Brain Tumor : కొన్ని ఆరోగ్య సమస్యలను చిన్నవేగా.. ఏమి కాదులే తగ్గిపోతాయి అనుకుంటాము. కానీ అవే అసలు కొంపముంచుతాయి అంటున్నారు నిపుణులు. రెగ్యూలర్​ సమస్యలే కదా.. అని లైట్ తీసుకుంటే అవి తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు. వాటిలో తలనొప్పి కూడా ఒకటి. అవును ఉదయాన్నే వచ్చే తలనొప్పి, వికారం, వాంతులు వంటి లక్షణాలు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం అంటున్నారు. 


అస్సలు అశ్రద్ధ చేయొద్దు..


తలనొప్పి, వికారం, వాంతులు చూసేందుకు చిన్న సమస్యలుగానే కనిపిస్తాయి. కానీ ఉదయాన్నే ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు అశ్రద్ధ చేయొద్దంటున్నారు నిపుణులు. ఒత్తిడి, అలసట, చిన్న అనారోగ్యాలకు కారణమవుతాయి కానీ.. ఈ లక్షణాలు ఉదయాన్నే వస్తుంటే అవి బ్రెయిన్ ట్యూమర్​కు దారి తీస్తాయి అంటున్నారు. తలనొప్పి ఎక్కువగా వస్తుంటే అది మెదడులో కణితి వంటి తీవ్రమైన లక్షణాలకు సంబంధించిన హెచ్చరిగా చెప్తున్నారు. 


మెదడులో కణితి ఎలా ఏర్పడుతుందంటే.. 


మెదడు లేదా దాని చుట్టు పక్కల కణజాలాలలో కణాలు అసాధారణంగా పెరిగి.. కణితులకు దారి తీస్తాయి. మెదడులో ప్రారంభమయ్యే ట్యూమర్​లను ప్రైమరీ ట్యూమర్​లని.. ఇతర భాగాలకు వ్యాపించే వాటిని సెకండరీ ట్యూమర్​లని అంటారు. బ్రెయిన్​లోని ట్యూమర్స్​ పరిమాణం, పెరుగుదల.. తలనొప్పి, వాంతులు, వికారం వంటి లక్షణాలను ప్రేరేపిస్తుందని న్యూరోసర్జన్ తెలిపారు. ఇవే కాకుండా కొందరిలో మూర్ఛ, దృష్టి లోపం, మందమరుపు, ప్రవర్తనలో మార్పులు, శరీరంలో తిమ్మరి వంటి లక్షణాలు ఉంటాయి. 


తలనొప్పి ఎక్కువైతే..


సాధారణంగా తలనొప్పి వస్తే ప్రాబ్లమ్ లేదు. కానీ రోజూ తలనొప్పి వస్తూ.. అది భరించలేని విధంగా మారుతూ ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. వాంతులు, వికారం కూడా ఉంటే అవి తీవ్రమైన లక్షణాలుగా పరిగణించాలని చెప్తున్నారు. ఆ సమయంలో వెంటనే వైద్య సాయం తీసుకోవాలని సూచిస్తున్నారు. చాలా మంది ఉదయాన్నే ఫుడ్ తీసుకోకపోవడం వివిధ కారణాల వల్ల తలనొప్పి, వికారం వస్తుంది అనుకుని అశ్రద్ధ చేస్తారు. కానీ అలా చేయడం ప్రాణాంతకమని చెప్తున్నారు. 



లక్షణాలు ఇలా గుర్తించండి.. 


దీర్ఘకాలిక తీవ్రమైన తలనొప్పి వస్తుంటే వైద్యులను సంప్రదించాలి. ముందు తక్కువగా ప్రారంభమై.. కాలక్రమేణా ఎక్కువ అవుతూ ఉంటే.. వెంటనై డాక్టర్​ దగ్గరకు వెళ్లాలి. వాంతులు, చూపు మందగించడం, వికారం, మూర్ఛలు, బలహీనత ఉంటే అవి తీవ్రమైన లక్షణాలుగా గుర్తించి వైద్య చికిత్స్ తీసుకోవాలి. పెయిన్ కిల్లర్స్, ప్రామాణిక చికిత్సలతో సమస్య తగ్గవచ్చు. అలా తగ్గకుంటే.. ట్రీట్​మెంట్​లో లెవెల్స్ పెంచుతారు. ఈ లక్షణాలు గుర్తించి అశ్రద్ధ వహిస్తే మాత్రం ప్రాణానికే ప్రమాదం. కాబట్టి ఉదయాన్నే ఈ లక్షణాలు కనిపిస్తే.. చులకనగా తీసుకోకుండా సీరియస్​గా తీసుకోవాలంటున్నారు నిపుణులు. 


Also Read : వర్షాకాలంలో ఇమ్యూనిటీని ఇలా పెంచుకోండి.. ఆ ఫుడ్స్​కి వీలైనంత దూరంగా ఉండాలట







గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.