Surya Kumar Yadav Catch: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ (ICC T20 World cup 2024 final) మ్యాచ్ లో.. దక్షిణాఫ్రికాపై అద్భుత రీతిలో గెలిచిన భారత్.. టైటిల్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో.. డేవిడ్ మిల్లర్ (David Miller) ఇచ్చిన క్యాచ్ ను బౌండరీ లైన్ దగ్గర సూర్య కుమార్ యాదవ్ (Surya Kumar Yadav) ఒడిసి పట్టడం మ్యాచ్ కే హైలైట్ గా నిలిచింది. క్రికెట్ చరిత్రలోనే ఇదో అద్భుతమైన క్యాచ్ అంటూ నిన్నటి నుంచి కాంప్లిమెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ క్యాచే.. సౌతాఫ్రికాకు విజయాన్ని దూరం చేసిందని క్రికెట్ ఎక్స్ పర్ట్స్ సైతం అభిప్రాయపడ్డారు. కానీ.. సూర్య కుమార్ యాదవ్ పట్టిన ఈ క్యాచ్.. వివాదాస్పదంగా మారింది. క్యాచ్ పట్టే క్రమంలో.. బౌండరీ లైన్ కుషన్ ను సూర్య పాదం తాకిందంటూ.. ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సూర్య పాదాన్ని పూర్తి క్లోజప్ లో తీసి మరీ ఆ వీడియోను సౌతాఫ్రికా ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. అసలు డేవిడ్ మిల్లర్ ఔట్ కాలేదని.. అతను క్రీజులో ఉండి ఉంటే మ్యాచ్ రిజల్ట్ మరోలా ఉండేదని కామెంట్లు చేస్తున్నారు.
అసలు జరిగిన విషయం ఏంటంటే.. ఇన్నింగ్స్ చివరి ఓవర్ లో సౌతాఫ్రికా విజయానికి 16 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులో డేవిడ్ మిల్లర్ ఉన్నాడు. బంతిని పాండ్యా తీసుకున్నాడు. మొదటి బాల్ నే డేవిడ్ బౌండరీ లైన్ వైపు భారీ షాట్ కొట్టాడు. అక్కడే ఫీల్డింగ్ పాయింట్ లో ఉన్న సూర్య కుమార్ యాదవ్.. అమాంతం గాల్లోకి ఎగిరి క్యాచ్ పట్టుకున్నాడు. బౌండరీ లైన్ ను తన శరీరం తాకకుండా జాగ్రత్తపడుతూ తిరిగి గాల్లోకి బాల్ ను విసిరిన సూర్య.. క్షణాల్లో మళ్లీ ఫీల్డింగ్ పాయింట్ లోకి వచ్చి.. ఆ బాల్ ను అందుకున్నాడు. అలా డేవిడ్ మిల్లర్ ఔటయ్యాడు. అయితే.. ఈ ప్రాసెస్ లో సూర్య పాదం.. బౌండరీ లైన్ కుషన్ ను తాకిందంటూ సౌతాఫ్రికా ఫ్యాన్స్ ఓ వీడియోను వెలుగులోకి తెచ్చారు. అది సిక్స్ అయి ఉంటే.. మ్యాచ్ తమ చేతుల్లోకి వచ్చి ఉండేదని ఆవేదన చెందుతున్నారు.
ఈ వీడియో గమనిస్తున్న భారత క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం.. మరో వర్షన్ వినిపిస్తున్నారు. సూర్య పాదం.. బౌండరీ లైన్ కుషన్ తాకినట్టు కనిపిస్తున్న విషయాన్ని అంగీకరిస్తున్నారు. కానీ.. అది జరిగేలోపే సూర్య తన చేతిలోని బాల్ ను గాల్లోకి విసిరాడని.. ఆ తర్వాతే బౌండరీ లైన్ లోపలికి వెళ్లి తిరిగి క్షణాల్లో బయటికి వచ్చాడని.. ఆ తర్వాతే క్యాచ్ పట్టుకున్నాడని ఆ వీడియోను విశ్లేషిస్తున్నారు. ఇందులో అంపైర్ల తప్పేం లేదని.. వారు సరిగానే నిర్ణయం తీసుకున్నారని తేల్చి చెబుతున్నారు. ఇదంతా చూస్తున్న సౌతాఫ్రికా ఫ్యాన్స్ మాత్రం.. తమ జట్టుకు అన్యాయం జరిగిందని.. థర్డ్ అంపైర్ ఒకటికి రెండు సార్లు పరిశీలించి ఉంటే బాగుండేదని అంటున్నారు.
ఐసీసీ టోర్నమెంట్లలో (ICC tournaments) ఇప్పటివరకూ ఒక్క టైటిల్ కూడా సొంతం చేసుకోని తమ జట్టుకు ఈ సిరీస్ ఫైనల్స్ చేరడంతో.. విక్టరీపై చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. చివరికి భారత్ (T20 World Cup 2024 Winner India) విజయం సాధించి టైటిల్ ఎగరేసుకుపోవడంతో.. డిజప్పాయింట్ అయ్యారు. తమ ఓటమికి కారణాలు వెతుక్కునే పనిలో ఇలాంటి విమర్శలు చేస్తున్నారు. ఈ వివాదంపై.. సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు, భారత క్రికెట్ బోర్డు (BCCI), ఐసీసీ (ICC) ఎలా స్పందిస్తాయో చూడాలి.