New Criminal Laws in India: బ్రిటీష్ కాలం నాటి IPCని పూర్తిగా సంస్కరించింది కేంద్ర ప్రభుత్వం. ఆ స్థానంలో మూడు కొత్త క్రిమినల్ చట్టాలు రూపొందించింది. అవి ఇవాళ్టి నుంచే (జులై 1) అమల్లోకి వచ్చాయి. Indian Penal Code ని పక్కన పెట్టి కొత్తగా భారతీయ న్యాయ సన్హిత, భారతీయ నాగరిక్ సురక్షా సన్హిత, భారతీయ సాక్ష్య యాక్ట్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై ఇండియన్ పీనల్ కోడ్‌తో పాటు కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌లు చెల్లవు. పాత చట్టాలు, నిబంధనలతో సత్వర న్యాయం జరగడం లేదని కేంద్రం భావించింది. పైగా ప్రస్తుత కాలానికి తగ్గట్టుగా ఆ చట్టాలు లేవని, వాటిని సంస్కరించాల్సిన అవసరముందని యోచించింది. అందుకు అనుగుణంగా వాటిలో మార్పులు చేర్పులు చేసింది. కొత్త నిబంధనలు చేర్చింది. గతంలోలా ఓ కేసుని సంవత్సరాల తరబడి విచారించడం ఉండదు. ట్రయల్ పూర్తి కాగానే 45 రోజుల్లోగా తీర్పు ఇచ్చేయాల్సిందే. ఓ కేసు మొట్ట మొదటి విచారణ చేపట్టినప్పటి నుంచి 60 రోజుల్లోగా నిందితులకు తగిన శిక్ష పడాలని ఇందులో (Bharatiya Nyaya Sanhita) నిబంధన చేర్చింది.
అంతే కాదు. ఈ కొత్త చట్టాలతో ఎవరైనా సరే ఏ పోలీస్ స్టేషన్‌లో అయినా Zero FIR నమోదు చేసే అవకాశం కలుగుతుంది. ఆ పోలీస్ స్టేషన్ ఏ జ్యుడీషియరీ పరిధిలోకి వస్తుందన్న దానితో సంబంధం లేకుండా FIR నమోదు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనూ ఈ కంప్లెయింట్స్‌ని రిజిస్టర్ చేసుకోవచ్చు. అత్యంత దారుణమైన నేరాలు జరిగినప్పుడు (Bharatiya Nagarik Suraksha Sanhita) ఆ క్రైమ్ సీన్ అంతా వీడియో తీసే విధంగా ఈ చట్టాల్లో నిబంధనలు చేర్చింది కేంద్రం. లీగల్ ప్రాసెస్‌ని వేగవంతం చేసేందుకు ఎలక్ట్రానిక్ పద్ధతిలోనూ సమన్లు జారీ చేసుకునే వెసులుబాటు కల్పించింది.
అమిత్ షా ఏమన్నారంటే..?
ఈ కొత్త చట్టాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇప్పటికే కీలక విషయాలు వెల్లడించారు. అందరికీ వేగవంతంగా న్యాయం చేయాలన్నదే ఈ చట్టాల లక్ష్యం అని స్పష్టం చేశారు. అయితే...ఈ చట్టాల్ని పకడ్బందీగా అమలు చేయాలంటే ముందుగా అన్ని విభాగాల వాళ్లకీ అవగాహన కల్పించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఫోరెన్సిక్ టీమ్స్‌కి ఇంకాస్త ఎక్కువగా ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ఏడేళ్ల కన్నా ఎక్కువ జైలు శిక్ష పడే అవకాశమున్న నేరాల్లో కచ్చితంగా ఫోరెన్సిక్ టీమ్స్ చురుగ్గా పని చేస్తుందని అమిత్ షా వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఇకపై ఫోరెన్సిక్ టీమ్స్ అవసరం పెరుగుతుందని చెప్పారు. అయితే..ఈ చట్టాలపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. వీటికి అప్పుడే మద్దతు ఇవ్వలేమని, నిపుణులతో చర్చించి వీటిని అమలు చేయాల్సిందని కాంగ్రెస్ తేల్చి చెప్పింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఇదే వాదన వినిపించారు. హడావుడిగా చేసిన చట్టాల్ని అమలు చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
Also Read: Gas Cylinder Price: వంట గ్యాస్ సిలిండర్ మరింత చౌక - మీ ప్రాంతంలో ఎంత తగ్గిందంటే?