సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ( సీబీఐ ) అంటే దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ. ప్రపంచంలో పలు దేశాలలో ఉన్న అత్యున్నత దర్యాప్తు సంస్థలు అద్భుతమైన పనితీరు కనబరిచి దేశ అంతర్గత భద్రత, అవినీతి వంటి సవాళ్లను ఎదుర్కోవడంలో కీలకంగా వ్యవహరిస్తూ ఉంటాయి. అమెరికా ఎఫ్‌బీఐ, బ్రిటన్ స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు ఈ కోవలోకి వస్తారు. ఆ స్థాయికి కాకపోయినా కనీసం వాటిలో ఓ పదిశాతం సామర్థ్యం కూడా దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ చూపించలేకపోతోంది. చేసే ఆ కొద్ది పని రాజకీయ పార్టీల అవసరాల కోసం పని చేస్తోందన్న విమర్శలున్నాయి. అందుకే న్యాయవ్యవస్థ తరచూ సీబీఐపై అసహనం వ్యక్తం చేస్తోంది. 


సీబీఐ పంజరంలో చిలుక..!


సీబీఐ పంజరంలో చిలుక అనే వ్యాఖ్యలు న్యాయస్థానాల వైపు నుంచి తరచుగా వినిపిస్తున్నాయి. దీనికి కారణాలు ఉన్నాయి. మొదటగా కేసులు పెడతారు. అరెస్టులు చేస్తారు. కానీ నిరూపణ వచ్చే సరికి సాక్ష్యాలు ఉండవు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ వారిపై ఎలాంటి కేసులోనూ ముందడుగు వేయరు. కానీ ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలపై లేని కేసుల్లోనూ వేటాడటం ప్రారంభిస్తారు. ఇవన్నీ ప్రజల కళ్ల ముందు కనిపిస్తున్న విషయాలు. కోర్టుల్లో కేసులు విచారిస్తున్న న్యాయమూర్తులకు అనుభవమవుతున్న అంశాలు. అందుకే సీబీఐ పంజరంలో చిలుక అని తేల్చేస్తున్నారు. స్వేచ్చ కావాలని అంటున్నారు.


Also Read : పబ్లిక్ సర్వెంట్లపై కేసులు ఇక అంత సులువు కాదు..!


సీబీఐకి అన్నీ సమస్యలే .. కనీసం సిబ్బంది కూడా ఉండరు..!


సీబీఐ పై ఉండే రాజకీయ ఒత్తిడికి తోడు అరకొర సిబ్బంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఇంత దేశానికి హై ప్రోఫైల్ కేసులు దర్యాప్తు చేసే సీబీఐకి ఉన్న సిబ్బంది సంఖ్య కేవలం ఏడు వేల మంది మాత్రమే. వీరిలో దర్యాప్తు అధికారం ఉన్న వారు రెండు అంటే రెండు వేల మంది మాత్రమే. వీరికి ఇక మౌలిక సదుపాయాలు సాంకేతిక సాయం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. వీరు ఎలాంటి కేసులు విచారణ చేయాలన్నా.. ఎక్కడైతే కేసులు నమోదయ్యాయో అక్కడి పోలీసుల సాయం తీసుకోవాల్సిందే. చాలా కేసుల్లో విదేశాల నుంచి సమాచారం తెప్పించాల్సి ఉంటుంది. సీబీఐ చేతికి వచ్చేది ఆ స్థాయి కేసులే. కానీ అలాంటి సహకారం సీబీఐకి లభించదు. ఇప్పటికే కొన్ని వందల కేసుల్లో విదేశాల నుంచి సమాచారం రాక సాక్ష్యాలు పెండింగ్‌లో ఉండిపోయాయి. కేసుల విచారణ తేలదు.


Also Read: సీబీఐ పనితీరుపై సుప్రీంకోర్టు అసహనం


పెండింగ్‌లో దాదాపుగా ఆరున్నర వేల కేసులు.. !


సీబీఐ నమోదు చేస్తున్న విషయంలో సక్సెస్ రేటు ఎంతో చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేసుల వివరాలు సహా మొత్తం చెప్పాలని ఆదేశించింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ లెక్కల ప్రకారం ప్రస్తుతం సీబీఐ ఆరున్నర వేల కేసుల వరకూ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులన్నీ ఏళ్ల తరబడి పెండింగ్లో ఉండిపోతున్నాయి. ఇరవై ఏళ్ల కింద నమోదైన కేసులు కూడా ఇంకా విచారణలో ఉన్నాయంటే విచారణ విషయంలో ఓ పద్దతి లేదని అర్థం చేసుకోవచ్చు. సీబీఐ చేపట్టే కేసులు అత్యధికంగా పలుకుబడి ఉన్న వారివే ఉంటున్నాయి. రాజకీయంగా సీబీఐపై వచ్చే ఒత్తిడి కారణంగా అనేక కేసులు పక్కన పెడుతూంటారు. మరికొన్ని కేసులు వెనక్కి పోతూంటాయి. ఈ కారణంగా సీబీఐ పనితీరుపై దారుణమైన వైఫల్యం ముద్ర పడుతోంది.


న్యాయవ్యవస్థ చొరవతో సీబీఐ చురుగ్గా మారితే దేశానికి మేలు..!


మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ సీబీఐకి ఎలాంటి స్వయం ప్రతిపత్తి కల్పించాలో పన్నెండు సూచనలతో ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా దృష్టి పెట్టింది. సీబీఐ ఇచ్చే సమాచారం మేరకు సుప్రీంకోర్టు అత్యున్నత దర్యాప్తు సంస్థ విషయంలో కొన్ని కీలకమైన సూచనలు చేసే అవకాశం ఉంది.  వీటిని కేంద్రం అమలు పరిస్తే  సీబీఐపై ఉన్న మచ్చలన్నీ తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. లేకపోతే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సీబీఐ మిత్రపక్షంగా ఉంటుందన్న విమర్శలు కొనసాగుతూనే ఉంటాయి. 


Also Read : కుటుంబాన్ని చంపేసిన "గే" వారసుడు