Shraddha Murder Case: శ్రద్ధా వాకర్‌ను అత్యంత కిరాతకంగా హత్య చేసిన అఫ్తాబ్ పూనావాలా గురించి తాజాగా మరిన్ని విషయాలు బయటపడ్డాయి. శ్రద్ధాను హత్య చేసిన తర్వాత మరో అమ్మాయితో అదే ఫ్లాట్‌లో అఫ్తాబ్ సహజీవనం చేశాడు. ఆమెను పోలీసులు విచారణకు పిలువగా నిర్ఘాంత పోయే అంశాలు బయటికి వచ్చాయి.


ఓ సైకో


అఫ్తాబ్‌కు ఆమె ఒక డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అయింది. వృత్తి రీత్యా ఆమె ఓ మానసిక వైద్యురాలు. శ్రద్ధా హత్య అనంతరం అఫ్తాబ్ ఆమె దగ్గర కౌన్సెలింగ్ తీసుకున్నాడు. ఆమె అతనితో కలిసి చట్రపుర్‌లోని అఫ్తాబ్ ప్లాట్‌కు కూడా వెళ్ళింది. కానీ అఫ్తాబ్ ఎప్పుడూ భయపడినట్లు, కంగారు పడినట్లు కానీ ఆమెకి అనిపించలేదని సైకియాట్రిస్ట్ తెలిపింది. కొన్ని రోజుల క్రితం వెలుగులోకి వచ్చిన శ్రద్ధా హత్య గురించి తెలిసి తాను షాక్‌కు గురైనట్లు ఆమె చెప్పింది. 


గిఫ్ట్‌గా


ఆమెకి అఫ్తాబ్ ఓ రింగ్ గిఫ్ట్ ఇచ్చాడని తెలిపింది. అయితే విచారణలో అది శ్రద్ధాది అని తేలింది. పలు పెర్ఫ్యూమ్‌లు కూడా గిఫ్ట్‌గా తనకు బహుమతిగా ఇచ్చినట్లు వెల్లడించింది. అఫ్తాబ్ భయపడినట్టు ఎప్పుడూ కనిపించలేదని, సాధారణంగానే ఉండేవాడని, చాలా కేరింగ్‌గా ఉండేవాడని, ముంబయిలోని తన ఇల్లు గురించి మాట్లాడేవాడని, ఎక్కువగా సిగరెట్లు తాగేవాడని ఆమె తెలిపింది. ఎక్కువగా మాంసాహారం ఆర్డర్ చేసేవాడని విచారణలో పోలీసులకు ఆమె తెలిపింది.


మరిన్ని


మే నెలలో శ్రద్ధాను హత్య చేసిన తర్వాత ఈ మానసిక వైద్యురాలు మాత్రమే కాకుండా అఫ్తాబ్‌ చాలా మంది అమ్మాయిలతో టచ్‌లో ఉండేవాడని పోలీసులు కనిపెట్టారు. వివిధ డేటింగ్ సైట్ల ద్వారా దాదాపు 15-20 మంది అమ్మాయిలతో పరిచయం అయింది అని పోలీసులు తెలుసుకున్నారు. అఫ్తాబ్ ఫేస్ బుక్, వాట్సప్, పేటీయం, ఇన్‌స్టాగ్రామ్, గూగుల్ పే వివరాలు పోలీసులకు అందుబాటులోకి వచ్చాయి. జొమాటో వివరాల ప్రకారం ముందు ఇద్దరి కోసం ఆహారం ఆర్డర్ చేసేవాడని, శ్రద్ధా హత్య తర్వాత ఒక్కరికే ఆర్డర్ చేసేవాడని తెలిసింది.


పరీక్షలు


శ్రద్ధాను తానే హత్య చేసినట్లు నిందితుడు అఫ్తాబ్ పూనావాలా పాలీగ్రాఫ్ (లై డిటెక్టర్) పరీక్షలో అంగీకరించాడు. హత్యానంతరం ఆమె శరీర భాగాలను అడవిలో పడేసినట్లు అఫ్తాబ్ ఒప్పుకున్నాడని సమాచారం.


ఆమెను హత్య చేయాలని చాలా కాలం క్రితమే అఫ్తాబ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. చాలా మంది అమ్మాయిలతో తనకు శారీరక సంబంధం ఉన్నట్లు అఫ్తాబ్ ఒప్పుకున్నాడు. మే 18న శ్రద్ధాను హత్య చేసినట్లు అఫ్తాబ్ అంగీకరించాడని, ఆమెను చంపాలనే ఉద్దేశంతోనే ముంబయి నుంచి దిల్లీకి తీసుకొచ్చాడని విశ్వసీయ వర్గాలు తెలిపాయి.


శ్రద్ధాను చంపినందుకు చింతిస్తున్నావా అని అడిగినప్పుడు, అఫ్తాబ్ 'లేదు' అన్నాడు. శ్రద్ధాను హత్య చేసిన తర్వాత ఆమె కుటుంబ సభ్యులకు అఫ్తాబ్ ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఒప్పుకున్నాడు. 


Also Read: దేశంలో 66 శాతం పాఠశాలల్లో 'నో' ఇంటర్నెట్, అధ్వాన్న స్థితిలో బీహార్, మిజోరం రాష్ట్రాలు - తెలంగాణలో పరిస్థితి ఇలా!