జమ్ముకశ్మీర్‌ పహల్గామ్ ఉగ్రవాద దాడి దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఘటన గురించి తెలిసిన వెంటనే  ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఫోన్‌లో మాట్లాడారు. తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆ ప్రదేశాన్ని సందర్శించాలని కూడా ప్రధాని మోదీ సూచించినట్టు ప్రభుత్వ తెలిపాయి. 

దక్షిణ కాశ్మీర్‌లోని ప్రధాన పర్యాటక గమ్యస్థానమైన పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేశారు, ఇద్దరు మృతి చెందారు. ఈ దాడి తర్వాత భద్రతా సంస్థలు మరింత అప్రమత్తమయ్యాయి. ఈ దాడి చేసిన వారిని వదిలిపెట్టబోమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. "జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రియమైన వారిని కోల్పోయిన వారికి నా సంతాపం. గాయపడిన వారు వీలైనంత త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అని ఆయన అన్నారు.

"బాధిత ప్రజలకు సాధ్యమైనంత సహాయం అందిస్తున్నాం. ఈ హేయమైన చర్య వెనుక ఉన్న వారిని న్యాయం స్థానం ముందు నిలబెడతాం. వారిని వదిలిపెట్టబోం. వారి దుర్మార్గపు అజెండా ఎప్పటికీ విజయవంతం కాదు. ఉగ్రవాదంపై పోరాడాలనే మా సంకల్పం దృఢమైంది. అది మరింత బలపడుతుంది" అని ప్రధాని మోదీ అన్నారు.

పహల్గామ్ దాడి తర్వాత, హోం మంత్రి అమిత్ షా అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఐబి చీఫ్, హోం కార్యదర్శి సమావేశానికి హాజరయ్యారు. హోంమంత్రి ఈ ఘటన గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత ఘటనా స్థలాన్ని సందర్శించాలని ప్రధానమంత్రి సూచించారు. ఈ ఘటన గురించి ప్రధానమంత్రి మోడీకి తెలియజేశానని, ఉగ్రవాద దాడి తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించానని హోంమంత్రి అమిత్ షా అన్నారు.

"జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడి బాధించింది. మృతుల కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ దారుణ ఉగ్రవాద దాడిలో పాల్గొన్న వారిని వదిలిపెట్టబోము మరియు నేరస్థులపై కఠిన చర్యలు తీసుకుంటాము. వారికి అత్యంత కఠినమైన శిక్ష విధిస్తాం" అని హోంమంత్రి అన్నారు. "అన్ని ఏజెన్సీలతో భద్రతా సమీక్ష సమావేశం నిర్వహించడానికి త్వరలో శ్రీనగర్‌కు బయలుదేరుతున్నాను" అని హోంమంత్రి అన్నారు. 

జమ్మూ & కాశ్మీర్‌లోని పహల్గామ్‌లోని బైసరన్ లోయలో రాజస్థాన్‌కు చెందిన పర్యాటకుల బృందంపై కాల్పులు జరిగాయి. ఈ సంఘటన బైసరన్‌ లోయ ఎగువ ప్రాంతాల్లో జరిగింది. కొంతమంది పర్యాటకులు గాయపడినట్లు సమాచారం. భద్రతా దళాలు ఆ ప్రాంతానికి చేరుకొని ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నాయి.