AP Pension Hikes Telugu News | అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీకి అధికారులు సర్వం సిద్దం చేశారు. జులై 1న ఏపీ వ్యాప్తంగా 65.31 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమలుకు శ్రీకారం చుట్టింది. కూటమి మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు పింఛను పెంపు తొలి నెల నుంచే అమలు చేస్తూ కొత్త పింఛన్లను ఏప్రిల్ నుంచి అమలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. 


మంగళగిరి నియోజకవర్గంలో పింఛను ఇవ్వనున్న చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా వెళ్లి పింఛన్ కార్యక్రమం మొదలుపెట్టి, లబ్ధిదారులు కొందరికి సవరించిన కొత్త పింఛన్ అందజేయనున్నారు. ఇందులో భాగంగా చంద్రబాబు ఉండవల్లి నివాసం నుంచి 05.45 గంటలకు బయలుదేరి 06.00 గంటలకు పెనుమాక గ్రామానికి చేరుకోనున్నారు. 06.20 గంటల వరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, ఎస్టీ కాలనీలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సీఎం చంద్రబాబు నేరుగా పింఛన్లు పంపిణీ చేస్తారు. అనంతరం 07.15 వరకు పెనుమాకలోని మసీదు సెంటర్ లో ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని  లబ్ధిదారులు, ప్రజలతో ఆయన ముచ్చటిస్తారు. అనంతరం సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని నివాసానికి బయలుదేరతారు.


ఏపీలో మొత్తం 28 విభాగాలకు చెందిన లబ్దిదారులకు పెన్షన్ అందజేయనున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా సవరించిన పింఛన్లను గడిచిన మూడు నెలలకు కూడా వర్తింపచేశారు. 
- పెరిగిన పింఛనుతో ఏప్రిల్ 1 నుంచి రూ.4000 లబ్ధి, ఏప్రిల్, మే, జూన్ నెలలకు రూ.3000 కలిపి మొత్తం రూ.7000 ఇవ్వనున్నారు. 
- వృద్దులు, వితంతువులు, ఒంటరి మహిళలు, మత్స్య కారులు, కళా కారులు, డప్పు కళాకారులు, చేనేత, కల్లుగీత కార్మికులు, ట్రాన్స్ జెండర్స్ వంటి వారికి జులై నుంచి రూ.4000 పింఛను అందుతుంది
- దివ్యాంగులకు పింఛన్ రూ.3000 పెంచారు. కూటమి ప్రభుత్వం వారికి రూ.6000 పెన్షన్ ఇవ్వనుంది
- తీవ్ర అనారోగ్యంతో దీర్ఘ కాలిక వ్యాధులు ఉండే వారికి ఇచ్చే పెన్షన్ రూ.5000 నుంచి రూ.15000కి పెంచారు. మొత్తం 24318 మంది ఈ విభాగంలో పింఛను పొందుతున్నారు. 


రాష్ట్రంలో పింఛన్ల పెంపు వల్ల చంద్రబాబు ప్రభుత్వంపై నెలకు రూ.819 కోట్ల అదనపు బారం పడనుంది. పెన్షనర్లకు లబ్ధి చేకూర్చేందుకు కూటమి ప్రభుత్వం రూ.4,408 కోట్లు ఒక్క రోజులో పంపిణీ చేయనుంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు సైతం పెంచిన పింఛన్ ఇవ్వడం వల్ల ఏపీ ప్రభుత్వంపై రూ.1650 కోట్లు అదనపు బారం పడనుంది. వైసీపీ ప్రభుత్వం పింఛను కోసం కేవలం నెలకు రూ.1939 కోట్లు ఖర్చు చేసింది. ఏపీలో సచివాలయ ఉద్యోగులు దాదాపు 1,20,097 మందితో పింఛను పంపిణీ చేపట్టనున్నట్లు ప్రభుత్వం ఇది వరకే ప్రకటించింది. చంద్రబాబు ప్రభుత్వం ఏడాదికి ఇకపై రూ.34 వేల కోట్లు పింఛన్ల కోసం ఖర్చు చేయనుంది.