తాలిబన్ల పరమైన అఫ్గానిస్థాన్‌ లో వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. అఫ్గాన్ రాజధాని కాబూల్‌ లో ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఈ దాడులకు పాల్పడింది తామేనని ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ ప్రకటించింది. ఉగ్రవాదులు కాబూల్ హమీద్‌ కర్జాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం గురువారం సాయంత్రం జంట పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ ఘటనల్లో 72 మంది మరణించినట్లు తాలిబన్లు ప్రకటించారు. 


ముందే హెచ్చరికలు


ఈ దాడుల్లో తమ మెరీన్‌ కమాండోలు 11 మంది, ఒక నేవీ వైద్యుడు చనిపోయినట్లు అమెరికా ధ్రువీకరించింది. ఈ దాడుల్లో 143 మంది తీవ్రంగా గాయపడినట్టు అఫ్గాన్‌, అమెరికా అధికారులు వెల్లడించారు. క్షతగాత్రుల్లోనూ అమెరికా సైనిక సిబ్బంది 12 మంది ఉన్నారని తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని తెలిపారు. కాబూల్‌ విమానాశ్రయం వద్ద ఐసిస్‌ ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని కొద్ది గంటల ముందే బ్రిటన్‌, అమెరికా, ఆస్ట్రేలియాలు హెచ్చరించాయి. అఫ్గాన్‌ నుంచి బయటపడేందుకు కాబూల్ విమానాశ్రయం వద్ద భారీ సంఖ్యలో ప్రజలు ఉండడంతో ఉగ్రవాదులు వారిని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ దాడులను తాలిబన్లు ఖండించారు. 


Also Read: India on Covid Vaccination: దేశంలో 50 శాతం మందికి ఫస్ట్ డోస్ టీకా.. కేంద్ర మంత్రి వెల్లడి


ప్రతీకారం తీర్చుకుంటాం


కాబూల్‌ జంట పేలుళ్ల ఘటనను అమెరికా తీవ్రంగా పరిగణించింది. ఈ దాడులకు పాల్పడిన ఉగ్రవాదులను వెంటాడి మరీ ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్పష్టం చేశారు. పేలుళ్లలో మృతి చెందిన అమెరికా సైనికులను హీరోలుగా బైడెన్ అభివర్ణించారు. ఈ దాడుల్లో  మృతి చెందిన వారికి సంఘీభావంగా కొద్దిసేపు మౌనం పాటించారు. ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు అమెరికా సైనికులు తమ ప్రాణాలు పణంగా పెట్టారని బైడెన్ కీర్తించారు.  కాబూల్‌ నుంచి భద్రతా దళాల తరలింపు ప్రక్రియ ఆగదని స్పష్టం చేశారు. 


 






Also Read: Gold-Silver Price: బంగారం కొనాలా? తగ్గిన పసిడి, వెండి ధరలు.. నేడు మీ నగరంలో ఇలా..


ఐరాస, భారత్ ఖండన


కాబూల్ ఆత్మాహుతి దాడులను నాటో, ఐరాస ఖండించాయి. నాటో చీఫ్‌ జెన్స్‌ స్టోటెన్‌బర్గ్‌, ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌లు ఈ దాడులను ఖండించారు. అఫ్గాన్‌లో పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మెక్రాన్‌ అన్నారు. అమెరికా, మిత్ర దేశాలతో కలిసి కాబూల్‌ విమానాశ్రయం నుంచి ఫ్రాన్స్ పౌరులను త్వరగా తరలిస్తామన్నారు. కాబూల్‌ ఉగ్రదాడులను భారత్‌ తీవ్రంగా ఖండించింది. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించింది.  ఉగ్రవాదంపై ప్రపంచం ఐక్యంగా పోరాడాల్సిన అవసరాన్ని తాజా పేలుళ్లు చాటుతున్నాయని పేర్కొంది.


Also Read: Explosion Outside Kabul airport: కాబూల్‌లో జంట పేలుళ్లు.. 72 మంది మృతి