Viral Video: ఐపీఎల్లో బాల్ ట్యాంపరింగ్ కలకలం.. ఇద్దరు చెన్నై ఆటగాళ్లపై ఆరోపణలు..
సాఫీగా సాగుతున్న ఐపీఎల్ లో బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు ఒక్కసారిగా కలకలం రేపాయి. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఈ ఆరోపణలకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తున్నారు.
IPL 2025 Ball Tampering Issue: ఎల్ క్లాసికోగా పేరు గాంచిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ లో చెన్నై పైచేయి సాధించింది. సొంతగడ్డ చేపాక్ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్ లో ముంబైపై నాలుగు వికెట్లతో ఘన విజయం సాధించింది. రచిన్ రవీంద్ర (65 నాటౌట్), రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ ఇన్నింగ్స్ (53)తో సత్తా చాటడంతోపాటు నూర్ అహ్మద్ నాలుగు, ఖలీల్ అహ్మద్ మూడు వికెట్లతో సత్తా చాటారు. అలాగే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ చేసిన మెరుపు స్టంపింగ్ మ్యాచ్ ను మలుపు తిప్పిందనడంలో ఎలాంటి సందేహం లేదు. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ను క్షణంలో పదో వంతు వంతు వేగంతో చేసిన స్టంపింగ్ తో మ్యాచ్ లో చెన్నై ఆధిక్యం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో చెన్ఐ గెలవడం వెనకాల చెన్నై కుట్ర ఉందని కొంతమంది సోషల్ మీడియా వేదికగా ఆరోపిస్తున్నారు. బాల్ టాంపరింగ్ కు చెన్నై పాల్పడిందంటూ నెటిజన్లు కొన్ని వీడియోలను పోస్టు చేస్తున్నారు. దీనిపై అటు చెన్నై ఫ్యాన్స్, ఇటు ముంబై ఫ్యాన్స్ వాదించుకుంటూ, షేర్లు, లైకులతో వైరల్ చేస్తున్నారు.
జేబులో నుంచి తీసి..
ఇక మ్యాచ్ మధ్యలో బౌలర్ ఖలీల్ అహ్మద్ వద్దకు రుతురాజ్ వెళ్లాడు, అతనితో ఏదో మాట్లాడిన తర్వాత తన జేబులో నుంచి ఏదో తీసి, బంతికి అంటించినట్లు కనిపించింది. అయితే ఈ వీడియోను షేర్ చేస్తున్న క్రికెట్ ఫ్యాన్స్ చెన్నై బాల్ టాంపరింగ్ చేసిందని, అందుకే ఈ మ్యాచ్ లో గెలిచారని ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను తెగ వైరల్ చేస్తున్నారు. మరోవైపు చెన్నై ఫ్యాన్స్ మాత్రం బాల్ టాంపరింగ్ ఆరోపణలను కొట్టి పారేస్తున్నారు.
చూయింగ్ గమ్..
బాల్ టాంపరింగ్ వాదనను చెన్నై అభిమానులు ఖండిస్తున్నారు. నిజానికి ఇరువురి మధ్య సంభాషణ జరిగినది నిజమేనని, అయితే వాళ్లు చూయింగ్ గమ్ ఎక్స్ చేంజ్ చేసుకున్నారని వాదిస్తున్నారు. అంతకుమించి అక్కడేమీ జరగలేదని, దీనిపై తమ జట్టు యాంటీ ఫ్యాన్స్ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇక ఈ ఘటనపై అటు ముంబై జట్టు గానీ, ఇటు మ్యాచ్ అధికారుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదు. దీంతో ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి స్పందన రాలేదు. మరోవైపు 2020 నుంచి ముంబైపై చెన్నై ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్ ల్లో ఆరింటిలో విజయం సాధించింది.