Pakistan Train Accident:
హజారా ఎక్స్‌ప్రెస్‌కి ప్రమాదం..
పాకిస్థాన్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. షాహ్‌జాద్‌పూర్, నవాబ్‌షా మార్గంలో హజారా ఎక్స్‌ప్రెస్ (Hazara Express Accident) పట్టాలు తప్పి పడిపోయింది. దాదాపు 10 బోగీలు అదుపు తప్పాయి. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా...50 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం...హజారా ఎక్స్‌ప్రెస్ కరాచీ నుంచి పంజాబ్‌కి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సర్హారీ రైల్వే స్టేషన్ వద్ద ఉన్నట్టుంది పట్టాలు తప్పింది. ప్రస్తుతానికి మృతుల సంఖ్య 15గా తేలినా...ప్రమాద తీవ్రతను బట్టి చూస్తే ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. పాక్ రైల్వే మంత్రి ఖ్వాజా సాద్ రఫిక్ ఈ ఘటనపై స్పందించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ప్రభుత్వం తరపు అన్ని విధాలుగా సహకరిస్తామని ప్రకటించారు. ప్రస్తుతానికి ప్రయాణికుల ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని, ఆ తరవాతే ప్రమాదానికి కారణాలేంటో విచారిస్తామని తెలిపారు. సింధ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మురాద్ అలీ షా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అవసరమైన వైద్య సాయం అందిస్తున్నట్టు వెల్లడించారు.
తరచూ ప్రమాదాలు..
గత దశాబ్ద కాలంగా పాకిస్థాన్‌లో ఇలాంటి ఘోర రైలు ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి. 2021 జూన్‌లో సింధ్‌లోని దహర్‌కీ వద్ద రెండు రైళ్లు ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో 65 మంది ప్రాణాలు కోల్పోగా 150 మంది గాయపడ్డారు. ఓ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పి పక్క ట్రాక్‌పై ఉన్న రైల్‌ని ఢీకొట్టడం వల్ల ప్రాణనష్టం భారీగా వాటిల్లింది. అంతకు ముందు 2019లో తేజ్‌గామ్ ఎక్స్‌ప్రెస్ (Tezgam Express Accident)లో అగ్నిప్రమాదం సంభవించడం వల్ల 75 మంది ప్రాణాలు కోల్పోయారు. 2005లో ఘోట్కిలో రెండు ట్రైన్‌లు ఢీకొట్టుకున్న ఘటనలో 100 మంది మృతి చెందారు.
Also Read: ఫ్రెండ్‌షిప్ డే సర్‌ప్రైజ్ ఇచ్చిన జొమాటో సీఈవో, కస్టమర్స్‌కి స్వయంగా ఫుడ్ డెలివరీ