ఏడాదికి దేశంలో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న ప్రధాని మోదీ హామీపై బండి సంజయ్‌ ఏం చెప్తారని మంత్రి కేటీఆర్ నిలదీశారు. ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్మేస్తున్న వేళ ప్రజా సంగ్రామ యాత్రలో బీజేపీ హామీల గురించి ఏం చెప్పుకుంటారని ప్రశ్నించారు. తెలంగాణలో జరుగుతున్న మంచి పనులను, ప్రజల కళ్లలో సంతోషాన్ని చూసి మోదీకి చెప్పాలని ఎద్దేవా చేశారు. జన్ ధన్ ఖాతాలో ధన్ ధన్ పంద్రా లాఖ్ వేస్తానని మోదీ చెప్పారని.. దానికి ఏం సమాధానం చెబుతావని ప్రశ్నించారు. పెట్రోల్, సిలిండర్ ధరలు ఏ స్థాయిలో పెంచారో గుర్తు చేసుకోవాలని సూచించారు. తెలంగాణ భవన్‌లో మంత్రి శుక్రవారం మీడియాతో మాట్లాడారు.


‘‘రాష్ట్రంలో మేం 1,32,899 ఉద్యోగ నియామకాలు చేశాం. దానికి సంబంధించిన శ్వేత పత్రం కూడా విడుదల చేశాం. దేశంలో ఎక్కడా లేనట్లుగా ప్రభుత్వ నియామకాల్లో 95 శాతం స్థానికులకే రిజర్వేషన్ కల్పించేలా రాష్ట్రపతి చేత ఆమోదముద్ర వేయించుకున్నాం. మిగిలిన 50 వేల ఉద్యోగాలను కూడా త్వరలోనే భర్తీ చేయిస్తాం. కేంద్రంలోనూ 8 లక్షల పైచిలుకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. బండి సంజయ్, కిషన్ రెడ్డి వాటి గురించి ఎందుకు మాట్లాడరు? మౌలాలీలో 21 ఎకరాల రైల్వే భూమిని అమ్మకానికి పెడుతున్నరని ఇవాళే పేపర్లో వచ్చింది. డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తం. ఒక నాలుగైదెకరాలు మాకు ఇవ్వమంటే ఇయ్యరు. కేంద్ర ప్రభుత్వం విక్రయిస్తున్న రూ.6 లక్షల కోట్ల అమ్మకాల్లో ఇది కూడా ఒకటి.’’ అని కేటీఆర్ అన్నారు.


రేవంత్ చిలక మనదే.. పలుకు పరాయిది..
‘‘రేవంత్ రెడ్డి స్థాయేంటో అందరికీ తెలుసు. ఆయన ఎవరి మనిషిగా ఇక్కడ మాట్లాడుతున్నారో కూడా అందరికీ తెలుసు. ఆ చిలక మనదే.. పలుకు పరాయిది. ఆయన వెనక ఉన్నదెవరో.. మాట్లాడించేది ఎవరో..నాకే కాదు.. అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు ఫ్రాంఛైజీ లాగా తీసేసుకున్నాడు. రేవంత్‌ను బొమ్మ లెక్క నడిపిస్తుండు. చంద్రబాబు ఆడించే తోలుబొమ్మలాటలో ఒక బొమ్మ అంతే. ఈ గజ్వేల్ సభ అంతా లొల్లి ఎందుకు? మంత్రి మల్లన్న చెప్పినట్లు రాజీనామా చెయ్ సూద్దం. అడనే చూస్కుందం.’’ అని కేటీఆర్ అన్నారు.


సెప్టెంబరు ఆఖరికల్లా కమిటీల నియామకం పూర్తి
సెప్టెంబర్ 2న రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో జెండా పండుగ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. సెప్టెంబర్ 2న జెండా పండుగ కార్యక్రమాలు ఉంటాయని, అదే రోజున ఢిల్లీలో తెలంగాణ భవన్ ప్రారంభించే కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారని చెప్పారు. సెప్టెంబర్ ఆఖరులోపు గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీల నియామకాన్ని పూర్తి చేయనున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో 150 డివిజన్ల‌కు 150 డివిజన్ కమిటీలు ఉంటాయని తెలిపారు. కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 51 శాతానికి పైగా అవకాశం ఉంటుందని వెల్లడించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌ను మించి ఢిల్లీలో నిర్మించబోయే తెలంగాణ భవన్‌ ఉంటుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.