ICC's T20 World Cup 2024 team of the tournament: 13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ప్రపంచకప్‌ను చేతబట్టి టీమిండియా అభిమానుల కలను నెరవేర్చింది. జట్టులోని ఆటగాళ్లు అందరూ ఏదో ఒక సందర్భంలో కీలకంగా మారి ఈ ప్రపంచకప్‌ను భారత్‌కు తీసుకొచ్చేశారు. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లోనూ ఓటమి అంచుల నుంచి కోలుకుని రోహిత్‌ సేన విశ్వ విజేతగా నిలిచింది. ఈ మెగా టోర్నమెంట్‌ను సమర్థంగా నిర్వహించిన అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ ICC... 2024 టీ ట్వంటీ ప్రపంచకప్‌ జట్టును ప్రకటించి ఈ విశ్వ కప్‌ ప్రక్రియకు ముగింపు పలికింది.  



ఐసీసీ(The International Cricket Council) ప్రకటించిన జట్టులో టీమిండియా నుంచే ఆరుగురు ఆటగాళ్లకు చోటు దక్కింది.  ఈ టోర్నమెంట్‌లో అద్భుతాలు చేసిన ప్రతీ ఆటగాడిని ఐసీసీ తన జట్టులోకి తీసుకుంది. ఈ జట్టుకు కెప్టెన్‌గా టీమిండియా సారధి రోహిత్ శర్మను నియమించింది. మిడిల్ ఆర్డర్ స్టార్ సూర్యకుమార్ యాదవ్ కూడా స్థానం దక్కించుకున్నాడు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు కూడా ఈ జట్టులో చోటు దక్కింది. ఈ ప్రపంచకప్‌లో లీడింగ్‌ వికెట్‌ టేకర్లుగా ఉన్న బుమ్రా-అర్ష్‌దీప్‌ ద్వయానికి కూడా ఐసీసీ తన జట్టులో స్థానం కల్పించింది. టీమిండియాకు ప్రపంచకప్‌ రావడంలో ఈ ఇద్దరు సీమర్లు కీలక పాత్ర పోషించారు. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్ డెత్ ఓవర్లలో అద్భుత బౌలింగ్‌తో పొట్టి ప్రపంచకప్‌ను భారత్‌కు తీసుకొచ్చారు. అయితే ఫైనల్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన భారత స్టార్ స్టార్ విరాట్ కోహ్లికి మాత్రం ఈ జట్టులో చోటు దక్కలేదు. ఐసీసీ ప్రకటించిన జట్టులో ఫైనల్‌ 11లో దక్షిణాఫ్రికా  నుంచి ఒక్కరికి కూడా చోటు దక్కలేదు. 12వ ఆటగాడిగా మాత్రం  నోర్ట్జేను ఎంపిక చేశారు. అయితే టీ 20 ప్రపంచకప్‌ ఫైనల్‌కు చేరిన జట్టు నుంచి ఒక్కరికి కూడా ఫైనల్‌ 11 చోటు దక్కకపోవడం విమర్శలకు తావిస్తోంది. 



ఐసీసీ టీ 20 జట్టు
రోహిత్ శర్మ - పరుగులు: 257, స్ట్రైక్-రేట్: 156.7, అర్ధశతకాలు: 3
రహ్మానుల్లా గుర్బాజ్ - పరుగులు: 281, స్ట్రైక్-రేట్: 124.33, అర్ధశతకాలు: 3 
నికోలస్ పూరన్ - పరుగులు: 228, స్ట్రైక్-రేట్: 146.15, అర్ధశతకాలు: 1 
సూర్యకుమార్ యాదవ్ - పరుగులు: 199, స్ట్రైక్-రేట్: 135.37, అర్ధశతకాలు: 2 
మార్కస్ స్టోయినిస్ - పరుగులు: 169, స్ట్రైక్-రేట్: 164.07, వికెట్లు: 10 
హార్దిక్ పాండ్య - పరుగులు: 144, స్ట్రైక్-రేట్: 151.57, వికెట్లు: 11, 
అక్షర్ పటేల్ - పరుగులు: 92, స్ట్రైక్-రేట్: 139.39, వికెట్లు: 9
రషీద్ ఖాన్ - వికెట్లు: 14, ఎకానమీ: 6.17, బెస్ట్: 4/17 
జస్ప్రీత్ బుమ్రా - వికెట్లు: 15, ఎకానమీ: 4.17, బెస్ట్‌ : 3/7 
అర్ష్‌దీప్ సింగ్ - వికెట్లు: 17, ఎకానమీ: 7.16, బెస్ట్‌: 4/9 
ఫజల్‌హక్ ఫరూకీ - వికెట్లు: 17, ఎకానమీ: 6.31, బెస్ట్‌: 5/9 
అన్రిచ్ నోర్ట్జే - వికెట్లు: 15,  , ఎకానమీ: 5.74, బెస్ట్: 4/7