Weather Update: మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డికి నిరసన సెగ- సౌకర్యాలు, ముంపుపై కడెం వాసుల ఆగ్రహం

Breaking News Live Telugu Updates: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం వెంటనే పొందవచ్చు.

ABP Desam Last Updated: 27 Jul 2023 10:45 AM
మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డికి నిరసన సెగ- సౌకర్యాలు, ముంపుపై కడెం వాసుల ఆగ్రహం


భారీగా కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్టు స్థాయికి మించి ప్రవహిస్తోంది. ఈ ప్రాజెక్టుకు 18 గేట్లు ఉన్నప్పటికీ నాలుగు గేట్లు పని చేయడం లేదు. దీంతో 14 గేట్లు మాత్రమే ఎత్తి దిగువకు నీటిని విడిచిపెడుతున్నారు.  ఎగువ నుంచి భారీగా వరద నీరు రావడంతో గేట్ల పైభాగం నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. అప్రమత్తమైన అధికారులు కడెం వాసులను ఖాళీ చేయించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరాలకు తరలించారు. 


వారిని పరామర్శిచేందుకు వచ్చిన మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డిపై కడెం వాసులు ఆగ్రహం వ్యక్తం చేసారు. గత ఏడాది వచ్చిన వరదలకే కడెం ప్రాజెక్టు గేట్లు పాడైనట్టు చెబుతున్నారు. ఏడాది కాలంగా గేట్లు మరమ్మతులు చేయించలేదు ఎందుకని ప్రశ్నించారు. మంత్రిని ఘొరావ్ చేసిన స్థానికులు తమ సమస్యపై నిలదీశారు. ఆయనతోపాటు ఎమ్మెల్యే రేఖానాయక్‌ను కూడా ప్రశ్నించారు. 
ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరాల్లో కూడా వసతులు సరిగా లేవని కడెం వాసులు మండిపడ్డారు. భోజనం కూడా ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు.  ప్రాజెక్టుకు మరమ్మతులు చేసి ఉంటే తాము ఇలా వరదల్లో చిక్కుకోవాల్సిన దుస్థితి వచ్చేది కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

నీట మునిగిన మొరంచపల్లి - బిల్డింగ్స్‌పై తలదాచుకుంటున్న ప్రజలు

భూపాలపల్లి జిల్లాలో మొరంచవాగు ఉద్ధృతి తీవ్రంగా ఉంది. దీంతో మొరంచపల్లి నీట మునిగింది. వాగు ఆరు ఫీట్ల ఎత్తులో ప్రవహిస్తుండటంతో ఊరిలోకి నీరు చేరింది. దీంతో ప్రజలకు ఎత్తైన బిల్డింగ్‌లు ఎక్కి తలదాచుకుంటున్నారు. 

Background

Weather Update: హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపిన వివరాల మేరకు.. నిన్నటి తీవ్ర అల్పపీడనం ఈ రోజు కూడా ఉత్తర ఆంధ్రప్రదేశ్ - దక్షిణ ఒడిశా తీరాల్లోని, పశ్చిమ మధ్య, పరిసరాల్లోని వాయువ్య బంగాళాఖాతంలో స్థిరంగా ఉంది. తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 7.6 కి మి ఎత్తు వరకు స్థిరంగా కొనసాగుతుంది. ఈ తీవ్ర అల్పపీడనం వాయువ్య దిశగా  నెమ్మదిగా కదులుతూ ఉత్తర ఆంధ్రప్రదేశ్- దక్షిణ ఒడిస్సా తీరాలను చేరుకునే అవకాశం ఉంది.


రుతుపవన ద్రోణి ఈ రోజు జైసల్మేర్, కోట, రైజన్, మాండ్ల, దుర్గ్, పశ్చిమ మధ్య మరియు ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తర ఆంధ్రప్రదేశ్-దక్షిణ ఒడిశా తీరాల మీదుగా ఉన్న అల్పపీడన ప్రాంత కేంద్రం గుండా వెళుతుంది. అక్కడి నుండి తూర్పు-ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఈ రోజు  షీయర్ జోన్ 20°N అక్షాంశం వెంబడి సగటు సముద్ర మట్టం నుండి 3.1 కిమీ నుండి 7.6 కిమి ఎత్తువరకు స్థిరంగా కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణ దిశ వైపు వంగి ఉంది.


ఈ జిల్లాల్లో అతి భారీ, అత్యంత భారీ వర్షాలు (రెడ్ అలర్ట్)
భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. భారీ నుండి అతి భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.


భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో ఈదురు గాలులు గాలి వేగం గంటకు 40-50 కి.మీ.తో వీచే అవకాశం ఉంది.


ఏపీలో ఇలా
ఐఎండీ అంచనా ప్రకారం పశ్చిమ మధ్య, దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తరాంధ్ర - దక్షిణ ఒడిశా తీరంలో అల్పపీడనం కేంద్రీకృతమైందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా. బి.ఆర్ అంబేద్కర్ వెల్లడించారు. ఇది నెమ్మదిగా వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో  విస్తారంగా వర్షాలు పడతాయన్నారు. రేపు అక్కడక్కడ భారీ వర్షాలు, ఎల్లుండి నుంచి తేలికపాటి  నుంచి  మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.


రేపు (జూలై 27) అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల  మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అలాగే శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నట్లు చెప్పారు.


ప్రస్తుత వాతావరణ అంచనా బట్టి ఎల్లుండి నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నట్లు వివరించారు. భారీ వర్షాలు, వరదలు  నేపధ్యంలో ప్రభావిత జిల్లాల యంత్రంగాన్ని అప్రమత్తం చేసి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు.


బుధవారం (జూలై 26) సాయంత్రం 6 గంటల నాటికి  శ్రీకాకుళం జిల్లా తామడలో 145 మిమీ, విజయనగరం జిల్లా గోవిందపురంలో 136 మిమీ, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో 114 మిమీ, విశాఖపట్నంలో 111 మిమీ అధిక వర్షపాతం, దాదాపు 41 ప్రాంతాల్లో 60 మి.మీ కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైందని తెలిపారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.