Social Media Politics : ఏ రాజకీయ పార్టీకైనా బలం సిద్ధాంతం అని ఇప్పుడు ఎవరైనా చెబితే వారి వైపు పిచ్చి వాడిని చూసినట్లుగా చూస్తారు. రాజకీయాల్లో సిద్ధాంతాలు కాలగమనంలోకి కలసిపోయి చాలా కాలం అయిపోయింది. ఇప్పుడు ఏ పార్టీకైనా బలం ఏమిటి అంటే.. సోషల్ మీడియా అని చెప్పే పరిస్థితి వచ్చింది. అధినేతకు ఎంత ప్రజాదరణ ఉన్నా.. కింది స్థాయి నుంచి పార్టీకి నాయకత్వం ఉన్నా .. సోషల్ మీడియా బలంగా లేకపోతే గెలుపు కష్టమేననే పరిస్థితి వచ్చింది. అందుకే రాజకీయ పార్టీలు ఇప్పుడు సోషల్ మీడియా మీద దృష్టి పెట్టాయి. వెనుకబడిపోతున్నామని అనిపిస్తే చాలు వెంటనే ఖర్చుకు వెనుకాడకుండా బలం పుంజుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా ఇంచార్జ్‌ను జగన్ మార్చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డిని పక్కన పెట్టి .. సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవ్ రెడ్డికి ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ పేరుతో ప్రత్యేకంగా సోషల్ మీడియా విభాగం నడుపుతోంది. దాన్ని చింతకాయల విజయ్ పర్యవేక్షిస్తూంటారు.
రాజకీయాల్లో శక్తివంతంగా మారిన సోషల్ మీడియా !
సోషల్ మీడియా ద్వారానే ఇప్పుడు చాలా పనులు జరుగుతున్నాయి. ఈ వేదిక ద్వారా ప్రపంచంలో ఏమూల ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోతోంది. యువత మీద సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. దీన్ని రాజకీయ పార్టీలు గట్టిగానే పట్టుకున్నాయి. ప్రత్యేకంగా సోషల్ మీడియా సైన్యాలను ఏర్పాటు చేసుకుని ప్రచారం చేసుకుంటున్నాయి. ఈ ప్రచారాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి తమకు అనుకూలంగా ప్రచారం చేసుకోవడం.. రెండు.. ప్రత్యర్థులను ట్రోల్ చేయడం. సోషల్ మీడియాలో నెగెటివిటీ ఎక్కువ. పాజిటివ్ అంశాలకు ప్రాధాన్యం లభించదు. కానీ నెగిటివ్‌గా ఏదైనా ఉంటే మాత్రం వైరల్ అయిపోతుంది. ఈ టెక్నాలజీ మార్పులను రాజకీయ పార్టీలు బాగా ఉపయోగించుకుంటున్నాయి.
తప్పుడు ప్రచారాలకు కేంద్రంగా మారిన రాజకీయ సోషల్ మీడియా సైన్యాలు
సాధారణంగా సోషల్ మీడియాకు ఎక్కువగా అనుసంధానంలో ఉండేది యువతే. మన దేశంలో దాదాపు 50 కోట్ల మంది 15 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వయసులోపు వారు ఉన్నారు. సోషల్ మీడియాను వాడేది వారే కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకొని పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. సోషల్ మీడియా విభాగంలో ప్రత్యేకంగా ఉద్యోగులు, అభిమానుల కోసం ఆర్మీలు స్థాపిస్తున్నాయి. తమ నేతలను సోషల్ మీడియాలో ప్రమోట్ చేసేందుకు, ఎదుటి పార్టీపై కామెంట్లు, ట్వీట్లతో విమర్శలు గుప్పించేందుకు నకిలీ ఖాతాలను కూడా ఈ ఆర్మీ విభాగాలు నిర్వహిస్తున్నాయి. ప్రతి కామెంట్, లైక్‌కు కూడా పార్టీలు డబ్బులు చెల్లిస్తున్నారు. ఈ కారణంగా తప్పుడు ప్రచారాలకు.. హేట్ స్పీచ్‌లకు సోషల్ మీడయా కేంద్రంగా మారింది. విద్వేషాలు రగిల్చేలా, ఇతరులను కించపరిచేలా, పరువుకు భంగం వాటిల్లేలా, శాంతిభద్రతలకు చేటు తెచ్చే పోస్టులను పోలీసులు ఉపేక్షించరు. ఏపీలో న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని సీబీఐ అరెస్ట్ చేస్తోంది. సోషల్ మీడి్యాలో స్వేచ్చ ఉంది కానీ దాన్ని దుర్వినియోగం చేస్తే చట్టపరమైన ఇబ్బందులు వస్తాయి.
పద్దతిగా వాడుకుంటే ఎంతో మేలు !
సోషల్ మీడియాను పద్దతిగా వాడుకుంటే ఎంతో సంప్రదాయంగా ఉంటుంది. ఓటర్లతో రాజకీయ పార్టీలు ఈజీగా ఇంటరాక్ట్ కావచ్చు. తాము చెప్పదలచుకున్న విషయాన్ని తక్కువ ఖర్చుతో, తక్కువ టైంలో చాలా వేగంగా ఎక్కువ మందికి పొలిటికల్ లీడర్లు చెప్పే అవకాశం సోషల్ మీడియా కల్పిస్తోంది. ఒకప్పుడు ప్రచారమంటే సభలు, ర్యాలీలు, కరపత్రాల పంపిణీతో ఊళ్లు హోరెత్తిపోయేవి. కానీ కాలం మారింది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత రాజకీయ రంగస్థల ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. వాట్సాప్, ఫేస్‌బుక్‌ల పుణ్యమా అని రాజకీయ పార్టీలు నిత్యం ప్రజలతో నేరుగా అనుసంధానంలో ఉండగలుగుతున్నాయి. రాజకీయ వేదికల నుంచి నాయకుల సందేశాలు నేరుగా ప్రజల ఫోన్లకు చేరిపోతున్నాయి. డిజిటల్ సాంకేతికత, స్మార్ట్‌ఫోన్ల హవా, కారుచౌకగా ఇంటర్నెట్ డేటా అందుబాటులోకి రావడంతో సామాన్యులంతా ఈ సౌకర్యాలను ఉపయోగించుకుంటున్నారు. ఈ సాంకేతికత వేదికగానే ఇప్పుడు రాజకీయ రంగస్థలం నడుస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో గాడి తప్పిన రాజకీయ సోషల్ మీడియా !
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఎప్పుడూ ఉద్రిక్తంగా ఉంటాయి. ఆఫ్ లైన్ ఆయినా ఆన్ లైన్ అయినా తిట్లు, శాపనార్థాలు కామన్. మీడియా ముందే దారుణంగా మాట్లాడుతూంటారు.. ఇక సోషల్ మీడియాలో ఊరుకుంటారా ?. వీరికి ఆయా రాజకీయ పార్టీల ముఖ్య నేతల మద్దతు కూడా ఉండటంతో చెలరేగిపోతున్నారు. తప్పుడు ప్రచారాలు.. ఆరోపణలు చేయడానికి ప్రత్యేకంగా ట్రెండింగ్‌లు నిర్వహించడం కామన్ అయిపోయింది. ఈ సోషల్ మీడియా ప్రచారాలు తమకు మేలు చేస్తారని రాజకీయ పార్టీలు గట్టిగా నమ్ముతున్నాయి. అయితే అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్లుగా.. అతిగా మారినప్పుడు రివర్స్ అవుతుంది. ఇప్పుడా స్టేజ్ వచ్చేసినట్లుగానే అనిపిస్తోంది.