Uttarkashi Avalanche: ఉత్తరాఖండ్‌లోని ద్రౌపది దండ-2 పర్వత శిఖరంలో మంచు తుపాను బీభత్సం సృష్టించింది. మంచు చరియలు విరిగిపడటంతో 29 మంది పర్వతారోహులు అక్కడ చిక్కుకుపోయారు. ఇందులో 10 మంది మృతి చెందారు. 8 మందిని కాపాడినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
రెస్క్యూ ఆపరేషన్
నెహ్రూ మౌంటెనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన 29 మంది ట్రైనీలు హిమపాతానికి పర్వతంపై చిక్కుకుపోయినట్లు తొలుత సమాచారం వచ్చింది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ స్వయంగా ఈ మేరకు ట్వీట్ చేశారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఈ ఘటనపై స్పందించారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని సైన్యాన్ని కోరారు.
ఈ సమాచారం అందుకున్న వెంటనే జిల్లా యంత్రాంగం, NDRF, SDRF, సైన్యం & ITBP సిబ్బంది వేగంగా సహాయక చర్యలు చేపట్టారు. దీంతో 8 మందిని రక్షించించారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.
ఎనిమిది మంది ట్రైనీలు రక్షించాం. ఉత్తరకాశీ హిమపాతంలో చిక్కుకున్న మిగిలిన మరో 21 మందిని (అంచనా) రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. - ఉత్తరకాశీ జిల్లా విపత్తు నిర్వహణ కేంద్రం
హెలికాప్టర్ల సాయంతో
ఈ ఘటనలో చిక్కుకుపోయిన వారి కోసం ఐటీబీపీ కూడా సహాయక చర్యలు చేపట్టింది. హెలికాప్టర్ల సాయంతో గాలింపు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
పర్వతారోహణ సంస్థ నుంచి ఒక బృందం 18,000 అడుగుల ఎత్తులో ఉన్న ద్రౌపది దండ-2 పర్వత శిఖరాన్ని చేరుకోవాలని ప్రయత్నించింది. ఉదయం 8 గంటలకు హిమపాతం రావడంతో 29 మంది చిక్కుకుపోయారు. 8 మందిని అధికారులు వెంటనే రక్షించారు. - వివేక్ పాండే, ఐటీబీపీ పీఆర్‌ఓ
Also Read: Yasir Lohar Arrested: జమ్ముకశ్మీర్ డీజీ హత్య కేసు నిందితుడు అరెస్ట్- దర్యాప్తులో షాకింగ్ విషయాలు!