Rohit and Kohli retirement, Dravid Journey ends as  coach:  టీమిండియా (Team india)క్రికెట్‌ను సువర్ణ శకం దిశగా నడిపించిన ముగ్గురు దిగ్గజాలు టీ 20ల్లో తమ ఉన్నత కెరీర్‌కు వీడ్కోలు పలికారు. ఇందులో ఇద్దరు రోహిత్‌ శర్మ-విరాట్‌ కోహ్లీ(Rohit-Kohli) అయితే మరొకరు టీమిండియా హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్‌(Rahul Dravid). విశ్వ విజేతలుగా నిలవాలన్న కల నెరవేరగానే వీరు ముగ్గురు తమ కెరీర్‌లకు ముగింపు పలికారు. ఈ ప్రపంచకప్ రోహిత్‌-విరాట్‌ కోహ్లీ ద్వయానికి చివరిదన్న అంచనాలను నిజం చేస్తూ వీరిద్దరూ వీడ్కోలు ప్రకటన చేసేశారు. విధ్వంస బ్యాటర్లుగా... మెరుపు వీరులుగా గుర్తింపు పొందిన ఈ దిగ్గజ ఆటగాళ్ల రిటైర్‌మెంట్‌తో టీమిండియాలో ఓ శకం ముగిసింది. ఎందుకంటే 2007లో తొలిసారి టీ 20 ప్రపంచకప్‌ ముద్దాడిన జట్టులో భాగమైన రోహిత్‌... ఇప్పుడు రెండోసారి ఆ ఘనతను అందుకుని నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. కింగ్‌ విరాట్‌ కోహ్లీ మ్యాచ్‌ ముగిసిన వెంటనే తాను పొట్టి క్రికెట్‌ నుంచి రిటైర్‌ అవుతున్నట్లు ప్రకటించగా... కాసేపటి తర్వాత రోహిత్‌ శర్మ కూడా  ఇదే ప్రకటన చేశాడు. టీ 20 వరల్డ్ కప్‌నకు ముందే తనకు ఇదే చివరి టీ 20 ప్రపంచకప్‌ అని హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్ ప్రకటించేశాడు. దీంతో ఈ అద్భుత గెలుపుతో జగజ్జేతలుగా నిలిచిన తర్వాత వీరి ముగ్గురి కెరీర్‌ ముగిసింది. 

 

రాహుల్‌కు ఘన  వీడ్కోలు

భారత హెడ్‌ కోచ్‌గా ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన రాహుల్‌ ద్రావిడ్‌కు టీమిండియా ఘన వీడ్కోలు పలికింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ప్రత్యేక చొరవ తీసుకుని రాహుల్ ద్రవిడ్‌ను.... జట్టు సభ్యులతో కలిసి గాల్లోకి ఎగరేస్తూ గుడ్‌ బై  చెప్పారు. రాహుల్ ద్రవిడ్ ఎట్టకేలకు మూడో ప్రయత్నంలో వరల్డ్ కప్ ట్రోఫీని అందుకుని విజయ గర్జన చేశాడు. 2003లో ఆటగాడిగా... 2023లో కోచ్‌గా త్రుటిలో ప్రపంచకప్‌ను అందుకునే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఈ రెండు వన్డే ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో భారత్‌ ప్రపంచ కప్ టైటిల్‌ కల నెరవేరలేదు. కానీ ఈసారి టీమిండియాకు ఈ అవకాశాన్ని వదలలేదు. బార్బడోస్‌లో జరిగిన T20 ప్రపంచ కప్ 2024 టైటిల్‌ను గెలిచి... ద్రావిడ్‌కు ఘన వీడ్కోలు పలికారు. ప్రపంచకప్‌ గెలిచిన అనంతరం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ చొరవ తీసుకుని.... రాహుల్ ద్రవిడ్‌ను గాల్లోకి విసురుతూ వీడ్కోలు పలికారు. ఈ విజయం 11 సంవత్సరాల భారత ప్రపంచకప్‌ ట్రోపీ కరువును తీర్చింది. MS ధోని 2007లో మొదటిసారి టీ 20 ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత ఇప్పుడు టీమిండియా రండో టీ 20 ప్రపంచకప్‌ గెలిచింది. 

 

రాహుల్‌కు చాలా ప్రత్యేకం

అందరి ఆటగాళ్ల మాదిరిగానే రాహుల్‌ ద్రావిడ్‌కు టీ 20 ప్రపంచకప్‌ గెలిచిన రోజు చాలా ప్రత్యేకమైనది. సౌరవ్ గంగూలీ నేతృత్వంలో 2003లో వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ ఆడిన రాహుల్‌ ఆ తర్వాత కోచ్‌గా మారాడు. 2003 ప్రపంకప్‌ ఫైనల్‌ జరిగిన సరిగ్గా 20 ఏళ్ల తర్వాత కోచ్‌గా రాహుల్‌కు వన్డే ప్రపంచకప్‌ గెలిచే అవకాశం వచ్చింది. అప్పుడు కూడా ఆస్ట్రేలియానే అడ్డుపడింది. కానీ ఈసారి వచ్చిన అవకాశాన్ని రాహుల్‌తో సహ జట్టు సభ్యులు ఎవరూ వదులుకోలేదు. ప్రపంచకప్‌ గెలిచిన జట్టులో తొలిసారి  భాగమైనందుకు రాహుల్‌ భావోద్వేగానికి గురయ్యాడు. అందుకే ఎప్పుడూ లేదని ఆ ట్రోఫీ చేతుల్లోకి రాగానే విజయ గర్జన చేశాడు. ఎప్పుడూ స్థిమితంగా ఉండే రాహుల్‌ను అలా చూసి క్రికెట్‌ ప్రపంచం కూడా నివ్వెరపోయింది.