వైద్యో నారాయణ హరి అంటారు. వైద్యులను కనిపించే దేవుళ్లతో పోల్చుతారు. అయితే కొందరు కాసుల కక్కుర్తికి అలవాటు పడి కేవలం డబ్బే ప్రధానంగా వైద్యవృత్తికే కళంకం తీసుకోస్తున్నారు. మరికొందరు నిర్లక్ష్యంతో వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాల మీదకే తెస్తున్నారు. ఓ వైద్యురాలి నిర్లక్ష్యం వల్ల ఓ మాతృమూర్తి తన అమ్మతనానికే దూరమవ్వాల్సిన పరిస్థితి దాపురించింది.
గర్భణీగా ఉన్న మహిళ ఆసుపత్రికి తీసుకెళ్తే గర్భసంచిలో సమస్య ఉందని చెప్పి పరిష్కరిస్తామని నిర్లక్ష్యంతో గర్భవిచ్చితికి కారకురాలయ్యారు. మొదటి కాన్పులో ఆపరేషన్ ద్వారా బిడ్డను కన్న ఆ తల్లి ఇప్పటికే ఆనారోగ్య సమస్యలు ఎదుర్కొంటోంది. ఇప్పుడు ఆపరేషన్ చేసిన వైద్యురాలి నిర్లక్ష్యంతో అంతర్గత భాగాలు దెబ్బతినే పరిస్థితి వచ్చింది. చివరకు గర్భసంచి తొలగించి చేతులు దులుపుకొంది.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురంలో జరిగిన ఈ సంఘటనపై బాధితురాలి భర్త ఓ పోలీసు అధికారి. ఆయనే ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అమలాపురం జిల్లా ఓ ఎస్సై భార్య గర్భవతి. కడపులో నలతగా ఉందని వారం రోజుల క్రితం అమలాపురంలోని ఆదర్శ ఆసుపత్రిలో చూపించారు. గర్భిణీ అయిన ఆమె పొట్టలో తలెత్తిన సమస్యను డీఎన్సీ ద్వారా పరిష్కరించవచ్చని వైద్యురాలు తెలిపారు. అది కాస్తా అబార్షన్ కు దారితీసింది. అదే టైంలో అంతర్భాగంలో మరిన్ని అవయవాలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. దీంతో మేజర్ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. వైద్యురాలి నిర్లక్షంతో ఆమెకు గర్భసంచిని పూర్తిగా తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ముమ్మాటికీ వైద్యులు నిర్లక్ష్యం వల్లనే జరిగిందని ఆసుపత్రిపై, వైద్యురాలిపైనా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు ఎస్సై.
ఆసుపత్రిపై కేసు నమోదు చేసిన పోలీసులు..
పోలీసు డిపార్ట్మెంట్‌లో ఉద్యోగం చేస్తున్న ఎస్సై విషయంలోనే ఆసుపత్రి వైద్యులు ఇంతటి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇక సామాన్యుల విషయంలో ఏం జరుగుతోందోనన్న విమర్శలు ఆసుపత్రిపై వెల్లువెత్తుతున్నాయి. ఆసుపత్రి వైద్యురాలిపై ఎస్సై ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అమలాపురం పట్టణ సీఐ కొండలరావు వెల్లడించారు. ఈ కేసు విషయంలో ఆసుపత్రి వైద్యులు నిర్లక్ష్యం ప్రదర్శించారా.. లేదా అనే స్పష్టత కోసం మెడికల్ బోర్డు వివరణ కోసం లిఖిత పూర్వకంగా సంప్రదించామని, వివరాలు రావాల్సి ఉందని సీఐ తెలిపారు.