కాబుల్‌లో వరుస పేలుళ్లకు సంబంధించి అమెరికా ప్రతీకారం తీర్చుకుంది. ఈ మేరకు అఫ్గానిస్థాన్‌లోని ఐసీస్ స్థావరాలు లక్ష్యంగా అమెరికా దాడులు చేసింది. మానవ రహిత డ్రోన్లతో ఐసీస్ స్థావరాలపై దాడులకు దిగింది. ఈ విషయాన్ని పెంటగాన్ ఓ ప్రకటనతో తెలిపినట్లుగా ఏఎఫ్‌పీ వార్తా సంస్థ వెల్లడించింది.


అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించిన వివరాల ప్రకారం.. అఫ్గానిస్థాన్‌లోని నంగహర్ ప్రావిన్స్‌లో అమెరికా డ్రోన్ దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో అఫ్గాన్ పౌరుల విషయంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని రక్షణ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. ‘‘అమెరికా మిలిటరీ దళం ఉగ్రవాద నిర్మూలనలో భాగంగా ఐసీస్-కే (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ ది లేవాంట్-ఖోరసాన్ ప్రావిన్స్) లక్ష్యంగా దాడులు చేపట్టింది. అఫ్గానిస్థాన్‌లోని నంగహార్ ప్రావిన్స్‌లో మానవ రహిత డ్రోన్ దాడులను చేపట్టింది. ప్రాథమిక సమాచారం ప్రకారం మేం మా లక్ష్యాలను పూర్తిగా అంతం చేశాం.’’ అని యూఎస్ సెంట్రల్ కమాండ్ అధికార ప్రతినిధి కెప్టెన్ బిల్ అర్బన్ శుక్రవారం(స్థానిక కాలమానం) ప్రకటించారు. ఈ దాడుల్లో అఫ్గాన్ పౌరులు మరణించలేదని చెప్పారు.


వారిని క్షమించబోం: బైడెన్
డ్రోన్ దాడులకు కొన్ని గంటల ముందే వైట్ హౌజ్‌లో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మాట్లాడుతూ.. కాబుల్ దాడులకు కారకులైన వారు ఇక ఎట్టిపరిస్థితుల్లో ఈ భూమిపై జీవించేందుకు అర్హులు కాదని తేల్చి చెప్పారు. ఈ దాడికి పాల్పడిన వారిని, అమెరికా నుంచి హాని కోరుకుంటున్నట్లే. వీరిని ఎట్టిపరిస్థితుల్లోనూ మేం క్షమించబోం. తగిన మూల్యం చెల్లించుకునేదాకా వెంటాడతాం’’ అని జో బైడెన్ అన్నారు. అయితే, ఆయన ఆ మాటలను ఒకేరోజులో నిజం చేశారని తాను అనుకుంటున్నట్లుగా వైట్ హౌజ్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ శుక్రవారం విలేకరులతో అన్నారు.






కాబుల్‌లో ఆత్మాహుతి దాడులకు తెగబడ్డ 48 గంటల్లోనే అమెరికా ఐసీస్‌పై ఈ ప్రతీకార దాడులకు దిగింది. కాబుల్‌లో ఐసీస్ తీవ్రవాదులు చేసిన పేలుళ్లలో 169 మంది అఫ్గాన్లు, 13 మంది అమెరికా సైన్యం మరణించిన సంగతి తెలిసిందే. కాబుల్ ఎయిర్‌పోర్టులో ఈ పేలుళ్లు జరిగాక గురువారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ.. అమెరికా ప్రతీకారం తీర్చుకుంటుందని తెలిపారు. కాబుల్ పేలుళ్లకు కారణం తామేనని ఐసిస్-కే ఉగ్ర సంస్థ ప్రకటించుకున్న సంగతి తెలిసిందే.


ఐసీస్-కే అంటే..
ఐసీస్-కే అంటే.. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లేవాంట్-ఖోరసాన్ ప్రావిన్స్. ఇది ఐసీస్‌కు అనుబంధ సంస్థ అని సొంతంగా ప్రకటించుకుంది. తాలిబన్ మాజీ సభ్యులతో పాటు అఫ్గానిస్థాన్‌లో జీహాదీల్లో అసంతృప్తులు తదితరులు ఐఎస్ఐఎస్‌-కే ఏర్పాటు చేశారు. వీరు కూడా వేల సంఖ్యలో అనుచరులను తమ గ్రూపులో చేర్చుకొని, క్రమంగా ప్రాబల్యం పెంచుకుంటున్నారు. క్రమంగా అఫ్గాన్‌లోని తూర్పు, ఉత్తర ప్రాంతాల్లో చిన్న చిన్న ప్రాంతాలను తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. అయితే, ఈ గ్రూపు ఏర్పాటైన నాటి నుంచి అమెరికా, అఫ్గాన్ దళాల తాకిడికి కొన్ని ప్రాంతాలకే పరిమితమైనట్లుగా అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి.