అఫ్గానిస్థాన్ కాబూల్ లో జరిగిన బాంబుదాడిలో మృతుల సంఖ్య 103కి చేరింది. మృతుల్లో 13 మంది అమెరికా సైనికులు ఉన్నారు. 90 మంది అఫ్గాన్ వాసులు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారి సంఖ్య 150కి చేరింది. మృతుల్లో 28 మంది తమ వారు కూడా ఉన్నారని తాలిబన్లు ప్రకటించారు. ఈ విషయాన్ని కాబుల్‌ అధికారులు వెల్లడించినట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పత్రిక పేర్కొంది.  ప్రస్తుతం అఫ్గాన్ లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ప్రాణభయంతో ప్రజలు పరుగులు తీస్తున్నారు.  


అతిపెద్ద దాడి..



  • కాబూల్‌ విమానాశ్రయంపై జరిగిన దాడిలో 13 మంది అమెరికన్‌ సైనికులు మరణించారు.

  • 2011 తర్వాత ఈ స్థాయిలో అమెరికన్ల మరణాలు నమోదైంది ఈ ఘటనలోనే.

  • రెండు దశాబ్దాలపాటు జరిగిన అఫ్గాన్‌ యుద్ధంలో 1909 మంది అమెరికన్లు మరణించారు.

  • 2011 ఆగస్టు 6వ తేదీన ఉగ్రవాద శిబిరంపై అమెరికా చినూక్‌ హెలికాఫ్టర్‌ దాడికి దిగింది. ఈ సమయలో ఉగ్రవాదులు హెలికాప్టర్‌ను కూల్చివేశారు. ఈ దాడిలో 22 నేవీ సీల్స్‌ సహా 30 మంది అమెరికా సిబ్బంది మరణించారు. మరో 8 మంది అఫ్గాన్‌ పౌరులు, ఓ అమెరికా జాగిలం కూడా మరణించింది.


మరిన్ని దాడులు..


కాబూల్‌ విమానాశ్రయంపై మరిన్ని దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ జనరల్‌ ఫ్రాంక్‌ మెకంన్జీ ప్రకటించారు. ఈ సారి రాకెట్లు, వాహన బాంబులతో ఎయిర్‌పోర్టును లక్ష్యంగా చేసుకోవచ్చని ఆయన హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.


బైడెన్ హెచ్చరిక..


ఈ దాడులకు కారకులైన వారిని ఊరికే వదలబోమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. అంతకంతకూ ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. మృతి చెందిన అమెరికా సైనికులను హీరోలుగా ఆయన అభివర్ణించారు. దాడికి పాల్పడింది తామేనని ఇప్పటికే ఇస్లామిక్‌ స్టేట్‌ ప్రకటించిన నేపథ్యంలో ఆ ఉగ్రవాద సంస్థ నాయకులను హతమార్చాలని తమ దేశ సైన్యాన్ని బైడెన్‌ ఆదేశించారు.