Tasty Lunch Recipes : హెల్తీ ఫుడ్ తీసుకోవాలని అందరికీ ఉంటుంది. కానీ బిజీ లైఫ్​లో పడి హెల్త్​ని కాస్త పక్కన పెట్టేస్తున్నారు. మీరు అలాంటి పరిస్థితుల్లో ఉంటే.. సింపుల్​గా చేసుకోగలిగే.. గార్లిక్​ రైస్​ను ట్రై చేయవచ్చు. ఇది మీకు మంచి రుచిని అందించడమే కాకుండా.. ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. ఎందుకంటే వెల్లుల్లిలోని ఎన్నో సుగుణాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పైగా వెల్లుల్లిని పచ్చిగా తీసుకోవడం ఇష్టం లేని ఇలా తీసుకుంటే.. మంచి రుచిని పొందవచ్చు. మరి ఈ టేస్టీ రెసిపీని ఎలా చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటి? ఎలాంటి టిప్స్ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 


కావాల్సిన పదార్థాలు


వెల్లుల్లి - పావు కప్పు 


నూనె - మూడు టేబుల్ స్పూన్లు


క్యారెట్  - పావు కప్పు


బీన్స్ - 4 టేబుల్ స్పూన్లు


బియ్యం - 1 కప్పు


మిరియాల పొడి - పావు టీస్పూన్


వైట్ పెప్పర్ పొడి - పావు టీస్పూన్


ఉప్పు - రుచికి తగినంత


వెనిగర్ - 1 టీస్పూన్


ఒరిగానో - అర టీస్పూన్


సోయా సాస్ - 1టీస్పూన్


స్ప్రింగ్ ఆనియన్స్ - 1 టీస్పూన్


తయారీ విధానం


ముందుగా బాస్మతి రైస్​ను బాగా కడిగి.. దానిలో కాస్త ఉప్పు వేసి.. వండుకోవాలి. రైస్ మెత్తగా కాకుండా పొడిపొడిలాడేలా ఉంటే మంచిది. వెల్లుల్లిపై పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. క్యారెట్, బీన్స్, స్ప్రింగ్ ఆనియన్స్​ను చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత ముందుగా ఓ చిన్న కడాయిలో నూనె వేసి.. వెల్లుల్లి ముక్కలను వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి గోల్డెన్ బ్రౌన్​లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. అప్పుడే రుచి మంచిగా ఉంటుంది. మరీ ఎక్కువగా వేగితే రుచి మారిపోతుంది. చేదుగా అవుతుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. 


వెల్లుల్లి గోల్డెన్​ రంగులోకి మారిన తర్వాత.. వాటిని పక్కకు తీసేయాలి. ఇప్పుడు మందపాటి కడాయి తీసుకోండి. దానిలోకి వెల్లుల్లి వేయించిన నూనె, మరికాస్త నూనె వేయాలి. దానిలో క్యారెట్ ముక్కలు వేసి ఓ నిమిషం వేయించాలి. అనంతర బీన్స్ వేసి మరో నిమిషం వేయించాలి. మరీ ఎక్కువగా వేయిస్తే వాటిలోని క్రంచీనెస్ పోతుంది. రుచిగా ఉండాలంటే వాటిని ఎక్కువసేపు వేయించకపోవడమే మంచిది. ఇప్పుడు దానిలో వేయించుకున్న వెల్లుల్లి వేసుకోండి. ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని దీనిలో వేసి బాగా కలపాలి.


అన్నంలో ముందుగానే ఉప్పు వేసి ఉడికిస్తాము కాబట్టి ఉప్పు వేసుకునే సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఎక్కువయ్యే ప్రమాదముంది. ఇప్పుడు దీనిలో మిరియాలపొడి, వైట్ పెప్పర్ పొడి, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. వెనిగర్, సోయా సాస్ వేసి మంటను ఎక్కువ చేసి.. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దానిలో స్ప్రింగ్ ఆనియన్స్  వేసి.. ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకుని కలిపి.. స్టౌవ్ ఆపేయాలి. అంతే టేస్టీ, హెల్తీ గార్లిక్ రైస్ రెడీ. ఇది పెద్దల నుంచి పిల్లలకు ఎంతో నచ్చుతుంది. పైగా మంచి రుచిని అందించడంతో పాటు.. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తుంది. 


Also Read : సండే స్పెషల్ టేస్టీ హల్వా.. కరాచీ స్టైల్​లో రావాలంటే ఈ టిప్స్ ఫాలో అయిపోండి