ప్రపంచంలోనే అతి పెద్ద పండు పనస. ఇది తూర్పు ఆసియాలోనే పుట్టిందని, అక్కడ్నించే దీని విత్తనం ఇతర దేశాలకు చేరిందని చెప్పుకుంటారు. ఏది ఏమైనా దీని రుచికి ప్రపంచం మొత్తం ఫిదా అయిపోయింది. పండు కోసి తొనలు ఒలుస్తుంటేనే ఆ సువాసన గాలిలో నలుదిక్కులకు చేరిపోతుంది. తినాలన్న కోరికను పెంచేస్తుంది. ఒక్క పండు కొనుక్కుంటే రెండు మూడు కుటుంబాలు సుష్టుగా ఈ పండ్లను తినవచ్చు. దీన్ని సంస్కృతంలో ‘స్కంధ ఫలం’ అంటారు. ఇక తెలుగు పసన. ప్రపంచం మొత్తం శరవేగంగా పాకేస్తున్న ఆంగ్లంలో మాత్రం ‘జాక్ ఫ్రూట్’ అంటారు. జాక్ అన్న పేరు వినకగానే అదేదో మనిషి పేరు అయి ఉంటుందని అనుకుంటారు చాలా మంది. ఆ పేరు వెనుక కూడా చిన్న చరిత్ర ఉంది. 


పనస పండు ఈనాటిది కాదు క్రీస్తు పూర్వం 300 సంవత్సరం నుంచే భూమిపై పండడం మొదలుపెట్టింది. అప్పట్నించే మనిషి తినడం కూడా ప్రారంభించాడు. వాటి ఆకారం చూసి మొదట్లో తినడానికి సందేహించారు కానీ ఒకసారి కిందపడి పగిలిన పనస పండును రుచి చూశాక మరీ వదల్లేదు మనుషులు. మన పురాణాలలో కూడా దీని ప్రస్తావన ఉంది. వేల ఏళ్ల క్రితం బతికిన రుషులు కూడా ఈ పండును ఆరగించారని చెబుతున్నాయి. అడవుల్లో ఈ పండ్లే వారి ఆకలి తీర్చేవని అంటారు. 


ఎవరీ జాక్?
జాక్ అనగానే జాక్ అండ్ జిల్ రైమ్ గుర్తొకొచ్చేస్తుంది. అందులో జాక్ అనే పిల్లవాడు ఉంటాడు. కానీ ఇక్కడ జాక్ అంటే మనిషి కాదు. జాక్ అన్న పదం పోర్చుగీస్ పదమైన ‘జాకా’ నుంచి ఆవిర్భవించింది. ఈ పేరుకు మన దేశానికి కూడా సంబంధం ఉంది. పోర్చుగీసు వారు వ్యాపార నిమిత్తం మనదేశానికి రావడం మొదలుపెట్టారు. 1499లో కేరళలోని కోజికోడ్ కి వచ్చారు. చాలా ఏళ్లు అక్కడే నివసించారు. మలయాళంలో ఈ పండును ‘చక్కా’ అంటారు. దాన్ని పలికేటప్పుడు పోర్చుగీసువారు చక్కా ను కాస్త జాకా అని పలకడం మొదలుపెట్టారు. అలా ఆ పేరే ఆ దేశంలో స్థిరపడిపోయింది. పోర్చుగీసు తరువాత మనదేశాన్ని ఆక్రమించుకునేందుకు బ్రిటిష్ వారు వచ్చారు. జాకా ఫ్రూట్‌ను కాస్త జాక్ ఫ్రూట్ గా మార్చారు. అలా ఆ పేరే ఇప్పటికీ ప్రపంచంలోని ఆంగ్లేయులంతా వాడుతున్నారు. ఆంగ్లంలో పనస పండు పేరుగా అదే స్థిరపడింది.  


పనస చెట్టు చాలా ఎత్తుగా 30 నుంచి 50 అడుగులు పెరుగుతుంది. నేరుగా చెట్టుకే పండ్లు కాయడం దీని ప్రత్యేకత. తీయని ఈ పండును మధుమేహం ఉన్న వారు కూడా తినవచ్చు. దీనిలో అధిక ప్రొటీన్, అధిక ఫైబర్ ఉంటుంది. 


పనసను హిందీలో కథల్ అంటారు. మరాఠీలో ఫనస్ అని, అస్సామీలో కొతాల్ అని పిలుస్తారు. ప్రతి భాషలో దీనికి ప్రత్యేక పేర్లు ఉన్నాయి. 


Also read: గుడ్లగూబల్లో ఓ పిల్లి దాక్కుంది, మీకు కనిపించిందా? అర సెకనులో కనిపెట్టండి చూద్దాం



Also read: ఇది హ్యాండ్ బ్యాగే కాదు గన్ కూడా, మహిళల ఆత్మరక్షణ కోసమే ప్రత్యేకం