Virat kohli- Anushka Sharma phone call : టీ 20 ప్రపంచకప్‌ గెలిచాడు. అప్పటివరకూ వరుసగా విఫలమైన కీలకమైన ప్రపంచకప్‌ ఫైనల్లో విజయాన్ని అందించే ఇన్నింగ్స్‌ ఆడాడు. దశాబ్దాల కలను నెరవేర్చుకున్నాడు. దీంతో కింగ్‌ కోహ్లీ(Virat Kohli) తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. సాధించేశానంటూ గర్జించేశాడు. ఎన్నో ఏళ్లుగా తమకు అందని ద్రాక్షగా మారిన ఆ ప్రపంచకప్‌ను చేతపట్టుకుని మురిసిపోయాడు. ఆ భావోద్వేగంలోనే కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)తో పాటు టీ 20 ప్రపంచకప్‌నకు వీడ్కోలు పలికాడు. టీ 20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత తన కుటుంబ సభ్యులకు వీడియో కాల్‌ చేసిన విరాట్‌ భావోద్వేగంతో మాట్లాడిన దృశ్యాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. 


అనుష్కకు విరాట్‌ ఫోన్‌

17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న తర్వాత బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ స్టేడియంలో రాహుల్ ద్రవిడ్‌తో పాటు ఆటగాళ్లందరూ చాలా ఎమోషనల్‌గా కనిపించారు. టీ 20 ప్రపంచ కప్ ట్రోఫీని రెండోసారి గెలుచుకోవడంతో విరాట్‌ కోహ్లీ కూడా చాలా భావోద్వేగానికి గురయ్యాడు. మైదానం నుంచే తన కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి మాట్లాడాడు. అనుష్కకు ఫోన్‌ చేసిన విరాట్‌... తాను సాధించేశానని చెబుతూ కనిపించాడు. మైదానంలో తన కుటుంబంతో వీడియో కాల్‌ మాట్లాడుతూ విరాట్ కోహ్లీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. T20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత, బార్బడోస్ నుంచి వీడియో కాల్ ద్వారా విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ, పిల్లలు వామిక, అకాయ్‌తో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు. వీడియో కాల్‌ మాట్లాడుతున్న సమయంలో కోహ్లీ చాలా ఉద్వేగభరితంగా కనిపించాడు. కోహ్లీ కళ్లలో ఆనందంతో కన్నీళ్లు తిరిగాయి. వీడియో కాల్‌లో కోహ్లీ తన చిన్న కుమారుడు అకాయ్‌తో ఆడుకుంటూ సరదాగా కనిపించాడు. ఈ సమయంలో కోహ్లీ తన పిల్లలకు ఫ్లయింగ్ కిస్‌లు ఇవ్వడం కూడా కనిపించింది. 


 

కోహ్లీ సంబరాలు

కోహ్లీ  వీడియో కాల్ చేసి తాను త్రివర్ణ పతాకాన్ని ఊపుతూ సంబరాలు చేసుకున్నాడు. ఈ క్షణం నిజంగా చాలా మధురమైనని... మరపురానిదని మ్యాచ్‌ ముగిసిన అనంతరం కోహ్లీ వ్యాఖ్యానించాడు. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ టైటిల్ అందుకున్న కోహ్లి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇదే తన చివరి టీ20 మ్యాచ్ అని.. ఈ కప్ గెలవాలని అనుకున్నామని దాన్ని సాధించామని మ్యాచ్‌ అనంతరం కోహ్లీ వ్యాఖ్యానించాడు. రెండేళ్ల తర్వాత వచ్చే ప్రపంచకప్‌నకు ఇప్పటి నుంచే జట్టును సిద్ధం చేయాల్సి ఉందని అందుకే రిటైర్‌మెంట్‌ ప్రకటిస్తున్నట్లు కోహ్లీ ప్రకటించాడు. యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చేసిందని విరాట్ తెలిపాడు. T20 ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్ వరకు విరాట్ కోహ్లీ ఒక్క భారీ స్కోరు కూడా చేయలేదు. అయితే ఆఖరి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ బ్యాట్‌ ఝుళిపించాడు. ఫైనల్లో విరాట్ చెలరేగుతాడని చాలామంది అంచనా వేశారు. ఆ అంచనాలను నిజం చేస్తూ కోహ్లీ 59 బంతుల్లో 128.81 స్ట్రైక్ రేట్‌తో 6 ఫోర్లు, 2 సిక్సర్లు బాది 76 పరుగులు చేశాడు.