Ravindra Jadeja Retires From T20I | న్యూఢిల్లీ: టీమిండియా నుంచి అభిమానులకు షాకుల మీద షాకులు వస్తున్నాయి. టీ20 వరల్డ్ కప్ విజేతగా టీమిండియా నిలిచిన తరువాత మొదట విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. తాజాగా టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. కోహ్లీ, రోహిత్ శర్మల రిటైర్మెంట్ ను అంచనా వేశారు. కానీ జడేజా సైతం పొట్టి ఫార్మాట్ కు వీడ్కోలు పలుకుతాడని ఎవరూ ఊహించలేదు. వన్డేలు, టెస్టు ఫార్మాట్లలో కొనసాగనున్నట్లు జడేజా స్పష్టం చేశాడు.


టీ20 వరల్డ్ కప్ నెగ్గిన టీమ్ సభ్యుడు జడేజా 
శనివారం (జూన్ 29) రాత్రి 17 ఏళ్ల తరువాత భారత్ టీ20 వరల్డ్ కప్ నెగ్గడంతో దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించేశారు. ఆదివారం నాడు ఆల్ రౌండర్ జడేజా సైతం అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు జడ్డూ. ‘నాకు ఇంతవరకు సహకరించిన వారికి ధన్యవాదాలు. అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలుకుతున్నారు. ప్రతి క్షణం, ప్రతి మ్యాచ్ లో దేశం విజయం కోసం ప్రయత్నించాను. T20 ప్రపంచ కప్ నెగ్గాలన్న మా కల నిజమైంది. రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నాను’ అని రిటైర్మెంట్ పోస్ట్‌లో రవీంద్ర జడేజా రాసుకొచ్చాడు. 






రవీంద్ర జడేజా టీ20 కెరీర్.. 
74 టీ20ల్లో భారత్ ప్రాతినిధ్యం వహించిన రవీంద్ర జడేజా 54 వికెట్లు పడగొట్టాడు. బ్యాట్‌తో విలువైన సమయాల్లో రాణించిన జడ్డూ 515 రన్స్ చేశాడు. 28 క్యాచ్‌లు అందుకున్న జడ్డూ టీ20ల్లో బెస్ట్ బౌలింగ్ 3/15 నమోదు చేశాడు. దశాబ్దకాలం నుంచి టీ20 ప్రపంచ కప్‌లు ఆడుతున్న జడ్డూ టీ20 వరల్డ్ కప్ తొలిసారి సాధించిన ఆటగాడయ్యాడు. 2019 వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్లో జడేజా పోరాటాన్ని క్రికెట్ ప్రేమికులు ఎప్పటికీ మరిచిపోరు.