Why Do Dogs attack Humans: 


ఈ మధ్య కాలంలో వరుస ఘటనలు..


కుక్కను పెంచుకోవటం సరదాగానే ఉంటుంది. పెంపుడు జంతువులుంటే మానసికంగా చాలా హుషారుగా ఉంటామనీ అంటోంది సైకాలజీ. అయితే...మనకేనా సైకాలజీ ఉండేది. జంతువులకు మాత్రం ఉండదా..? కుక్కలకూ ఓ సైకాలజీ ఉంటుంది. ఇప్పుడెందుకీ డిస్కషన్ అంటే.. దానికి ఓ కారణముంది. మొన్న ఘజియాబాద్, తరవాత ఉత్తర్‌ప్రదేశ్, ఇప్పుడు కేరళ. ఇలా వరుసగా కొన్ని చోట్ల కుక్కలు పలువురిపై దాడి చేశాయి. వీధి కుక్కలే కాదు. పెంపుడు కుక్కలు కూడా ఇలాగే ప్రవర్తిస్తున్నాయి. అపార్ట్‌మెంట్‌లలోని లిఫ్ట్‌లో ఓ చిన్నారిపై దాడి చేసిన విజువల్ ఇప్పటికే వైరల్ అయింది. తరవాత ఓ ఫుడ్ డెలివరీ బాయ్‌పైనా ఓ కుక్క దాడి చేసింది. ఈ ఘటనల నేపథ్యంలోనే...ఇప్పుడో చర్చ తెరపైకి వచ్చింది. Pitbuls జాతి కుక్కలతోనే ఈ ప్రమాదం పొంచి ఉందని, వాటిని పెంచుకోకుండా బ్యాన్ చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. సరే. ఈ బ్యాన్ సంగతి కాసేపు పక్కన పెట్టి చూస్తే...కేవలం పిట్‌బుల్స్ అనే కాదు. ఏ కుక్కలైనా మనుషులపై దాడి చేయాలని ఎందుకు అనుకుంటుంది..? మనపై వాటికి ఎందుకంత కోపం..? అప్పటి వరకు మామూలుగా ఉండి....ఉన్నట్టుండి విచక్షణ ఎందుకు కోల్పోతాయి..? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెబుతోంది డాగ్ సైకాలజీ (Dog Psychology). 




(Image Credits: Pixabay)


డాగ్ సైకాలజీ ఏం చెబుతోంది..? 


కుక్కలు కరిచేటప్పుడు చాలా అగ్రెసివ్‌గా కనిపిస్తాయి. చాలా సేపు మీద పడి కరిచిన తరవాత మళ్లీ వెంటనే నార్మల్ అయిపోయి అక్కడి నుంచి పారిపోతాయ్. స్ట్రీట్ డాగ్స్‌ బిహేయివర్‌ను దగ్గర నుంచి చూసి, వాటి మనస్తత్వాన్ని అర్థం చేసుకున్న కొందరు నిపుణులు అవి ఎందుకిలా ప్రవర్తిస్తాయో వివరించారు. ముందుగా వీధి కుక్కల గురించి మాట్లాడుకుందాం. స్ట్రీట్ డాగ్స్ (Street Dogs) టెరిటోరియల్‌ (Territorial)గా ఉంటాయి. అంటే...తాము ఉండే చోటుకి వేరే ప్రాంతంలో ఉన్న కుక్కలు వస్తే గట్టిగా అరుస్తాయి. వాటిమీద పడి కరుస్తాయ్. అవి అక్కడి నుంచి వెళ్లిపోయేంత వరకూ ఇలా గలాటా చేస్తూనే ఉంటాయి. తమకు దొరికే ఆహారాన్ని వేరే కుక్కలు వచ్చి లాగేసుకుంటాయని, లేదంటే తాము రెస్ట్ తీసుకునే ప్రాంతాలను వేరే కుక్కలు వచ్చి ఆక్రమించేస్తాయని ఓ అభద్రతా భావం ఉంటుంది శునకాలకు. అందుకే...అలా అగ్రెసివ్‌గా బిహేవ్ చేస్తాయి. క్రమంగా అలాగే తయారవుతాయి. మెంటల్ బ్యాలెన్స్ కోల్పోతాయి. 




(Image Credits: Pixabay)


వీధి కుక్కలు పుట్టినప్పటి నుంచి ఓ ఛీత్కారాన్ని ఎదుర్కొంటూ వస్తాయి. ఎక్కడ పడితే అక్కడ పెరుగుతాయి. ఏవి పడితే అవి తింటాయి. పిల్లలుగా ఉన్నప్పుడు కొందరు వాటిని ఆటపట్టిస్తారు. రాళ్లతో  కొడతారు. తోక పట్టుకుని లాగుతారు. ఎక్కడికి వెళ్లినా ఛీ అని గెంటేస్తారు. తిండి, నీళ్లు సరిగా దొరకవు. ఈ పరిస్థితులు వాటిని క్రమంగా  అగ్రెసివ్‌గా మార్చేస్తాయి. మనుషులంటే కోపం, కసి పెరిగిపోతాయి. మనుషులు అగ్రెసివ్‌గా మారినప్పుడు ఏదో విధ్వంసం సృష్టించో, వేరే వాళ్లపైన అరిచో ఆ ఫీలింగ్‌ను ఎక్స్‌ప్రెస్ చేసేసి ఆ భారం దింపుకుంటారు. కుక్కలు కూడా అంతే. వాటికి కోపం వచ్చినప్పుడు ఎదురుగా ఎవరుంటే వాళ్లపై దాడి చేసేస్తాయి. పిల్లలు ఎక్కువగా వీధుల్లోనే ఆడుకోవటం, కుక్క పిల్లల్ని హింసకు గురి చేస్తూ ఆనందం పొందటం లాంటివి చేస్తుంటారు. అందుకే...ఆరేళ్ల లోపు చిన్నారులే ఎక్కువగా కుక్క కాట్లకు గురవుతుంటారు. వీరితో పాటు...వృద్ధులు వాకింగ్‌ కోసం అని వచ్చినప్పుడు వారిపై దాడి చేస్తాయి. తమను ఏమైనా చేస్తారేమోననే భయంతో ముందుగా అవే మీద పడి కరుస్తాయి. 


