Rohit Sharma: ఇప్పుడే రిటైర్ అవ్వాలనుకోలేదు, పరిస్థితులే అలా నడిపించాయ్
Rohit Sharma Retirement: భారత్ కు టీ 20 ప్రపంచ కప్ అందించిన వెనువెంటనే రోహిత్ శర్మ రెటైర్మెంట్ ప్రకటించాడు. అయితే అది ముందుగా అనుకుని తీసుకున్న నిర్ణయం కాదని హిట్ మ్యాన్ స్వయంగా చెపాడు
Continues below advertisement
Rohit Sharma About His Retirement: టీ 20 క్రికెట్ నుంచి రోహిత్ (Rohit) రిటైర్ కావాలని అనుకోలేదా... మరి కొంతకాలం ఈ ధనాధన్ క్రికెట్‌లో కొనసాగాలని అనుకున్నాడా... అంటే అవుననే సమాధానమే వస్తుంది. తాను మరి కొంతకాలం టీ 20 క్రికెట్‌లో కొనసాగాలని అనుకున్నానని... కానీ పరిస్థితులు తనను రిటైర్‌మెంట్(Retirement) వైపు నడిపించాయని హిట్ మ్యాన్ తెలిపాడు. రిటైర్‌మెంట్ విరమణ తర్వాత రోహిత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. టీ 20లకు వీడ్కోలు చెప్పడానికి ఇంతకన్నా మంచి సమయం కూడా ఉండదని టీమిండియా సారధి తెలిపాడు.
పరిస్థితుల వల్లే..
భారత జట్టుకు రెండో టీ 20 ప్రపంచకప్(T 20 World Cup)ను రోహిత్ శర్మ అందించాడు. కెప్టెన్‌గా సమర్ధవంతమైన పాత్ర పోషించిన హిట్ మ్యాన్.. తన కలను సాకారం చేసుకున్నాడు. టీమిండియా రెండో ప్రపంచకప్ గెలవగానే తాను టీ 20 క్రికెట్‌కు వీడ్కోలు చెబుతున్నట్లు రోహిత్ ప్రకటించాడు. పొట్టి క్రికెట్‌కు వీడ్కోలు పలకడానికి ఇంతకన్న మంచి సమయం దొరకదని తెలిపాడు. ఫైనల్‌లో బార్బడోస్‌లోని కెన్సింగ్‌టన్ ఓవల్‌లో భారత్ ఏడు పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి విశ్వ విజేతలుగా నిలిచిన తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్, రవీంద్ర జడేజా పొట్టి క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు. ఇదే తన చివరి అంతర్జాతీయ టీ 20 మ్యాచ్ అని... వీడ్కోలు చెప్పడానికి ఇంతకంటే మంచి సమయం లేదని రోహిత్ విలేకరుల సమావేశంలో ప్రకటించాడు. ఈ ట్రోఫీని అందుకునేందుకు తాము మాటల్లో చెప్పలేనంత కష్టపడ్డామని తెలిపాడు. తాను టీ 20ల నుంచి రిటైర్ అవ్వాలనుకోలేదని.. కానీ ఇప్పుడు వైదొలగక తప్పని పరిస్థితి ఉందని హిట్‌మాన్ తెలిపాడు. ఈ ప్రపంచకప్ గెలవాలని తాను బలంగా కోరుకున్నానని... అది జరిగిందని.. అందుకే టీ 20లకు రిటైర్‌మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నానని వెల్లడించాడు. తాను టీ 20ల నుంచి ఇప్పుడే రిటైర్ అవుతానని అనుకోలేదని.. కానీ పరిస్థితి అలా ఉందని.... ఇప్పుడు రిటైర్‌మెంట్ ప్రకటించడమే మంచిదని తాను అనుకుంటున్నానని.. కప్ గెలిచి వీడ్కోలు చెప్పడం కంటే గొప్ప ఏముంటుందని రోహిత్ తెలిపాడు. 37 ఏళ్ల రోహిత్ 2022 T20 ప్రపంచ కప్‌లో భారత్‌కు సారథ్యం వహించాడు. అప్పుడు టీమిండియా సెమీఫైనల్స్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది. స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచ కప్‌లో భారత్ ఫైనల్‌కు చేరుకుంది. అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోయింది.
రోహిత్ కెరీర్
రోహిత్ 159 టీ 20 మ్యాచుల్లో ఐదు సెంచరీలు, 32 అర్ధ సెంచరీలతో 4231 పరుగులు చేసి టీ 20లకు గుడ్‌బై చెప్పాడు. టెస్టు, వన్డే ఫార్మాట్లలో మాత్రం రోహిత్ కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ టీ 20ల నుంచి తప్పుకోవడంతో హార్దిక్ పాండ్యాకు భారత కెప్టెన్సీ పగ్గాలు అప్పగించనున్నారు.
Continues below advertisement