Minister KTR: దిల్లీలో నిర్మించనున్న కొత్త పార్లమెంట్ భవనానికి రాజ్యాంగ నిర్మాత డా. బీ ఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్ శాసనసభలో తీర్మానం ప్రవేశం పెట్టారు. ఇందుకు సంబంధించిన తీర్మానం చేస్తూ అంబేడ్కర్ గొప్పదనాన్ని వివరించారు. ఆయన దేశానికి చేసిన సేవలను చాటి చెప్పారు. దేశానికి దార్శనితకను చూపిన వ్యక్తి అంబేడ్కర్ అంటూ ఆయన సేవల్ని కొనియాడారు. ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే తెలంగాణ వచ్చిందని చెప్పారు. మహనీయుడు అంబేడ్కర్ చూపిన బాటలోనే తెలంగాణ సర్కార్ నడుస్తోందని వివరించారు. సామాజిక, ఆర్థిక, ప్రజాస్వామ్యం సాధించాలని అంబేడ్కర్ చెప్పారని మంత్రి కేటీఆర్ అన్నారు. 


ఆర్థిక, సామాజిక, ప్రజాస్వామ్యం లేకపోతే.. రాజకీయ ప్రజాస్వామ్యం విజయవంతం కాదని అంబేడ్కర్ నమ్మినట్లు మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు. స్వేచ్ఛ, సమానత్వం కోరిన వ్యక్తి అంబేడ్కర్ అని పేర్కొన్నారు. అలాగే అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం దుర్వినియోగం అయితే స్వయంగా తానే దాన్ని తగులబెడతానని ఆయన అన్నట్లు గుర్తు చేశారు. భాషాధిపత్యాన్ని, ప్రాంతీయ ఆధిపత్యాన్ని ఆయన వ్యతిరేకించారన్నారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతీక పార్లమెంట్ అని మంత్రి కేటీఆర్ చెప్పారు. టెంపుల్ ఆఫ్ డెమోక్రసీకి పేరు పెట్టడానికి ఆయనకంటే మించిన, సరైన వ్యక్తి లేరని తెలిపారు. అందుకే కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలన్నారు. 


నేటితో ముగియనున్న అసెంబ్లీ సమావేశాలు ..  
తెలంగాణ శాసన సభ, శాసన మండలి వర్షాల కాల సమావేశాలు ఈరోజుతో ముగియనున్నాయి. చివరి రోజు అయిన మూడో రోజు శాసనసభలో కీలకమైన బిల్లులతో పాటు కేంద్రానికి సంబంధించిన రెండు అంశాలపై చర్చింబోతున్నట్లు సమాచాం. మూడో రోజు సైతం ప్రశ్నోత్తరాలు రద్దు అయ్యాయి. ఉభయ సభల ప్రారంభం కాగానే కేంద్రం విద్యుత్ బిల్లును వ్యతిరేకిస్తూ.. కొత్త పార్లమెంటు భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని కోరుతూ రెండు తీర్మానాలను ప్రవేశపెడతారు. అనంతరం వాటిపై సంపూర్ణంగా చర్చించి ఆమోదం తెలుపుతారు. ఆ తర్వాత శాసన సభలో ఏడు బిల్లులపై చర్చించి ఆమోదం తెలియజేస్తారు. అనంతరం ఎఫ్ఆర్బీఏ చట్టం అమలులో కేంద్ర ద్వంద్వ విధానం - రాష్ట్ర ప్రగతిపై ప్రభావం, ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం అమల్లో కేంద్ర ప్రభుత్వ వైఫల్యంపై ఉభయ సభల్లో రెండు స్వల్ప కాలిక చర్యలు జరుపుతారు. రాత్రి వరకు ఈ చర్చలు జరిగే అవకాశం ఉంది. 


ఉమ్మడి నియామక బోర్డు సహా మరో ఏడు బిల్లులపై చర్చ..


సిద్దిపేట జిల్లా ములుగు వద్ద ఉన్న ఫారెస్ట్ కళాశాలను వర్సిటీగా మారుస్తామని గత మార్చిలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలోనే వర్సిటీకి ప్రత్యేక చట్టం అమలు చేసేందుకు ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది. తెలంగాణ అటవీ శాస్త్ర విశ్వ విద్యాలయానికి సీఎం కేసీఆర్ యే ఛాన్సలర్ గా ఉండబోతున్నారు. తొలి సారిగా సీఎం కులపతి కాబోతున్నారు. తెలంగాణ విశ్వ విద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు-2022 బిల్లు సహా మొత్తం ఏడు బిల్లులను అసెంబ్లీలో సోమవారం ప్రవేశ పెట్టారు. తెలంగాణ వస్తు సేవల పన్ను బిల్లు - 2022, ఆజామాబాద్ పారిశ్రామిక ప్రాంతం రద్దు, మున్సిపల్ చట్టాల సవరణ, బోధనాసుపత్రుల వైద్యు నిపుణుల వయోపరిమితి పెంపు, తెలంగాణ మోటారు వాహనాల పన్నుల సవరణ బిల్లును ఆయా మంత్రులు ప్రవేశ పెట్టారు. శాసన సభలో ఆమోదం అనంతరం మండలిలో బిల్లులపై చర్చించనున్నారు.