Hyderabad News : హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జన కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత్  రావు తెలిపారు. మంగళవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన... నిమజ్జన కార్యక్రమంలో ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసిందుకు ప్రభుత్వానికి, పోలీస్ సిబ్బంది,  జీహెచ్ఎంసీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉత్సవ సమితి వేడుకలకు మాత్రమే అసోం సీఎంను ఆహ్వానించామన్నారు. ఎలాంటి రాజకీయాలకు ఉత్సవ సమితి తావివ్వదన్నారు. గణేష్ నిమజ్జనం రోజు ఏర్పాటు చేసిన స్వాగత వేదికలు తాము ఏర్పాటుచేశామన్నారు.  తమ వేదిక పైకి వచ్చిన స్థానిక టీఆర్ఎస్ నాయకుడు ప్రోగ్రాంను డిస్టర్బ్ చేశారన్నారు. 


ఫ్లెక్సీలు పెట్టి రాజకీయం 


టీఆర్ఎస్ నాయకులు రాజకీయ ఫ్లెక్సీలు పెట్టి రాజకీయం చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తమ ప్రభుత్వమే స్వాగత వేదికను ఏర్పాటు చేశామని చెప్తున్నారు అది సరికాదు. చాలా ఏళ్లుగా  భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలోనే స్వాగత వేదికలు ఏర్పాటు చేస్తున్నాం. నేను ఎలాంటి విభేదాలు సృష్టించే మాటలు మాట్లాడలేదు. మంత్రి కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు ఈ అలజడికి కారకులుగా అనుమనిస్తున్నాం. నాపై మూడురోజుల తర్వాత కేసు నమోదు చేశారు. చార్మినార్ వద్ద మేము ఏర్పాటు చేసిన స్వాగత వేదికపైకి అసోం సీఎంను రానీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఒక ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించలేదు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు చేసిన స్వాగత వేదికలను అడ్డుకోవాలని మంత్రి తలసాని కుట్ర పన్నారు. మంత్రి ఇలాంటి చర్యలకు పాల్పడడం సరికాదు దీన్ని వెంటనే సరిదిద్దుకోవాలి. 


ప్లాన్ ప్రకారమే దాడి 


"ఎంజే మార్కెట్ ఘటన కావాలనే చేసింది. ఈ కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేయాలని చేశారు. స్థానిక టీఆర్ఎస్ నేత, కొందమంది మహిళలను తీసుకొచ్చి గలాటా చేశారు. ఎప్పుడూ గణేశ్ ఉత్సవ సమితి స్టేజు వద్ద టీఆర్ఎస్ ఫ్లెక్సీలు పెట్టలేదు. ఈ సంవత్సరమే మంత్రి ఫ్లెక్సీలు పెడతామని హడావుడి చేశారు. టీఆర్ఎస్ గణేశ్ ఉత్సవాల్లో గొడవలు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కల్గించి వచ్చే ఏడాది ఉత్సవాలు నిర్వహించకుండా చేయాలని ప్లాన్ చేశారా అనే అనుమానం కలుగుతోంది. లేకపోతే ఒక సామాన్య కార్యకర్త స్టేజు పైకి వచ్చాడు. ఎమ్మెల్యే టికెట్ సాధించాలనే ఉద్దేశంతో నంద కిశోర్ ఇలా దాడి చేసినట్లు తెలుస్తోంది. మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రోద్బలంతో నంద కిశోర్ అసోం సీఎం ముందు మైకు లాగేందుకు ప్రయత్నించారు. ఇలాంటి చర్యలు మానుకోవాలి." - భగవంత్ రావు 


Also Read : Hyderabad News : హైదరాబాద్ ఎంజే మార్కెట్ లో ఉద్రిక్తత, అసోం సీఎం ఉన్న వేదికపై మైకు లాక్కునేందుకు ప్రయత్నించిన వ్యక్తి


Also Read : Hyderabad News : సీఎం కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు, అందుకే అసోం సీఎంకు అడ్డుపడ్డా- నందు బిలాల్