Andhra Liquor Scam :  వైఎస్ఆర్‌సీపీ హయాంలో ఆంధ్ర ప్రదేశ్ లో ఎవరూ ఊహించనంత భారీ లిక్కర్ స్కాం జరిగిందని  లోక్‌సభలో సంచలన విషయాలను  ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కన్నా.. జగన్ మద్యం కుంభకోణం అతి పెద్దదన్నారు.   లిక్కర్ ఉత్పత్తికి ముందే స్కాం చేసిన ఘనత జగన్‌ దని..   జగన్ బంధువు సునీల్‌రెడ్డి ద్వారా దుబాయ్‌కు రూ.2 వేల కోట్లు తరలించారన్నారు. ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పేరుతో సునీల్‌రెడ్డి ద్వారా రూ.2 వేల కోట్లు దుబాయ్‌కు మళ్లించారు. Adan, Graysons, Leela, JR Associates, PV Spirits లాంటి 26 కొత్త కంపెనీలు భారీ లాభాలు పొందాయన్నారు. తక్కువ నాణ్యత కలిగిన మద్యాన్ని ఉత్పత్తి చేయించి రూ.వేల కోట్లు అధికార పార్టీ అనుబంధ వ్యాపారులకు వెళ్లేలా చేశారని ఆరోపించారు. 


ఈ లిక్కర్ స్కాంపై ఇప్పటికే వీటి అన్నిటిపై రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ ఎంక్వయిరీకి ఆదేశించింది. విదేశీ లావాదేవీలు కూడా ఉన్నాయి కాబట్టి, ఈడీ కూడా రంగంలోకి దిగి విచారణ చేయాలని కేంద్రాన్ని కోరారు.  ప్రభుత్వం మద్యనిషేధ వాగ్దానం చేసి, బినామీ డిస్టిలరీల ద్వారా వేల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిపిందని, APSBCL ను పూర్తిగా ఆధీనంలో పెట్టుకొని, రూ. 2,000 కోట్లు దుబాయ్‌కి మళ్లించారని దీనిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. 






వైఎస్ఆర్‌సీపీ హయాంలో పెద్ద ఎత్తున లిక్కర్ స్కాం జరిగిందని కూటమి పార్టీలు మొదటి నుంచి ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో అధికారంలోకి  రాగానే సీఐడీ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అసెంబ్లీలో చంద్రబాబు సీఐడీతో పాటు ఈడీ విచారణుకు కూడా సిఫారసు చేశారు. కనీ వినీ ఎరుగనంత మనీలాండరింగ్ జరిగిందని కూటమి పార్టీలు అంటున్నాయి. ఈ క్రమంలో ఈడీ విచారణ జరిగితేనే డబ్బులు ఎక్కడెక్కడికి తరలిపోయాయో తెలుస్తాయని.. వాటి వెనుక ఉన్నదెవరో వెల్లడవుతుందని అంటున్నారు. సీఐడీ ఇప్పటికే సమగ్ర విచారణ చేసి.. మనీ ఎలా లాండరింగ్ జరిగిందో.. కూడా రెడీ చేసి పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. 


ఇటీవల తమిళనాడులో లిక్కర్ స్కాం జరిగిందని ఈడీ ప్రకటించారు. వెయ్యి కోట్ల మేర రాజకీయ ప్రముఖులు లంచాలు తీసుకున్నరాని పలు చోట్ల జరిగిన సోదాల తర్వాత ప్రకటించింది. అయితే ఏపీలో జరిగింది ఇంకా అతి పెద్ద స్కామ్ అని.. ఏపీపై ఎందుకు దృష్టి పెట్టరని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో  లావు కృష్ణదేవరాయులు నేరుగా లోక్ సభలో ప్రసంగించడంతో.. ఈ అంశంపై కేంద్రం దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి.