తుతం సైబర్‌క్రైమ్‌ స్టేషన్‌లో రెండు, చిక్కడపల్లి, జూబ్లీహిల్స్‌లో నవీన్‌పై ఒక్కో కేసు నమోదైంది. మరో కేసులో ఆయన కార్యాలయాన్ని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తనిఖీ చేశారు. కొద్ది రోజుల క్రితం కూడా తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూ న్యూస్ కార్యాలయంలో సైబర్ క్రైమ్ పోలీసులు సోదాలు చేసిన సంగతి తెలిసిందే. కీలక హార్డ్ డిస్కులను, ఇతర సామగ్రిని పోలీసులు ఎత్తికెళ్లినట్లుగా అప్పుడు తీన్మార్ మల్లన్న ఆరోపించారు.


టీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్‌ఛార్జి ఫిర్యాదు
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై క్యూ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని టీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్‌ఛార్జి మన్నె క్రిషాంక్ సైబర్ క్రైం పోలీసులకు మూడు రోజుల క్రితం ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో క్యూ న్యూస్ కార్యాలయం, ఇంటిలో ఏక కాలంలో దాడులు చేశారు. సైబర్ క్రైమ్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈ సోదాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యాలయం నుంచి రెండు సెల్‌ఫోన్లు, రెండు కంప్యూటర్లు, 40 హార్డ్ డిస్కులతోపాటు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫొటోలకు మీసాలు తగిలించి మల్లన్న తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా వారిని అవమాన పరుస్తున్నారని ఓయూ విద్యార్థి రామారావు గౌడ్ కూడా ఫిర్యాదు చేశారు.