తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం ఏడు గంటలకు సూరీడు సుర్రుమంటున్నారు. బయటకు రావాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సి వస్తోంది. ఉపరితల ద్రోణి, ఆవర్తనం కారణంగా ఇప్పటి వరకు వేసవి సెగ తెలియకుండానే మే వచ్చేసింది. మే మొదటి వారంలో కూడా అంతగా ఎండ ప్రభావం కనిపించలేదు. కానీ గత నాలుగైదు రోజుల నుంచి మాత్రం భయపెడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సగటున 41 డిగ్రీలపైగానే ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రానున్న మూడు రోజులపాటు మరింత ఎక్కువ కానున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. 


ఏపీలో వాతావరణం


ఎండలు మండిపోతున్న టైంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఓ కీలక ప్రకటన చేసింది. 127 మండలాల్లో తీవ్రవడగాల్పులు,173 మండలాల్లో వడగాల్పులు ఉండొచ్చని అంచనా వేసింది. రేపు 92 మండలాల్లో తీవ్ర వడగాల్పులు,190 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. 


ఆ మండలాల్లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కూడా ఎండలు మండేపోనున్నాయని జాగ్రత్తగా ఉండాలని ఏపీ విపత్తులన నిర్వహణ సంస్థ జాగ్రత్తలు చెబుతోంది. ప్రజలు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలుకుతోంది. 






విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C - 47°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C - 47°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.  కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C - 44°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదుకావచ్చు.


తెలంగాణలో వాతావరణం


తెలంగాణలో  కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణలో 42 డిగ్రీల నుంచి 45 డిగ్రీలమధ్య ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఆదివారం అత్యధిక ఉష్ణోగ్రత మంచిర్యాల జిల్లా కొండపూర్‌లో 45.9 డిగ్రీలుగా రికార్డు అయింది. హైదరాబాద్ వాతావరణ శాఖ 18 జిల్లాలకు ఆరెంజ్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. అంటే ఆ జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని అంచనా వేస్తోంది. అక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. రేపు 15 జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉండబోతోంది. 






మోకా తుపాను బలహీనం 
అతి తీవ్ర తుపానుగా ఉన్న మోకా మయన్మార్‌లో తీరందాటి బలహీనపడింది. ఉత్తర భారతదేశంలో ఉష్ణోగ్రతలు మళ్లీ పెరగడంతో వేడెక్కిపోతోంది. ఉదయం, సాయంత్రం వాతావరణం కాస్త మెరుగ్గా ఉన్నా మధ్యాహ్నానికల్లా ఎండలు మండిపోతున్నాయి. వేడి గాలులు అతలాకుతలం చేస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వడగాలుల కారణంగా ఉష్ణోగ్రత పెరుగుతుంది. రానున్న ఐదు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండబోదని, కనిష్ఠ ఉష్ణోగ్రత 2 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.






Also Read: సమ్మర్ లో ఐస్ క్రీమ్ తింటున్నారా? జాగ్రత్త ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఎక్కువే


Also Read: వేడి గాలులు మీ కిడ్నీలను దెబ్బతీస్తాయ్, జాగ్రత్త