IPL 2025 LSG Vs DC Result Update: ఢిల్లీని గెలిపించిన అశుతోష్.. క్యాపిటల్స్ అద్భుత విజయం.. పూరన్, మార్ష్ విధ్వంసక ఫిఫ్టీలు
సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ ను తలపించేలా సాగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులకు పసందైన మాజాను పంచింది. ఢిల్లీ, లక్నో విజయం కోసం పోరాడటంతో నరాలు తెగే ఉత్కంఠ క్రియేట్ అయింది. చివరికి ఢిల్లీ గెలిచింది.

IPL 2025 LSG VS DC Live Updates: ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత విజయం సాధించింది. సోమవారం విశాఖపట్నంలోని ఏసీఏ, వీడీసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఆతిథ్య ఢిల్లీ క్యాపిటల్స్.. లక్నో సూపర్ జెయింట్స్ పై వికెట్ తేడాతో విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నోకు బ్యాటర్లు సూపర్ స్కోరు అందించారు. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 209 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ (30 బంతుల్లో 75, 6 ఫోర్లు, 7 సిక్సర్లు) తో పూనకం వచ్చినట్లు రెచ్చిపోయాడు. అంతకుముందు ఓపెనర్ మిషెల్ మార్ష్ (36 బంతుల్లో 72, 6 ఫోర్లు, 6 సిక్సర్లు) అద్భుతమైన ఫిఫ్టీ చేశాడు. బౌలర్లలో మిషెల్ స్టార్క్ కు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం ఛేదనలో అశుతోష్ శర్మ (31 బంతుల్లో 66 నాటౌట్, 5 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ ఫిఫ్టీతో పోరాడటంతో ఢిల్లీ గెలిచింది. 19.3 ఓవర్లలో 9 వికెట్లకు 211 పరుగులు చేసింది. కొత్త ప్లేయర్ విప్రజ్ నిగమ్ (15 బంతుల్లో 39, 5 ఫోర్లు, 2 సిక్సర్లు)తో కాసేపు లక్నోను వణికించాడు. బౌలర్లలో దిగ్వేశ్ రాఠీ (2-31) పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఢిల్లీ చరిత్రలో ఇది అత్యధిక చేధన కావడం విశేషం. 2017లో గుజరాత్ లయన్స్ పై 209 పరుగలు ఛేదనను చేయగా, తాజాగా దాన్ని సవరించుకుంది.
హడలగొట్టిన మార్ష్, పూరన్..
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నోకు శుభారంభం దక్కింది. తొలి వికెట్ కు 46 పరుగులు జతయ్యాక ఐడెన్ మార్క్రమ్ (15) ఓటయ్యాడు. ఈ దశలో మార్ష్ తో జత కూడిన పూరన్ ఢిల్లీ బౌలర్లను చితకబాదాడు. వీరిద్దరూ ఆకాశమే హద్దుగా చెలరేగి బౌండరీల వర్షం కురిపించారు. ఈక్రమంలో కేవలం 21 బంతుల్లోనే మార్ష్ ఫిఫ్టీ పూర్తి చేశాడు. ఆ తర్వాత స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో అతను ఔటయ్యాడు. దీంతో రెండో వికెట్ కు నమోదైన 87 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అయితే క్రీజులో ఉన్నంత వరకు వీర బాదుడు బాదిన పూరన్.. 24 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. అయితే పూరన్ భారీ షాట్ కు ప్రయత్నించి ఔటయిన తర్వాత లక్నో.. అనుకున్నదానికంటే తక్కువ స్కోరుకే పరిమితం అయింది. చివర్లో డేవిడ్ మిల్లర్ (27 నాటౌట్) వేగంగా ఆడాడు. మిగతా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ కు రెండు, విప్రజ్, ముఖేశ్ కుమార్ కు ఒక వికెట్ దక్కింది.
65-5 నుంచి ఛేజింగ్..
భారీ టార్గెట్ ఛేజింగ్ కోసం బ్యాటింగ్ కు వచ్చిన ఢిల్లీకి చేదు అనుభవం ఎదురైంది. ఓపెనర్ మెక్ గర్గ్ (1), అభిషేక్ పోరెల్ డకౌట్, సమీర్ రిజ్వీ (4), కెప్టెన్ అక్షర్ పటేల్ (22)లతోపాటు కాసేపు పోరాడిన ఓపెనర్ ఫాఫ్ డుప్లెసిస్ (29) త్వరగా ఔటయ్యారు. దీంతో 65-5తో ఢిల్లీ కష్టాల్లో పడింది. ఈ దశలో ట్రిస్టన్ స్టబ్స్ (34)తో కలిసి అశుతోష్, జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ లక్నో బౌలర్లను సమర్థంగా ఎదుర్కోవడంతో ఢిల్లీ గాడిన పడింది. అయితే మ్యాచ్ మధ్యలో స్టబ్స్ రెండు సిక్సర్లు బాదిన తర్వాత ఆ బంతి కనపడకుండా పోవడంతో, కొత్త బంతిని మార్చారు. ఆ తర్వాతి బంతికే స్టబ్స్ ఔటవడంతో ఢిల్లీ మళ్లీ కష్టాల్లో పడింది. ఈ దశలో విప్రజ్ మెరుపు కామియే ఆడటంతో ఢిల్లీకి ఆశలు చిగురించాయి. అయితే విజయానికి 42 పరుగులు అవసరమైన దశలో తను వెనుదిరగడంతో ఢిల్లీ గెలవడం కష్టమే అనిపించింది. ఈ దశలోనే తనలోని సిసలైన ఫినిషర్ ను బయటకు తీసిన అశుతోష్.. భారీ బౌండరీలు బాది స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. చివరి ఓవర్లో రిషభ్ పంత్.. మోహిత్ శర్మను స్టంపౌట్ మిస్ చేయడం కూడా కలిసి రావడంతో, ఆ తర్వాత భారీ సిక్సర్ ను బాది అశుతోష్ ఢిల్లీకి అద్భుత విజయాన్ని అందించాడు. దీంతో అతనికే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. మిగతా బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, సిద్ధార్థ్, రవి బిష్ణోయ్ లకు తలో రెండు వికెట్లు దక్కాయి. ఈ మ్యాచ్ లో పంత్ కెప్టెన్సీ లోపాలు కూడా లక్నో పాలిట శాపంగా మారాయి. బౌలర్లను తెలివిగా ఉపయోగించక, గాంబ్లింగ్ ఆడటం బెడిసికొట్టింది.