Super 6 Scheme: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల హామీలు అమలుపై దృష్టిసారిస్తోంది. ఇప్పటికే చంద్రబాబు(Chandra Babu) మొదటి సంతకాన్ని డీఎస్సీ(DSC)పై పెట్టి నోటిఫికేషన్ విడుదలకు ఆదేశాలివ్వగా...పెంచిన పింఛన్లు సైతం నేరుగా ఆయనే అందజేశారు. ఎన్నికలహామీలో మరో ముఖ్యమైన హామీ మహిళలకు ఆర్టీసీ( RTC)లో ఉచిత బస్సు ప్రయాణంపైనా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. విశాఖ(Visakha) నుంచే ఈ పథకాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు మంత్రి రాంప్రసాద్‌రెడ్డి(Ramprsad ReddY) తెలిపారు.

 

మహిళలు ఉచిత ప్రయాణం

దక్షిణ భారతదేశంలో కొత్త ప్రభుత్వాల ఏర్పాటులో కీలక భూమిక పోషించిన హామీ ఏదైనా ఉందంటే అది మహిళలకు ఆర్టీసీ(RTC) బస్సుల్లో ఉచిత ప్రయాణమే. మహిళా ఓటర్లను గంపగుత్తగా తమ పార్టీకి పడేలా తొలుత కర్ణాటక(Karnataka)లో కాంగ్రెస్‌(Congress)పార్టీ ఈ హామీని ఇచ్చింది. ఇది అసాధ్యమని...అమలు చేయడం కష్టమని ఎన్ని విమర్శలు వచ్చినా వెనకడుగు వేయలేదు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఈ ఒక్క హామీనే గట్టిగా పని చేసిందనడంలో అతిశయోక్తి లేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత ఆర్టీసీ(RTC) బస్సు ప్రయాణాన్ని అమలు చేసి ఔరా అనిపించింది కాంగ్రెస్ ప్రభుత్వం. తొలుత కొన్ని చిన్నచిన్న ఇబ్బందులు ఉన్నా ఇప్పుడు కన్నడ దేశంలో అంతా సర్దుకుంది.

 

కర్ణాటకలో కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టిన మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం హామీనే తెలంగాణ(Telangana)లో రేవంత్‌రెడ్డి ఎత్తుకున్నారు. ఇక్కడా ఆయన సక్సెక్‌ అయ్యారు. అధికారం చేపట్టిన రెండో రోజు నుంచే మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. కర్ణాటకకు మించి తెలంగాణలో ఈ పథకానికి ఆదరణ లభించడమేగాక...ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మహిళల్లో మంచి మార్కులే పడ్డాయి.

 

ఇది గమనించిన చంద్రబాబు(Chandra Babu) సైతం ఏపీ ఎన్నికల ప్రచారంలో మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కూటమి పార్టీలు ప్రకటించిన సూపర్‌6(Super Six) పథకాల్లోనే దీన్ని చేర్చడంతో .మహిళలను ఆకట్టుకుంది. కూటమి ప్రభుత్వం చారిత్రక విజయం సాధించడంతో ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కసరత్తు ప్రారంభించింది.

 

విశాఖ నుంచే ప్రారంభం

మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంపై ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తున్న మంత్రి రాంప్రసాద్‌రెడ్డి...విశాఖపట్నం(Visakha) నుంచే త్వరలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా విశాఖ వచ్చిన రవాణాశాఖ మంత్రి...ఈ మేరకు హామీ ఇచ్చారు. కర్ణాటక, తెలంగాణలో అమలవుతున్న విధానాన్ని ఆర్టీసీ(RTC) అధికారులు అధ్యయనం చేస్తున్నారు. తెలంగాణలో చిన్నచిన్న ఇబ్బందులు ఉన్నాయన...వాటిని అధిగమించి ‌అంతకన్నా ఉత్తమ విధానం తీసుకొచ్చేందుకు కసరత్తు జరుగుతోందన్నారు. మహిళలకు ఎలాంటి ఇ్బబందులు తలెత్తకుండా కట్టుదిట్టంగా ఈ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి రాంప్రసాద్‌రెడ్డి హామీ ఇచ్చారు.

 

వైసీపీ(YCP) ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినట్లు అబద్ధపు ప్రచారం చేసిందని...ఇప్పుటికీ పూర్తిస్థాయిలో విలీనం కాలేదని మంత్రి వెల్లడించారు. ఆర్టీసీలో పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేపట్టనున్నట్లు వెల్లడించిన మంత్రి...ఎలక్ట్రిక్‌ బస్సులకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉండే మహిళలకు త్వరలోనే తీపి కబురు అందిస్తామన్నారు. బస్సుల సంఖ్య కూడా పెంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు.