Family Swept Away In Waterfall: ముంబయిలోని లోనావాలాలో జలపాతాన్ని చూడడానికి వెళ్లిన ఓ కుటుంబం నీళ్లలో పడి కొట్టుకుపోయింది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు నీళ్లలో పడిపోయారు. వాళ్లలో ఇద్దరు ఎలాగోలా బయటపడినా మిగతా ఐదుగురు మాత్రం గల్లంతయ్యారు. సెలవు రోజున జలపాతం వద్ద కాసేపు గడపాలని వచ్చి ఇలా ప్రాణాలు కోల్పోయారు. వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన అధికారులు ముగ్గురిని గుర్తించారు. మిగతా వాళ్ల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. భూసీ డ్యామ్ వద్ద ఈ విషాదం చోటు చేసుకుంది. వందలాది మంది పర్యాటకులు ఇక్కడికి సెలవు రోజుల్లో వస్తుంటారు. ముఖ్యంగా వర్షాకాలంలో తాకిడి ఎక్కువగా ఉంటుంది. అయితే...వర్షాలు భారీగా కురవడం వల్ల నీటి ఉద్ధృతి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. జలపాతంలోనూ ప్రవాహం పెరిగింది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి వెళ్లిన ఆ కుటుంబం మధ్యలో చిక్కుకుపోయింది. బయటకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించినా ఇద్దరు మాత్రమే ప్రాణాలు దక్కించుకోగలిగారు. ఆ ప్రవాహ వేగాన్ని తట్టుకోలేక మిగతా ఐదుగురు నీళ్లలో కొట్టుకుపోయారు. అక్కడే ఉన్న మరి కొందరు పర్యాటకులు ఇదంతా వీడియో తీశారు. బాధితులు గట్టిగా కేకలు పెడుతున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూస్తుండగానే క్షణాల్లో వాళ్లంతా గల్లంతయ్యారు. సాయం కోసం ఆర్తనాదాలు పెట్టినప్పటికీ చుట్టూ ఉన్న వాళ్లంతా ఏమీ చేయలేక నిలబడిపోయారు. ఒక్కసారిగా ఆ నీటి ప్రవాహం వాళ్లను మింగేసింది. 






జాగ్రత్తలేవి..? 


వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్‌ తాళ్ల సాయంతో ట్రెకింగ్ చేస్తూ గల్లంతైన బాధితుల కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..వాళ్లంతా ప్రమాదవశాత్తూ జలపాతంలోకి జారిపడ్డారు. బయటకు వచ్చేందుకు ప్రయత్నించి ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదం తరవాత అక్కడ భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంత మంది పర్యాటకులు వస్తున్నప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఎలా ఉంటారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. 


మరో చోటా ఇదే విషాదం..


ఇక మరో చోట కూడా ఇలాంటి విషాదమే చోటు చేసుకుంది. పుణేలోని తమ్హిని ఘాట్ వాటర్ ఫాల్ వద్ద ఓ యువకుడు నీళ్లలోకి దూకాడు. కాసేపు సరదాగా ఈత కొట్టాడు. అందులో నుంచి బయటకు వచ్చే సమయంలో ఓ రాయిని ఆసరాగా తీసుకున్నాడు. కానీ ఉన్నట్టుండి చేయిజారి నీళ్లలో పడి కొట్టుకుపోయాడు. క్షణాల్లోనే ఇదంతా జరిగింది. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ే


Also Read: Arvind Kejriwal: మరోసారి ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించిన కేజ్రీవాల్, సీబీఐ అరెస్ట్‌ని సవాల్ చేస్తూ పిటిషన్