BCCI announces prize money for Team India | న్యూఢిల్లీ: టీమిండియా ఆటగాళ్లపై బీసీసీఐ కనక వర్షం కురిపించింది. టీ20 వరల్డ్ కప్ 2024 నెగ్గిన భారత జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రూ.125 కోట్ల భారీ నజరానా ప్రకటించింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. బార్బడోస్ వేదికగా శనివారం (జూన్ 29) రాత్రి జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో దక్షిణాఫ్రికాపై భారత క్రికెట్ జట్టు 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా రెండో టీ20 వరల్డ్ కప్‌ను భారత్ ముద్దాడింది. టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన చేసి ట్రోఫీ నెగ్గిన భారత ఆటగాళ్లకు బీసీసీఐ భారీ నజరానాతో కనకవర్షం కురిపించింది.
‘టీ20 ప్రపంచ కప్ నెగ్గిన భారత జట్టుకు బీసీసీఐ రూ.125 కోట్ల ప్రైజ్ మనీ ప్రకటించింది. ఐసీసీ మెగా టోర్నీలో భారత జట్టు అసాధారణ ప్రతిభ కనబరిచింది. ఆటగాళ్లు ధృడ సంకల్పంతో ఆడి, అత్యుత్తమ క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించారు. ఈ అద్భుత విజయాన్ని సాధించిన భారత ఆటగాళ్లు, కోచ్‌లతో పాటు సహాయక సిబ్బంది అందరికీ అభినందనలు’ అని బీసీసీఐ కార్యదర్శి జై షా పోస్ట్ చేశారు.
T20 వరల్డ్ కప్ ప్రైజ్ మనీ - ఏ జట్టుకు ఎంత వచ్చింది వివరాలు
టీ20 ప్రపంచ కప్ మొత్తం ప్రైజ్ మనీ 11.25 మిలియన్ డాలర్లు కాగా, దీని విలువ భారత కరెన్సీలో దాదాపు రూ. 93.5 కోట్లకు సమానం. T20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత్ జట్టుకు 2.45 మిలియన్ డాలర్లు, అంటే రూ. 20 కోట్లు ప్రైజ్ మనీ లభించింది. రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికా కనీసం 1.28 మిలియన్ డాలర్లు భారత కరెన్సీలో రూ.10.64 కోట్లు దక్కుతాయి. కనీసం సెమీఫైనల్స్ చేరుకున్న ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లకు రూ.6.56 కోట్ల చొప్పున ప్రైజ్ మనీ లభించింది. సూపర్ 8కు చేరిన జట్లు అమెరికా, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, వెస్టిండీస్ లకు రూ. 3.18 కోట్ల చొప్పున వస్తుంది.
9 నుంచి 12 స్థానాల్లో నిలిచిన పాకిస్తాన్, స్కాట్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక ఒక్కో జట్టుకు దాదాపు రూ.2.06 కోట్లు - 13 నుంచి 20 వరకు స్థానాల్లో ఉన్న జట్లు నెదర్లాండ్స్, నేపాల్, ఉగాండా, పాపువా న్యూ గినియా, నమీబియా, ఒమన్, ఐర్లాండ్, కెనడాలకు రూ.1.87 కోట్లు వచ్చాయి. సెమీఫైనల్స్, ఫైనల్ మినహా గెలిచిన ఇతర ఒక్కో మ్యాచ్‌కు 31,154 డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.26 లక్షల చొప్పున అందుతుంది.