ఇటీవల సాధారణ ఉప్పు, సముద్ర ఉప్పుకు బదులుగా హిమాలయన్ సాల్ట్‌ను ఉపయోగించేవారి సంఖ్య పెరుగుతోంది. గులాబీ రంగు రాతి ఉప్పులా ఉండే ఈ ఉప్పును హిమాలయాల్లోని రాతి స్పటికాలతో ఈ ఉప్పును తయారు చేస్తారు. దీన్ని ‘పింక్ సాల్ట్’ అని కూడా పిలుస్తారు. ఇండియాతోపాటు పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లోనూ ఈ ఉప్పును ఉత్పత్తి చేస్తున్నారు. హిమాలయా పర్వతాల మొదట్లో ఉండే సహజ నిక్షేపాల నుంచి ఈ ఉప్పును తయారు చేస్తారు. సాధారణ ఉప్పులా కాకుండా.. ఇందులో సహజంగానే అయోడిన్ ఉంటుంది. ఇందులో ఉండే ఐరన్ ఆక్సైడ్ వల్ల ఈ ఉప్పు పింక్ కలర్‌లో ఉంటుంది. అయితే, ఇది చాలా అరుదుగా లభించే ఉప్పు. దాని వల్ల ఖరీదు కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. మరి, ఈ ఉప్పును తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదేనా? రాతితో తయారయ్యే ఉప్పు.. సముద్రపు ఉప్పు కంటే సురక్షితమైనదా? ఈ ఉప్పు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటీ తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
హిమాలయన్ ఉప్పులో మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇంందులోని మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, జింక్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఎన్నో ఏళ్ల నుంచి ఉప్పును వంటకాల్లో వినియోగిస్తున్నారు. అప్పట్లో సముద్ర ప్రాంతంలో నివసించేవారికే ఉప్పును తయారు చేయడం సులభంగా ఉండేది. అయితే, సముద్ర తీరాలు లేని ప్రాంతాల్లో ఉప్పు లభించడం చాలా కష్టంగా ఉండేది. ఈ నేపథ్యంలో హిమాలయాల్లో రాళ్లకు అంటుకుని ఉండే స్పటికాలను కూడా ఉప్పుగా ఉపయోగించవచ్చని, అవి కూడా సాధారణ ఉప్పులా వంటకాల్లో కరుగుతాయని భావించి ఈ ఉప్పును వినియోగించడం మొదలుపెట్టారు. అయితే, ఇటీవల జరిగిన పరిశోధనల్లో ఆ ఉప్పులో పోషకాలు మెండుగా ఉన్నాయని తెలుసుకున్నారు. దీంతో ప్రజలు హిమాలయన్ ఉప్పు వినియోగానికి మొగ్గు చూపడం ప్రారంభించారు. సాధారణ ఉప్పును అతిగా తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెజర్, స్ట్రోక్, గుండె జబ్బులు ఏర్పడే ప్రమాదం ఉంది. అందుకే.. సాధారణ ఉప్పుకు ప్రత్యామ్నాయంగా హిమాలయన్ సాల్ట్‌ను ఉపయోగించడం మొదలుపెట్టారు. ఎందుకంటే శరీరం ఈ ఉప్పును అరిగించుకోడానికి పెద్దగా శ్రమించక్కర్లేదు.
శ్వాస సమస్యలకు..: ఇక ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే.. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడేవారు ‘సాల్ట్ థెరపీ’ చేస్తుంటారు. ఈ ఉప్పుగాలిని పీల్చడం ద్వారా అబ్స్ట్రక్టివ్ పల్మనరీ వ్యాధి లేదా COPD శ్వాసకోశ సమస్యల నుంచి బయటపడవచ్చని చెబుతారు. అయితే, వైద్యుల సూచన లేకుండా ఇలాంటి ప్రయోగాలు చేయకూడదు. అయితే, పరిశోధనల్లో ఈ ఉప్పుతో తయారు చేసిన ఇన్హెలర్ వాడినవారిలో సత్ఫలితాలు కనిపించాయి.
నిర్జలీకరణ నివారణకు: శరీరంలో హైడ్రేషన్ స్థాయిలను సమతుల్యంగా ఉంచేందుకు ఈ ఉప్పు అవసరమవుతుంది. వ్యాయామానికి ముందు లేదా ఆ తర్వాత తగినంత ఉప్పునీరు తీసుకోవడం మంచిది. ఈ ఉప్పులో 84 రకాల సూక్ష్మ పోషకాలు ఉంటాయి.
చర్మ సంరక్షణ కోసం: తామర వంటి వివిధ చర్మ పరిస్థితుల నుంచి ఈ ఉప్పు ఉపశమనం కలిగిస్తుంది. తామరతో బాధపడేవారు ఈ ఉప్పును నీటిలో కలిపి స్నానం చేస్తే మంట నుంచి ఉపశమనం లభిస్తుందని నేషనల్ ఎగ్జిమా అసోషియేషన్ సిఫార్సు చేసింది.
ఈ ఉప్పు వల్ల నష్టాలు కూడా ఉన్నాయి:
⦿ ఈ ఉప్పులో ప్రమాదకరమైన అర్సెనిక్, మెర్క్యూరీ, లీడ్ కూడా ఉన్నాయట. అందుకే, ఈ ఉప్పును కూడా మితంగా తీసుకుంటనే మేలని చెబుతున్నారు.
⦿ సాధారణ ఉప్పు మాత్రమే కాకుండా.. హిమాలయ పింక్ సాల్ట్ వల్ల కూడా సమస్యలున్నాయి. అందుకే ఏ రకం ఉప్పునైనా సరే.. మితంగా తీసుకోవడం ముఖ్యం.
⦿ అధిక ఉప్పు రక్తపోటుకు కారణమవుతుంది. ఇది దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి లేదా CKD, గుండె వ్యాధులకు దారితీయొచ్చు.
⦿ ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల మూత్ర విసర్జన సమయంలో మీ శరీరం నుండి బయటకు వెళ్లిన కాల్షియం స్థాయి పెరుగుతుంది.
⦿ అధిక ఉప్పు వివిధ రకాల ఎముకల వ్యాధికి గురిచేస్తుంది.
గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే అందించాం. ఈ ఉప్పును మీ ఆహారంలో చేర్చుకోవాలంటే వైద్యుల సూచన తీసుకోవడం తప్పనిసరి అని గమనించగలరు.