Hyderabad News : హైదరాబాద్ లోని ఎంజే మార్కెట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. గణేశ్ శోభాయాత్రలో భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్యర్యంలో మొజంజాహీ మార్కెట్ చౌరస్తా వద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అసోం సీఎం హిమంత బిశ్వశర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వాగత వేదికపై భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నాయకుడు భగవంతరావు మాట్లాడుతుండగా స్థానిక టీఆర్ఎస్ నాయకుడు నందు బిలాల్ స్టేజ్ పైకి వచ్చి మైకు లాక్కునేందుకు ప్రయత్నించాడు. వెంటనే అక్కడున్న భాగ్యనగర్ ఉత్సవ సమితి సభ్యులు నందు బిలాల్ ను అక్కడ నుంచి పక్కకు తీసుకెళ్లారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి టీఆర్ఎస్ కార్యకర్తను అదుపులోకి తీసుకొని పోలీసుస్టేషన్‌కు తరలించారు.
తెలంగాణలో రజాకార్ల పాలన
అనంతరం అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ తెలంగాణలో కుటుంబ పాలన జరుగుతోందని, కేసీఆర్ కుటుంబానికి మాత్రమే మంచి జరుగుతోందని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు మంచి జరగాలని భాగ్యలక్ష్మి అమ్మవారిని కోరుకున్నానని చెప్పారు. ప్రభుత్వం ప్రజలందరి కోసం పనిచేయాలి కానీ, ఒక కుటుంబం కోసం కాదని విమర్శించారు. తెలంగాణలో రజాకార్ల పాలనకు ముగింపు పలకాలన్నారు. దేశాన్ని విశ్వగురువుగా చేసేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారన్నారు. అంతకుముందు హిమంత బిశ్వశర్మ ఛార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడ ఆయన మాట్లాడాల్సి ఉండగా పోలీసులు అనుమతి ఇవ్వలేదు.
ఫ్లెక్సీ వివాదం
తెలంగాణ వ్యాప్తంగా గణేశ్ నిమజ్జన శోభాయాత్ర ఘనంగా జరుగుతోంది. హైదరాబాద్ లోనూ గణేష్ నిమజ్జనం ఘనంగా కొనసాగుతోంది. నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ ఎంజే మార్కెట్ వద్ద ఫ్లెక్సీల వివాదం చెలరేగింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అనుచరులు, భాగ్యనగర్ ఉత్సవ సమితి సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఏర్పాటు చేసిన సభ వేదిక వద్ద ఉన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫ్లెక్సీని తొలగించాలని ఉత్సవ సమితి సభ్యులు డిమాండ్ చేశారు. ఫ్లెక్సీ తొలగించేది లేదని టీఆర్ఎస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. అనంతరం పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పి మరోచోట ఫ్లెక్సీ ఏర్పాటుకు అంగీకరించడంతో పరిస్థితి సర్దుకుంది.
ప్లాన్ ప్రకారమే దాడి - ఈటల రాజేందర్
అసోం సీఎంపై జరిగిన దాడిని ఖండిస్తున్నామని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. సీఎం ఉన్న సభా వేదికపైకి టీఆర్ఎస్ కార్యకర్త ఎలా వచ్చారని ప్రశ్నించారు. ప్లాన్ ప్రకారమే దాడి జరిగిందని ఆయన ఆరోపించారు.
Also Read : Himanta Biswa Sarma On KCR : సూర్యుడి పైనో, చంద్రుడి మీదో కేసీఆర్ ప్రభుత్వం- హిమంత బిశ్వ శర్మ
Also Read : జాతీయ పార్టీ పెట్టాలి .. తెలంగాణలాగే దేశాన్నీ బాగు చేయాలి - కేసీఆర్‌కు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుల విజ్ఞప్తి !