Lawsuit Against CNN: ఆ ఛానల్‌పై ట్రంప్ పరువు నష్టం దావా- రూ.3,867 కోట్లు కట్టాలట!

ABP Desam Updated at: 04 Oct 2022 01:38 PM (IST)
Edited By: Murali Krishna

Lawsuit Against CNN: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. సీఎన్ఎన్‌పై పరువు నష్టం దావా వేశారు.

(Image Source: Getty)

NEXT PREV

Lawsuit Against CNN: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తెరపైకి వచ్చారు. ప్రముఖ వార్తా సంస్థ సీఎన్‌ఎన్‌పై కోర్టులో సోమవారం పరువు నష్టం దావా వేశారు. తనపై సీఎన్‌ఎన్‌ అసత్య ప్రచారానికి పాల్పడుతున్నట్లుగా ట్రంప్ ఆరోపించారు.






యాంటీ ప్రచారం


సీఎన్‌ఎన్ ఉద్దేశపూర్వకంగా తనపై దుష్ప్రచారం చేస్తుందని ట్రంప్ ఆరోపించారు. భవిష్యత్తులో తాను అధ్యక్ష బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయని, వాటిని దెబ్బతీసేలా సీఎన్‌ఎన్‌ తప్పుడు కథనాలు ప్రసారం చేస్తోందని ట్రంప్ అన్నారు. తన పరువుకు భంగం కలిగించినందున సీఎన్ఎన్.. 475 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.3,867.71 కోట్లు) పరిహారాన్ని ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. ఈ మేరకు ఫ్లోరిడా డిస్ట్రిక్ట్‌ కోర్టులో దావా వేశారు.


దాని వల్లే


2020లో తాను పోటీ చేసిన అధ్యక్ష ఎన్నికల సమయంలో 'ది బిగ్‌ లై' పేరిట సీఎన్‌ఎన్‌ ప్రచారం నిర్వహించిందని ట్రంప్ అన్నారు. దీని వల్ల తనకు ఆ ఎన్నికల్లో నష్టం కలిగిందని ట్రంప్ అన్నారు. 



'ది బిగ్‌ లై' పేరిట సీఎన్‌ఎన్‌ జరిపిన దుష్ప్రచారంలో దాదాపు 7,700 సార్లు నా గురించి ప్రస్తావించారు. ప్రజల్ని భయ పెట్టడానికే వాళ్లు అలా చేశారు. ఈ తరహా ప్రచారం నిర్వహిస్తున్న మరికొన్ని ఛానళ్లపై కూడా నేను దావా వేస్తాను. నేను మళ్లీ అధ్యక్ష బరిలో నిలుస్తున్నానే భయంతోనే సీఎన్‌ఎన్‌ దుష్ప్రచారం చేస్తోంది. -                                       డొనాల్డ్ ట్రంప్, అమెరికా మాజీ అధ్యక్షుడు


ట్రంప్‌పై


డొనాల్డ్ ట్రంప్‌పై ఓ రచయిత్రి ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. డొనాల్డ్ ట్రంప్ తనను అత్యాచారం చేశారంటూ రచయిత్రి ఈ జీన్ కారోల్ ఆరోపించారు.1996లో మిడ్‌టౌన్ మాన్‌హాటన్‌లోని బెర్గ్‌డార్ఫ్ గుడ్‌మాన్ డిపార్ట్‌మెంట్ స్టోర్‌లోని డ్రెస్సింగ్ రూమ్‌లో ట్రంప్ తనపై అత్యాచారం చేశారని రచయిత్రి ఈ జీన్ కారోల్ ఆరోపించారు. ట్రంప్‌పై తన క్లయింట్ అయిన రచయిత్రి  జీన్ కారోల్ కోర్టులో దావా వేయాలని యోచిస్తున్నట్లు ఆమె తరఫు న్యాయవాది తెలిపారు.


ట్రంప్ తనపై అత్యాచారం చేయడం వల్ల తాను మానసిక క్షోభను అనుభవించానని కారోల్ ఆరోపించారు. అందుకే  కోర్టులో దావా వేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.


తోసిపుచ్చిన ట్రంప్


ఈ ఆరోపణలను ట్రంప్ ఖండించారు. కారోల్‌పై తాను అత్యాచారం చేయలేదని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. కారోల్ రాసిన పుస్తకాన్ని విక్రయించడానికి తనపై అత్యాచార ఆరోపణలు చేస్తున్నట్లు ట్రంప్ అన్నారు. 


Also Read: Yasir Lohar Arrested: జమ్ముకశ్మీర్ డీజీ హత్య కేసు నిందితుడు అరెస్ట్- దర్యాప్తులో షాకింగ్ విషయాలు!


Also Read: Ballistic Missile Over Japan: దూకుడు పెంచిన కిమ్- జపాన్ మీదుగా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం!

Published at: 04 Oct 2022 01:33 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.