Director Shankar About ‘Indian 2’ Sequel: విశ్వ నటుడు కమల్ హాసన్ హీరో, దిగ్గజ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ సినిమా ‘భారతీయుడు‘. 1996లో విడుదలైన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఈ మూవీని చూసేందుకు జనాలు థియేటర్లకు పోటెత్తారు. వసూళ్ల పరంగానూ సరికొత్త రికార్డులు సృష్టించిన ఈ చిత్రం.. దర్శకుడితో పాటు హీరోకు కనీవినీ ఎరుగని గుర్తింపు తెచ్చి పెట్టింది. చాలా ఏండ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు దర్శకుడు శంకర్. ఈ మూవీలో విలక్షణ నటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలో విడుదలకు రెడీ అవుతోంది.
సీక్వెల్ చేయాలనే ఆలోచన లేదు- శంకర్
ఇక సినిమా రిలీజ్ టైమ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. దర్శకుడు శంకర్, హీరో కమల్ హాసన్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు. నిజానికి తనకు ‘భారతీయుడు’ సీక్వెల్ చేయాలనే ఆలోచన తనకు లేదన్నారు శంకర్. “’భారతీయుడు’ సినిమా చేసే సమయంలో నాకు ఈ చిత్రానికి సీక్వెల్ చేయాలనే ఆలోచన లేదు. కానీ, ఇప్పుడు చేశాం. కొంత మంది అభిమానులు ‘అపరిచితుడు 2’, ‘శివాజీ 2’ కూడా చేయాలన్నారు. 2008లో నాకు ఓ ఆలోచన వచ్చింది. ‘భారతీయుడు’, ‘ఒకే ఒక్కడు’, ‘శివాజీ’ సినిమాల్లోని హీరోల క్యారెక్టర్లను లింక్ చేస్తూ ఓ బ్రహ్మాండమైన ప్రాజెక్టు చేయాలి అనుకున్నాను. ఈ విషయాన్ని తన దగ్గర ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్లకు చెప్పాను. వాళ్లు నా ఆలోచన విని నవ్వారు. వారికి నచ్చలేదని నాకు అనిపించింది. ఫ్రెండ్స్ తో పాటు ఫ్యామిలీ మెంబర్స్ కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో నా ఆలోచనను విరమించుకున్నాను. అయితే, ఈ రోజుల్లో వస్తున్న సినిమాల విషయంలో కొంత ఆందోళన ఉంది. మంచి కథాంశం, దానికి తగిన ఆత్మ లేకుండానే చాలా సినిమాలు తెరకెక్కుతున్నాయి. సోల్ లేని సినిమాలు అప్పటికప్పుడు సంతోషాన్ని కలిగిస్తాయి తప్ప, లాంగ్ టైమ్ లో అవి ప్రేక్షకులకు గుర్తు ఉండవు” అని చెప్పారు.
జులై 12న ‘భారతీయుడు 2’ విడుదల
ఇక 1996లో విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న ‘భారతీయుడు’ సినిమాకు సీక్వెల్ గా ‘భారతీయుడు 2’ తెరకెక్కింది. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగులో ‘భారతీయుడు 2’, తమిళంలో ‘ఇండియన్ 2’, హిందీలో ‘హిందుస్థానీ 2’ పేరుతో విడుదలకాబోతోంది. జులై 12న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో సిద్ధార్థ్, ప్రియా భవానీ శంకర్ సహా పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అటు రామ్ చరణ్ హీరోగా ‘గేమ్ ఛేంజర్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు శంకర్. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావస్తుంది.