Viral Video: ముంబయిలో (Mumbai) కొంతమంది ఆకతాయిలు రెచ్చిపోయారు. ఓ కొరియన్ (Korean Woman) యువతిపై వేధింపులకు పాల్పడ్డారు. ఆమె ఓ యూట్యూబర్ కావడంతో లైవ్ స్ట్రీమింగ్ చేస్తుండగా కొందరు ఆమెను తాకుతూ, ముద్దు పెట్టేందుకు ప్రయత్నించారు.
ఇదీ జరిగింది
ముంబయి సబర్బ్‌లోని ఖర్ ప్రాంతంలో రాత్రి ఈ ఘటన జరిగింది. బాధిత యువతి లైవ్ స్ట్రీమింగ్‌లో ఉండగా కొందరు యువకులు ఆమె చేయి పట్టుకుని బైక్ వద్దకు లాక్కెళ్లారు. ఆమె దానికి 'నో.. నో' అని అరిచింది. ఆమె ప్రతిఘటిస్తున్నా వదలని ఓ యువకుడు ఆమె చేయి పట్టుకుని లాక్కెళ్లాడు. ఆ తర్వాత ఆమెను ముద్దుపెట్టుకునే ప్రయత్నం చేశాడు. పరిస్థితిని అర్థం చేసుకున్న ఆమె వెంటనే అక్కడి నుంచి ముందుకు నడిచింది.
కానీ మళ్లీ వెనుక వచ్చిన యువకులు లిఫ్ట్ ఇస్తామని ఆమెకు చెప్పారు. ఇందుకు నిరాకరించిన ఆమె తన ఇల్లు సమీపంలోనే ఉందని వచ్చీరాని ఇంగ్లిష్‌లో చెప్పింది.
వైరల్
ఈ మొత్తం ఘటన అప్పటికే లైవ్ స్ట్రీమింగ్ అయింది. అయితే ఈ వీడియోను రీట్వీట్ చేసిన బాధిత యువతి తన పరిస్థితి గురించి వెల్లడించింది.
ఈ వీడియో వైరల్ కావడంతో చాలా మంది ఆ యువకులను అరెస్ట్ చేయాలని ముంబయి పోలీసులకు ట్యాగ్ చేశారు. ఈ వీడియో చూసి విదేశీయులకు భారత్‌పై ఉండే గౌరవం పోయే అవకాశం ఉంటుందని చాలా మంది కామెంట్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు తమంత తామే కేసు నమోదు చేసి ఆమెను వేధింపులకు గురిచేసిన ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు.