అసెంబ్లీ ఎన్నికల్లో హామి ఇచ్చినట్టుగానే ఆంధ్రప్రదేశ్‌లో పెంచిన సామాజిక పింఛన్లు పంపిణీ ప్రారంభమైంది. ఉదయం ఆరు గంటలకే లబ్ధిదారుల ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛన్లు అందజేశారు. వారితో మాట్లాడి వారి కుటుంబ స్థితిగతులు తెలుసుకున్నారు. ఆ డబ్బులను వారు ఎలా ఉపయోగిస్తున్నారో అడిగారు. వారితో సుమారు అరగంట పాటు మాట్లాడారు. అనంతరం పింఛన్ డబ్బులను నేరుగా అందజేసి సచివాలయ సిబ్బందితో అధికారిక కార్యక్రమాలు పూర్తి చేశారు.
ఉండవల్లి నివాసం నుంచి ఉదయం 5.45కి బయల్దేరిన ముఖ్యమంత్రి చంద్రబాబు పెనుమాక గ్రామానికి చేరుకున్నారు. అక్కడ ఇద్దరు లబ్ధిదారులకు 6.20 గంటలకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ అందజేశారు. ఎస్టీ కాలనీలోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నేరుగా అందివ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది.
లబ్ధిదారులతో మాట్లాడిన చంద్రబాబు... పిల్లలను బాగా చదివించాలని అప్పుడే కుటుంబాలు బాగుపడతాయని సూచించారు. అలా చేయకుంటే వచ్చే జనరేషన్ కూడా పేదరికంలో ఉండిపోతుందన్నారు. రెండు కుటుంబాలతో చాలా సేపు మాట్లాడిన చంద్రబాబు వారి పిల్లలతో కూడా ముచ్చటించారు. బాగా చదువుకోవాలని సూచించారు.
గుంటూరు జిల్లా పెనుమాకలోని ఎస్టీ కాలనీలో నివాసం ఉంటున్న బాణావత్ పాములు నాయక్ కుటుంబానికి చంద్రబాబు పింఛన్ అందజేశారు. పాముల నాయక్‌కు వృద్ధాప్య పింఛన్, ఆయన భార్యకి కూడా రాజధానిలో భూమిలేని వారికి ఇచ్చే పింఛన్, కూతురు సాయికి వింతంతు పింఛన్ అందజేశారు.
పింఛన్ పంపిణీ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రామంలోని మసీదు సెంటర్‌లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పెంచిన పింఛన్‌తోపాటు మూడు నెలల బకాయిలను కూడా అందజేసినట్టు చెప్పారు. ప్రతి కుటుంబం తమ పిల్లలను చదివించుకుంటే మంచి భవిష్యత్ ఉంటుందన్నారు చంద్రబాబు. తాను తొలి పింఛన్ ఇచ్చిన కుటుంబానికి ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. చుట్టూ పక్కా భవనాలు ఉంటే ఈ ఒక్క కుటుంబం మాత్రం పూరిగుడిసెలో ఉందన్నారు. అందుకే వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నట్టు చంద్రబాబు వెల్లడించారు.