Pakistan Woman:
వర్చువల్ మ్యారేజ్..
ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లు చాలా వింతగా జరుగుతున్నాయి. కారణమేదైనా వర్చువల్‌గానే కొన్ని జంటలు ఒక్కటవుతున్నాయి. ఎవరి ఇంట్లో వాళ్లు కూర్చుని ఆన్‌లైన్‌లోనే పెళ్లి చేసుకుంటున్నారు. ఇప్పటి వరకూ ఇది ఇండియాలోనే అనుకున్నాం. ఇప్పుడీ ట్రెండ్ పాకిస్థాన్ వరకూ వెళ్లిపోయింది. ఓ పాకిస్థాన్ యువతి భారత్‌లోని జోధ్‌పూర్‌కి చెందిన అబ్బాయిని వర్చువల్‌గా పెళ్లి చేసుకుంది. నిన్న మొన్నటి వరకూ పాకిస్థాన్ మహిళ సీమా హైదర్ ప్రేమ కథ వైరల్ అయితే..ఇప్పుడీ పెళ్లి కథ వైరల్ అవుతోంది. కరాచీకి చెందిన అమీనా భారత్‌కి చెందిన అర్బాజ్ ఖాన్‌ని పెళ్లి చేసుకోవాలని మనసు పడింది. ఇండియాకి వచ్చి వివాహం చేసుకుందామని అంతా ప్లాన్ చేసుకుంది. కానీ ఉన్నట్టుండి ఆ ప్లాన్ రివర్స్ అయింది. వీసా అప్లై చేసుకుంటే అది కాస్తా రిజెక్ట్ అయింది. చేసేదేమీ లేక ఇలా వర్చువల్‌గానే వివాహం చేసుకుంది జంట. దీనిపై స్పందించిన పెళ్లి కొడుకు "కచ్చితంగా అమీనా మరోసారి వీసాకోసం ప్రయత్నిస్తుంది" అని చెప్పాడు. సీఏగా పని చేస్తున్న అర్బాజ్ ఖాన్...జోధ్‌పూర్‌లోని ఒస్వాల్ సమాజ్ భవన్‌కి తన ఫ్రెండ్స్, ఫ్యామిలీతో వచ్చాడు. అక్కడే ఆన్‌లైన్‌లో నిఖా చేసుకుంది ఈ జంట. జోధ్‌పూర్ ఖ్వాజీ సమక్షంలోనే వీళ్లిద్దరూ ఒక్కటయ్యారు. పాకిస్థాన్‌లో ఉన్న తమ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఈ పెళ్లి ఫిక్స్ చేశారని చెప్పాడు అర్బాజ్ ఖాన్. రెండు దేశాల మధ్య ఉన్న వైరమూ...వీళ్లనిలా దూరం చేసిందని కొందరు చెబుతున్నారు. త్వరలోనే ఆమెకి వీసా వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నాడు ఖాన్.
మరో ప్రేమ కథ..
ఫేస్‌బుక్ స్నేహితుడు నుస్రుల్లా కోసం పాకిస్తాన్ వెళ్లిన భారతీయ మహిళ అంజు అతడితో కలిసి అక్కడి పర్యాటక ప్రదేశాలను చుట్టేస్తోంది. డిర్ ఎగువ జిల్లా, చిత్రాల్ జిల్లాలను కలిపే లావారీ సొరంగాన్ని వారు సందర్శించారు. అక్కడి అంజు, నస్రుల్లా పచ్చని తోటలో కూర్చుని చేతులు పట్టుకుని కనిపించారు. వీడియోలు తీసుకుంటూ, ఫొటోలు దిగుతూ సందడి చేశారు. తరువాత పాకిస్థాన్‌లో తాను సురక్షితంగా ఉన్నానని చెబుతున్నట్లు ఒక చిన్న వీడియోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. అందులో అంజూ మాట్లాడుతూ.. ‘నేను ఇక్కడికి హఠాత్తుగా రాలేదు. చట్టప్రకారం ప్రణాళికతో వచ్చాను. మీ అందరికీ ఈ సందేశం ఇవ్వాలనుకుంటున్నాను, నేను ఇక్కడ సురక్షితంగా ఉన్నాను. నా బంధువులను, పిల్లలను వేధించవద్దని మీడియా ప్రతినిధులను కోరుతున్నాను’ అని ఆమె అన్నారు. నస్రుల్లాతో కలిసి ఉండడంపై అంజు స్పందించింది. తాము ఇంకా పెళ్లి చేసుకోలేదని వెల్లడించింది. ఇస్లాం మతంలోకి మారి తన పేరును ఫాతిమాగా మార్చుకున్న వార్తలు కూడా తప్పని కొట్టి పారేసింది. పాకిస్తాన్‌లో తలపై ఏదైనా వేసుకొని బయటకు వెళ్లాలి కాబట్టి బురఖా ధరించానని స్పష్టం చేసింది.