Delhi Liquor Scam: సీబీఐ అరెస్ట్‌ని సవాల్ చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే ఆయనను ఈడీ అరెస్ట్ చేసి తీహార్ జైలుకి తరలించింది. దీనిపై విచారణ జరుగుతుండగానే సీబీఐ కూడా రంగంలోకి దిగింది. అప్పటి నుంచి విచారణ కొనసాగుతోంది. ఈ మధ్యే అరవింద్ కేజ్రీవాల్‌ని జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని రౌజ్ అవెన్యూ కోర్టుని కోరింది. ఈ మేరకు కోర్టు అంగీకరించింది. జులై 12వ తేదీ వరకూ కస్టడీలో ఉంచేందుకు అనుమతినిచ్చింది. ఈ మొత్తం స్కామ్‌లో కేజ్రీవాల్ ప్రధాన సూత్రధారి అని ఈడీ తేల్చి చెప్పగా ఇప్పుడు CBI కూడా అదే వాదిస్తోంది. విచారణ ఇంకా కొనసాగుతోందని కోర్టుకి వెల్లడించింది. అయితే...ఆయన సరిగా సహకరించడం లేదని అసహనం వ్యక్తం చేసింది. ఏ ప్రశ్నకీ సరైన సమాధానం ఇవ్వడం లేదని చెప్పింది.






అప్పటి వరకూ కస్టడీలోనే..


అంతకు ముందు మూడు రోజుల కస్టడీ ముగిసిన క్రమంలో కోర్టులో హాజరు పరిచింది. ఆ సమయంలోనే మరో 14 రోజుల పాటు కస్టడీని పొడిగించాలని కోరింది. ఈ మేరకు కోర్టు అంగీకరించింది. ఇంటరాగేషన్ పూర్తి కాకుండానే బయటకు పంపిస్తే సాక్ష్యాధారాలను ప్రభావితం చేసే ప్రమాదముందని వెల్లడించింది. దీనిపై ఇంకా విచారణ జరగాల్సి ఉన్నందున తమకు సహకరించాలని కోర్టుని సీబీఐ కోరింది. ప్రస్తుతానికి అరవింద్ కేజ్రీవాల్ మాత్రం సీబీఐ అరెస్ట్‌ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరగాల్సి ఉంది. జూన్ 26న తిహార్‌ జైల్‌లో ఉండగానే కేజ్రీవాల్‌ని CBI అధికారులు అరెస్ట్ చేశారు. మనీ లాండరింగ్ కేసులో భాగంగా అదుపులోకి తీసుకున్నారు.


చాలా రోజులుగా అరవింద్ కేజ్రీవాల్ బెయిల్‌పై బయటకు వచ్చేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవలే రౌజ్ అవెన్యూ కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. ఇక జైలు నుంచి విడుదలవ్వడమే మిగిలుంది అనుకుంటుండగా మరో షాక్ తగిలింది. ఆయన బెయిల్‌ని సవాల్ చేస్తూ ఈడీ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు బెయిల్‌పై స్టే ఇచ్చింది. ఫలితంగా మళ్లీ కేజ్రీవాల్ జైలుకే పరిమితం కావాల్సి వచ్చింది. ఆ తరవాత సీబీఐ రంగంలోకి దిగి అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి విచారణ కొనసాగుతోంది. తనను అక్రమంగా అరెస్ట్ చేశారని కేజ్రీవాల్ ఇప్పటికే చాలా సార్లు వాదించారు. పదేపదే కోర్టులో పిటిషన్‌లు వేస్తున్నారు. ఇప్పుడు మరోసారి పిటిషన్ వేశారు. 


Also Read: NEET Row: లోక్‌సభలో నీట్‌పై చర్చకు డిమాండ్‌, అనుమతి ఇవ్వని స్పీకర్ - విపక్షాలు వాకౌట్