Congress Bhatti :  అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి పెద్దగా సభ్యలు లేరు. ఉన్న నలుగురు ఐదుగురికి లీడర్ భట్టి విక్రమార్క. ఏమైనా మాట్లాడే చాన్స్ వస్తే మొదట ఆయనకే వస్తుంది. మూడు రోజుల అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ తరపున ఆయన మాట్లాడారు. కానీ ఆ స్పీచ్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేదిలా లేదని.. కాంగ్రెస్ పార్టీనే ఇబ్బంది పెట్టేలా ఉందన్న అభిప్రాయం ఆ పార్టీలో వినిపిస్తోంది.  అసెంబ్లీలో కేసీఆర్ బీజేపీపై విరుచుకుపడ్డారు. కేసీఆర్ రాజకీయ కోణంలో మాట్లాడారని ... అసెంబ్లీని రాజకీయంగా ఉపయోగించుకున్నారని బీజేపీ విమర్శలు గుప్పించింది. అయితే సభలో మాట్లాడిన కాంగ్రెస్ ఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా బీజేపీపై విరుచుకుపడ్డారు. 


అసెంబ్లీలో టీఆర్ఎస్‌పై సాఫ్ట్.. బీజేపీపై ఘాటుగా విమర్శలు చేసిన భట్టి 


కేంద్రం తెచ్చిన విద్యుత్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని  ఆ చట్టంపై తమ పార్టీకి అభ్యంతరాలు ఉన్నాయన్నారు.  కేంద్రం చట్టం తెచ్చి రాష్ట్రాలు అమలు చేయాల్సిందే అనడం సరికాదని భట్టి విక్రమార్క తెలిపారు. దేశంలో ఉన్న సమస్యలను పక్కకు పెట్టి.. కొత్త చట్టాలను ప్రజలపై బలవంతంగా రుద్దడం ఏంటని ఆయన ప్రశ్నించారు. కేంద్రం జాతి సంపదను అమ్ముకుంటూ వస్తోందని భట్టి ఆరోపించారు. భట్టి విక్రమార్క ప్రసంగంలో కేసీఆర్ కేంద్రంపై చేస్తున్న విమర్శలే ఉన్నాయి. దీంతో బీజేపీ కూడా సెటైర్లు వేసింది. కేంద్రం విద్యుత్ బిల్లుపై బయటమాత్రం కాంగ్రెస్ కేంద్రాన్ని విమర్శిస్తుంది కానీ అసెంబ్లీలో మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వానికి వంత పాడిందని.. అసెంబ్లీ వేదికగా టీఆర్ఎస్ కు కాంగ్రెస్ వత్తాసు పలుకుతోందని టీఆర్ఎస్ తానా అంటే కాంగ్రెస్ తందానా అంటోందంటూ ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. 


టీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనంటున్న బీజేపీ 


నిజానికి కేంద్ర విద్యుత్ బిల్లు ఇంకా ఆమోదం పొంద లేదు. సెలక్ట్ కమిటీకి వెళ్లింది. ఈ కారణంగా అసలు చర్చే అవసరం లేదన్నది బీజేపీ నేతల వాదన. కానీ చర్చ పెట్టడం.. కాంగ్రెస్ పార్టీ తరపున భట్టి విక్రమార్క విమర్శలు చేయడం వారిని ఆశ్చర్య పరిచింది. తెలంగాణ అసెంబ్లీలో అధికార పార్టీ టీఆర్ఎస్. విపక్షం టార్గెట్ చేయాల్సింది.. అధికార పార్టీనే. కానీ భట్టి బీజేపీని టార్గెట్ చేయడం .. ఆ అంశాన్ని బీజేపీ రాజకీయంగా ఉపయోగించుకుంటూడటంతో ... కవర్ చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తంటాలు పడాల్సి వస్తోంది. 


భట్టి విక్రమార్క తీరుపై కాంగ్రెస్‌లో చర్చ 


రాహుల్ పాదయాత్ర ప్రారంభంలో కొంత మంది సీనియర్ నేతలు టీఆర్ఎస్‌ను కలుపుకుని వెళ్తామని చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. వాళ్లు కమ్యూనికేషన్ గ్యాప్‌తో అలా మాట్లాడారని.. టీఆర్ఎస్‌తో దోస్తీ అనే ప్రశ్నే రాదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో భట్టి ప్రసంగం కూడా దానికి తోడైంది.  కేసీఆర్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ పదవి నుంచి దింపాలని కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకు రావాలని .. సర్వశక్తులు ఒడ్డుతున్న రేవంత్ రెడ్డి లాంటి వాళ్లకు కవర్ చేసుకోవడం కష్టమవుతోంది.  టీఆర్ఎస్‌పై కాంగ్రెస్ పోరాటం .,. లైట్ కాకుండా చూసుకోవాలంటే అవకాశం దొరికిన చోటల్లా విమర్శల దాడి చేయడమే మార్గమని అంటున్నారు.