Delhi Jama Masjid: దిల్లీలోని ప్రఖ్యాత జామా మసీదు పరిపాలన విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. మసీదులోకి ఒంటరిగా లేదా గుంపులుగా వచ్చే మహిళల ప్రవేశాన్ని నిషేధిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కుటుంబం లేదా తన భర్తతో వచ్చే మహిళలపై ఎటువంటి ఆంక్షలు లేవని స్పష్టం చేసింది.
ఇదీ రీజన్
కుటుంబాలతో వచ్చే అమ్మాయిలు/మహిళలపై ఎలాంటి ఆంక్షలు లేవు, వివాహితులైన జంటలపై కూడా ఎటువంటి ఆంక్షలు లేవు. మహిళలు ఒంటరిగా వచ్చినప్పుడు, వారు అనుచితమైన చర్యలకు పాల్పడతారు, వీడియోలు చిత్రీకరిస్తారు. దీనిని అరికట్టడానికే ఈ నిషేధం. ఇది మీటింగ్ పాయింట్ కాకూడదు. ప్రజలు ఈ స్థలాన్ని పార్క్ లేదా టిక్‌టాక్ వీడియోలను షూట్ చేసే ప్రదేశంగా భావించకూడదు. మసీదు, దేవాలయం లేదా గురుద్వారా ఇలా మతపరమైన ప్రదేశాల్లో ఇది సరైనది కాదు. - సబీవుల్లా ఖాన్, జామా మసీదు పీఆర్‌ఓ
మహిళా కమిషన్
ఈ నోటీసులపై దిల్లీ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నోటీసులు మహిళలపై వివక్ష చూపే విధంగా ఉన్నాయని మండిపడింది.
జామా మసీదులోకి మహిళలు ఒంటరిగా ప్రవేశించడాన్ని నిషేధించడం తప్పుడు నిర్ణయం. పురుషునికి పూజించే హక్కు ఎంత ఉందో, స్త్రీకి కూడా అంతే హక్కు ఉంది. నేను జామా మసీదు ఇమామ్‌కి నోటీసు జారీ చేస్తున్నాను. ఇలా మహిళల ప్రవేశాన్ని నిషేధించే హక్కు ఎవరికీ లేదు. - స్వాతి మలివాల్, దిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్
Also Read: Global Recession: 'భారత్‌కు మాంద్యం ముప్పు లేదు- రాబోయే రోజుల్లో ఉద్యోగాలే ఉద్యోగాలు'