సౌత్ టాప్ హీరోయిన్ సమంత నటించిన లెటెస్ట్‌ మూవీ ‘యశోద’. హరి, హరీష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. నవంబర్ 11న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల అయ్యింది. తొలి షో నుంచే మంచి రెస్పాన్స్ అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ అందుకుంది. ఈ సినిమాను థియేటర్ లో చూడలేకపోయిన ప్రేక్షకులు.. ఎప్పుడెప్పుడు ఓటీటీలో చూద్దామా? అని ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి అమెజాన్ ప్రైమ్ వీడియోస్ గుడ్ న్యూస్ చెప్పింది. డిసెంబర్ రెండో వారంలో తమ ఓటీటీ వేదికగా ‘యశోద’ మూవీ స్ట్రీమ్ కానున్నట్లు వెల్లడించింది.


ఓటీటీ ప్రకటన రాగానే ఊహించని షాక్


అమెజాన్ ప్రైమ్ నుంచి ‘యశోద’ స్ట్రీమింగ్ ప్రకటన రావడంతోనే చిత్ర దర్శక నిర్మాతలకు ఊహించని షాక్ తగిలింది. ఈ సినిమాను ఓటీటీ రిలీజ్ నిలిపివేయాలంటూ సిటీ సివిల్ కోర్టు ఆర్డర్స్ జారీ చేసింది. డిసెంబర్ 19 వరకు ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది.   


కోర్టు ఎందుకు ఈ సినిమా రిలీజ్ నిలిపివేసిందంటే?


‘యశోద’ సినిమాను సరోగసీ ఫెర్టిలిటీ సెంటర్లలో జరిగే అక్రమాలను బేస్ చేసుకుని రూపొందించారు. అయితే ఈ సినిమాలో సరోగసీ ఫెర్టిలిటీ సెంటర్ కు ‘ఈవా’ అని పేరు పెట్టారు. ఈ పేరు పెట్టడం మూలంగా తమ ఆస్పత్రి ప్రతిష్ట దెబ్బ తిన్నదంటూ ‘ఈవా హాస్పిటల్’ మేనేజ్ మెంట్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించింది. ఈ సినిమా ఓటీటీ విడుదలను నిలిపివేయాలని కోరింది. ఈ కేసుపై కోర్టు విచారణ జరిపింది. అనంతరం కోర్టు ఈవీ హాస్పిటల్ కు అనుకూలంగా తీర్పు చెప్పింది. ‘యశోద’ సినిమా నిర్మాణ సంస్థకు నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 19 వరకు ఓటీటీలో ఈ సినిమాను రిలీజ్ చేయకూడదని ఆదేశించింది. విచారణను డిసెంబర్ 19కి వాయిదా వేసింది. 


స్పందించని ‘యశోద’ నిర్మాణ సంస్థ


అటు కోర్టు తీర్పుపై ‘యశోద’ నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. హీరోయిన్ సమంత కూడా ఈ తీర్పు గురించి ఎలాంటి కామెంట్ చేయలేదు. కోర్టు విధించిన గడువు లోగా హాస్పిటల్ యాజమాన్యంతో ఈ సినిమా నిర్మాతలు మాట్లాడి సెటిల్ చేసుకునే అవకాశం ఉందనే టాక్ నడుస్తోంది.


'యశోద' సీక్వెల్ రానుందా?


'యశోద' సక్సెస్ మీట్‌ (Yashoda Success Meet) లో సీక్వెల్ ఐడియా రెడీగా ఉన్నట్లు దర్శకులు హరి, హరీష్ వెల్లడించారు. ''యశోద 2'కు విషయంలో మాకు ఓ ఐడియా ఉంది. సెకండ్ పార్ట్ మాత్రమే కాదు... థర్డ్ పార్ట్‌కు లీడ్ కూడా రెడీగా ఉంది'' అని హరి, హరీష్ తెలిపారు. అయితే... సీక్వెల్స్ సెట్స్ మీదకు ఎప్పుడు వెళ్ళేది సమంత చేతుల్లో ఉందని, ఆమె నిర్ణయంపై ఆధారపడి ఉందని చెప్పారు. ఇప్పుడు సమంత ఆరోగ్య పరిస్థితి అందరికీ తెలిసిందే. ఆవిడ ఆరోగ్యంగా తిరిగి వచ్చిన తర్వాత స్టోరీ నేరేట్ చేస్తామన్నారు. సీక్వెల్ తీయడానికి నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ కూడా రెడీగా ఉన్నారు. 


Read Also: కమల్ హాసన్‌కు అస్వస్థత, హైదరాబాద్ నుంచి వెళ్లగానే హాస్పిటల్‌కు తరలింపు!