పెంపుడు కుక్కలు ఎందుకు కరుస్తాయ్..? 


వీధి కుక్కలంటే అలా కోపంగా మారటానికి అన్ని కారణాలున్నాయి. మరి పెంపుడు కుక్కలు ఎందుకు కరుస్తాయి. వాటికి సరైన సమయానికి ఫుడ్, బెడ్ అన్నీ అరేంజ్ అయిపోతాయిగా..! అన్న డౌట్ రావచ్చు. అయితే..కుక్కల్లో ఒక్కో బ్రీడ్‌కు ఒక్కో విధమైన లక్షణాలుంటాయి. ఎక్స్‌పర్ట్‌లు చెప్పేదేంటంటే...రెండు భిన్న జాతులకు చెందిన కుక్కలను పరిశీలిస్తే...దాదాపు 60-70% మేర లక్షణాలు డిఫరెంట్‌గా ఉంటాయి. భారత్‌కు చెందిన బ్రీడ్ అయితే ఇక్కడి వాతావరణానికి అడ్జస్ట్ అవుతాయి. ఎప్పుడైతే వేరే జాతికి చెందిన కుక్కను తెచ్చుకుంటామో
అప్పుడే సమస్యలు మొదలవుతాయి. ఇక్కడి క్లైమేట్‌కు అవి అంత తొందరగా అలవాటు పడలేవు. వాటిని ప్రేమగా చూడకపోయినా, కాస్త తక్కువ చేసి చూసినా చాలా తొందరగా రియాక్ట్ అవుతాయి. కొన్ని హంటర్ డాగ్స్ ఉంటాయి. అవి చాలా కోపంగా ఉంటాయి. ఏదో ఓ పనిలో వాటిని ఎంగేజ్ చేయకపోతే చాలా కష్టం. మానసికంగా బ్యాలెన్స్ కోల్పోతాయి. వస్తువులను ధ్వంసం చేయటమే కాకుండా మనుషులపై పడి తీవ్రంగా కరుస్తాయి. జనాలతో పెద్దగా కమ్యూనికేషన్ లేకపోయినా...లేదంటే వాటికి తాము ఉండే వాతావరణం నచ్చకపోయినా...ఇలాగే ప్రవర్తిస్తాయి. మరో విషయం ఏంటంటే...పెంపుడు కుక్కల్ని ఎక్కువగా కంట్రోల్ చేయటమూ...అవి కోపంగా తయారవటానికి మరో కారణం. ఎప్పుడూ గొలుసుతో కట్టేసి, ఎక్కడికీ తీసుకెళ్లకుండా ఇంట్లోనే ఉంచడమూ ప్రమాదకరమే. 




(Image Credits: Cesarsway)


కరిచే ముందు సంకేతాలిస్తాయా..? 


కుక్కలు ఉన్నట్టుండి దాడి చేస్తాయనుకుంటాం. కానీ...కరిచే ముందు కుక్కలు కొన్ని సంకేతాలిస్తాయని ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు. కుక్క తోక ఊపితే...అవి చాలా ప్రేమగా దగ్గరకొస్తున్నాయని మనం భావిస్తాం. కానీ...ప్రతిసారీ వాటి బిహేయివర్ అలాగే ఉండదు. కరిచే ముందు కూడా కుక్కలు పదేపదే తోక ఊపుతాయి. వాటి ఫీలింగ్స్‌ని ఇలా ఎక్స్‌ప్రెస్ చేస్తాయి. అప్పుడు దాడికి దిగుతాయి. ఎప్పుడై కుక్కలు పదేపదే పక్కకు చూస్తున్నాయంటే...అవి స్పేస్ కోరుకుంటున్నాయని అర్థం. అంటే...ఆ వైపు ఎవరు వెళ్లినా అవి అగ్రెసివ్‌గా మారిపోతాయి. వాటికి నచ్చని విధంగా మనం ప్రవర్తించినా...అవి ఉండే చోటకు మనం వెళ్లటం వాటికి నచ్చకపోయినా..అవి పదేపదే ఆవలిస్తాయి. లేదంటే నాలుకతో వాటి పెదాలను నాకుతుంటాయి. ఆకలి లేదా నిద్రను సూచించే సంకేతాలివి. ఇలాంటి టైమ్‌లో అక్కడ ఎవరు కనిపించినా వాటికి కోపమొచ్చేస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే...మనం కాస్త గమనించి దూరంగా ఉండటమే మంచిది. 


Also Read: Jack Fruit: జాక్ అంటే ఎవరు? పనసపండు పేరు వెనుక ఇంత చరిత్ర ఉందా


Also Read: Fire Accidents: అగ్ని ప్రమాద సమయంలో ఏం చెయ్యాలి? ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి?