Karnataka Road Accident: చిన్న కుటుంబం చింత లేని కుటుంబం. వారిద్దరూ వారికిద్దరు. అప్పటివరకు హాయిగా సాగిపోతున్న వారి జీవితంలో ఓ వ్యాధి అడుగుపెట్టింది. చిన్న కుమారుడికి ప్రాణాంతక వ్యాధి సోకిందని తెలిసి ఆ దంపతులిద్దరూ కన్నీరుమున్నీరయ్యారు. చికిత్స చేయించేందుకు డబ్బులు లేక కనపడిన వాళ్లనల్లా సాయం చేయమన్నారు. చివరకు బాబు చికిత్స కోసం అవసరం అయ్యే కోటి రూపాయలు సాయం చేస్తామని ఓ సంస్థ ముందుకు రావడంతో ఆనందంతో ఆస్పత్రికి వెళ్లేందుకు పయనం అయ్యారు. కానీ మధ్యలోనే మాంసపు ముద్దల్లా మారి ఆ పిల్లలిద్దరినీ అనాథలను చేశారు.
ప్రాణాంతక వ్యాధి సోకిందని తెలిసి కన్నీరుమున్నీరు..
తమిళనాడులోని రాణిపేట జిల్లా కళ్లిపట్టుకు చెందిన బాలమురుగన్(45), సెల్వి(36) దంపతులకు ఇద్దరు కుమారులు. వీరు కూలీ పని చేసుకుంటూ ఉన్నంతలో సంతోషంగా గడుపుతున్నారు. అయితే చాలా రోజులుగా బెంగళూరులోనే ఉంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే నాలుగేళ్ల చిన్న కుమారుడికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు చేసిన వైద్యులు బాబుకు ప్రాణాంతక వ్యాధి సోకిందని చెప్పడంతో కన్నీరుమున్నీరయ్యారు. చికిత్స కోసం కోటి రూపాయల వరకు ఖర్చు అవుతుందని వివరించే సరికి ఇక తమ బాబును కాపాడుకోలేమని వాపోయారు. డబ్బులు లేవనే బాధ ఓ వైపు అయితే ఎలాగైనా సరే పిల్లాడిని కాపాడుకోవలన్న ఆశ మరోవైపు. బాబు చికిత్సం కోసం తమకు తెలిసిన స్నేహితులు, బంధువుల అందరి దగ్గరా ఆర్థిక సాయం చేయమని ఆర్జించారు.
పెద్దకుమారుడిని తాత వద్ద ఉంచి ఆస్పత్రికి పయనం..
చికిత్స కోసం బెంగళూరులోని ఓ సంస్థ కోటి రూపాయల ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ వార్త తెలుసుకున్న భార్యాభర్తలు ఇక తమ బాబాను కాపాడుకోవచ్చని ఆనంద పడిపోయారు. వెంటనే ఆస్పత్రికి వెళ్లేందుకు సిద్ధం అయ్యారు. ఈ క్రమంలోనే పెద్ద బాబును బెంగళూరు కత్రిగుప్పెలోని తాత వద్ద ఉంచి శుక్రారం తమిళనాడులోని స్వగ్రామానికి వచ్చారు. కొంత డబ్బును సమకూర్చుకున్నాక కళ్లిపట్టు నుంచి బంధువులు ఉన్న చిత్తూరు జిల్లా జలిజకండ్రిగ చేరుకున్నారు. ఆదివారం రాత్రి 9.30 గంటలకు కేఎస్ఆర్టీసీ బస్సులో బెంగళూరుకు ప్రయాణం అయ్యారు.
ప్రమాదంలో దంపతుల మృతి..
హోసకోటె మైలాపుర గేటు వద్ద ఆర్ధరాత్రి వేశ రోడ్డు పక్కన రాళ్ల లోడుతో నిలిపి ఉంచిన లారీనీ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో బాలమురుగన్, సెల్వి మాంసం ముద్దులుగా మారారు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది కూడా తీవ్రంగా గయపడ్డారు. వీరందరిని బెంగళూరు మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. వారిలో బాలమురుగన్ కుమారుడు కూడా ఉన్నాడు. అసలే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న ఆ చిన్నారి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరాడు. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం అని, ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడని బెంగళూరు గ్రామీణ జిల్లా ఎస్పీ మల్లికార్దున తెలిపారు. ఙటనలో చిత్తూరు జిల్లా పాలసముద్రం మండల వాసులు పలువురికి గాయాలు అయ్యాయి. సోమవార రాత్రి ఎనిమిది గంటలకు మృతదేహాలు కళ్లిపట్టుకు చేరుకోవడంతో ఏఫఫీ-తమిళనాడు సరిహద్దులోని ఆ గ్రామంలో విషాదం నెలకొంది.