Viral Video:
యూపీలో ఘటన..
రిస్క్ చేసైనా సరే కొందరు ఫేమస్ అయిపోవాలనుకుంటారు. ఈ సోషల్ మీడియా పాపులర్ అయ్యాక...ఇలాంటి ఫీట్లు బాగా పెరిగిపోయాయి. కొందరు సెల్పీలు తీసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటే...ఇంకొందరు రెప్పపాటులో మృత్యువు నుంచి బయట పడుతున్నారు. రోజూ ఎక్కడో అక్కడ ఇలాంటి వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. అయితే...కొందరు నిరసన వ్యక్తం చేసేందుకు ఇలాంటి రిస్కీ మార్గాలు ఎంచుకుంటారు. సెల్ టవర్లు ఎక్కడం, వాటర్ ట్యాంక్‌లు ఎక్కి గోల చేయటం..కామన్. కానీ...యూపీలోని ఓ వ్యక్తి ఏకంగా హైటెన్షన్ వైర్లతోనే సాహసాలు చేశాడు. అది చూస్తూ చుట్టు పక్కల వాళ్లు టెన్షన్ పడిపోయారు. అసలు వివరాల్లోకి వెళ్తే...యూపీలోని పిలిబిత్ ఏరియాలో అమారియా టౌన్‌లో నివసించే నౌషద్ అనే వ్యక్తి ఈ సాహసం చేశాడు. ఈ నెల 24వ తేదీన ఆ వ్యక్తి ఉన్నట్టుండి పైకి ఎక్కి హైటెన్షన్ వైర్లను పట్టుకుని అటు ఇటూ వేలాడుతూ చుట్టు పక్కల వారిని భయానికి గురి చేశాడు. మార్కెట్‌లో అందరూ చూస్తుండగానే ఇలా చేశాడా వ్యక్తి. ఇదంతా స్థానికులు వీడియో తీశారు. సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకేముంది...క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. ఆ వ్యక్తి వైర్లపై ఫీట్లు చేసినంత సేపు అందరూ అలాగే భయంభయంగా చూస్తూ ఉండిపోయారు.
కరెంట్ లేదు కాబట్టి సరిపోయింది..
మనోడి లక్కు బాగుంది. ఎందుకంటే...అక్కడ భారీ వర్షాల కారణంగా కరెంట్ పోయింది. అందుకే...అలాంటి ఫీట్‌లు చేసినా ఎలాంటి ప్రాణాపాయం సంభవించలేదు. ఈ ఫీట్లు చేయడాన్ని చూసిన స్థానికులు వెంటనే కరెంట్ డిపార్ట్‌మెంట్ వాళ్లకు కాల్ చేశారు. తాము చెప్పేంత వరకూ కరెంట్ ఇవ్వొద్దని చెప్పారు. వెంటనే కొందరు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ వ్యక్తిని వారించి కిందకు దింపారు. నౌషద్...ఓ బండిపై గాజులు విక్రయిస్తుంటాడు. కుటుంబ సభ్యులు వచ్చి అధికారులతో మాట్లాడారు. ఎందుకిలా చేశాడనటానికి ఎలాంటి స్పష్టత రాలేదు. అయితే...కుటుంబ సభ్యులు మాత్రం అప్పుడప్పుడు ఇలానే ప్రవర్తిస్తుంటాడని చెప్పారు. మొత్తానికి కాసేపటి వరకూ అందరినీ టెన్షన్ పెట్టాడీ వ్యక్తి.
Also Read: Uttar Pradesh News: కడుపు నొప్పితో వచ్చిన వ్యక్తికి ఆపరేషన్, ఆ పొట్టలో ఏమున్నాయో చూసి షాకైన వైద్యులు
Also Read: China Restaurant Fire: రెస్టారెంట్‌లో చెలరేగిన మంటలు- ప్రమాదంలో 17 మంది మృతి!