SC ST Sub Classification: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది. వర్గీకరణను సమర్థించిన సర్వోన్నత న్యాయస్థానం ఆ అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని తేల్చి చెప్పింది. అంతే కాదు. కోటాలో సబ్‌కోటా ఉండడం తప్పేమీ కాదని స్పష్టం చేసింది. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్‌తో పాటు మొత్తం 7గురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. అయితే..ఇందులో ఆరుగురు సభ్యులు తీర్పుపై ఏకీభవించినా జస్టిసస్ బేలా త్రివేది మాత్రం విభేదించారు. ప్రస్తుతమున్న షెడ్యూల్ కులాల జాబితాలో సంస్కరణలు తీసుకొస్తామన్న పేరుతో రిజర్వేషన్‌ల మౌలిక సిద్ధాంతాన్నే కదిలించడం సరికాదని ఆమె తన వాదన వినిపించారు. షెడ్యూల్ కులాల్లో మళ్లీ ప్రత్యేకంగా గ్రూప్‌లు తీసుకు రావడం సరికాదని తేల్చి చెప్పారు. రిజర్వేషన్‌లు కల్పించిందే వెనకబడ్డ SC వర్గానికి చేయూత అందించడానికి అని వివరించిన జస్టిస్ బేలీ త్రివేది, మళ్లీ ఇందులో వర్గీకరణ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఇందులోనూ ప్రాధాన్యతల ఆధారంగా ఎక్కువ తక్కువ అని వర్గీకరించడం సరికాదని అభిప్రాయపడ్డారు. (Also Read: SC Sub Classify: ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు, సబ్ కోటా ఉండొచ్చని తేల్చి చెప్పిన న్యాయస్థానం)
ప్రస్తుతానికి షెడ్యూల్ కులాలకు ప్రత్యేక హోదా కల్పించేలా రిజర్వేషన్ వ్యవస్థ ఉందని, ఇందులో ఎలాంటి మార్పులు చేయాలన్నా అది రాష్ట్రపతి ద్వారానే జరగాలని స్పష్టం చేశారు. రాజకీయ కారణాలను దృష్టిలో పెట్టుకుని ఆ అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించలేదని వివరించారు. అందుకే ఆ పరిమితులు విధించాల్సి వచ్చిందని తెలిపారు. కానీ...మిగతా ఆరుగురు జస్టిస్‌లు ఒకే అభిప్రాయానికి రావడం వల్ల 6:1 మెజార్టీతో వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వెలువరించారు. ఇక మరో ప్రత్యేక బెంచ్‌లో జస్టిస్ పంకజ్ మిథాల్ మెజార్టీ అభిప్రాయాలకే మొగ్గు చూపించారు. అయితే..ఈ సందర్భంగా ఆయన కొన్ని సూచనలు చేశారు. కులం, సామాజిక స్థితిగతులు, ఆర్థిక పరిస్థితుల ఆధారంగా అందరికీ రిజర్వేషన్‌లు ఇవ్వడం కన్నా ఓ కుటుంబంలో ఓ తరానికి మాత్రమే వీటిని పరిమితం చేస్తే బాగుంటుందని చెప్పారు. ఓ తరం రిజర్వేషన్‌ల ద్వారా లబ్ధి పొందితే ఆ తరవాతి తరానికి ఈ వెసులుబాటు లేకుండా చూడాలని సూచించారు.
మరో సభ్యుడు జస్టిస్ చంద్ర శర్మ మెజార్టీ అభిప్రాయాన్నే గౌరవిస్తున్నట్టు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉండడం సరైందే అని సమర్థించారు. ఫిబ్రవరిలో ఈ అంశంపై సుప్రీంకోర్టు మూడు రోజుల పాటు విచారణ జరిపింది. ఆ తరవాత తీర్పుని రిజర్వ్‌లో ఉంచింది. చివరకు సానుకూలంగా తీర్పు వెలువరించింది. 2004లో ఈవీ చిన్నయ్య వర్సెస్ ఏపీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని రివ్యూ చేయాలని సీనియర్ అడ్వకేట్‌లు కోరారు. రాష్ట్రాలకు ఎస్సీ వర్గీకరణ చేపట్టే అధికారం లేదని అప్పటి ధర్మాసనం తేల్చి చెప్పింది. ఈ వాదననూ పరిగణనలోకి తీసుకున్న ప్రస్తుత ధర్మాసనం పూర్తి స్థాయిలో విచారణ జరిపి తుది తీర్పు వెల్లడించింది. ఈ తీర్పుని రాజకీయ పార్టీలన్నీ స్వాగతించాయి. ఈ వర్గీకరణకు అనుకూలంగా అవసరమైతే వెంటనే ఆర్డినెన్స్ తీసుకొస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేశారు.